జోరుగా జనసమీకరణ సమావేశాలు

ABN , First Publish Date - 2022-08-19T05:44:31+05:30 IST

సీఎం కేసీఆర్‌ సభకు 24గంటల సమయం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభకు 48గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పోటాపోటీగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటి

జోరుగా జనసమీకరణ సమావేశాలు

మొదలైన పార్టీల నేతల వలసలు 

నల్లగొండ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సీఎం కేసీఆర్‌ సభకు 24గంటల సమయం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభకు 48గంటల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పోటాపోటీగా మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఓ వైపు మండలాల వారీగా, గ్రామాల వారీగా సమావేశాలు జరుపుతూ మరోవైపు జనసమీకరణ, సభాస్థలి ఏర్పాట్లలో కీలక నేతలు నిమగ్నమయ్యారు. మంత్రి జగదీ్‌షరెడ్డి ఉదయం నుంచి సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పలు చోట్ల పాల్గొని సాయంత్రానికి నియోజకవర్గానికి చేరుకున్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జనసమితి నియోజకవర్గ కన్వీనర్‌ నాగిళ్ల శంకర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత సభాస్థలిని పరిశీలించారు. చండూరులో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్‌ సభకు మరో 24 గంటలు ఉండటంతో నాయకులు వాహనాలు సమకూరుస్తున్నారు. మునుగోడుతోపాటు నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి సీఎం సభకు జన సమీకరణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మర్రిగూడెలో భూ నిర్వాసితులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష కేంద్రానికి టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం చేరుకుని వారికి మద్దతు పలికారు. రాజగోపాల్‌రెడ్డి సైతం నిర్వాసితులకు మద్దతుపలికారు. చండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. మునుగోడులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే సీతక్కతో పాటు విజయరమణారావు, నాయకులు పున్న కైలా్‌షనేత, చలమల కృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. 

మునుగోడుకు చేరిన బీజేపీ నేతలు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 21న మునుగోడు పర్యటన ఖరారు కావడంతో ఆ పార్టీ కీలక నేతలు మునుగోడు బాటపట్టారు. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో మొదటిరోజే అన్ని మండలాల్లో సమావేశాలు ప్రారంభమయ్యాయి. మునుగోడు మండల ఇన్‌చార్జిగా ఈటల రాజేందర్‌ను కేటాయించగా ఆయన ఇదే మండలంలోని తన అత్తగారి గ్రామం పలివెలలో మండల సమావేశాన్ని, నల్లగొండ జిల్లాకు చెందిన బీజేపీ కీలక నేతలతో భేటీ నిర్వహించారు. రెండు లక్షలమంది జనసమీకరణ లక్ష్యంగా మండల సమావేశాలు ప్రారంభించారు. చౌటుప్పల్‌ మండలంలో సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎ్‌స ప్రభాకర్‌, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. నారాయణపురం మండల సమావేశానికి కూన శ్రీశైలంగౌడ్‌, మాజీ మంత్రి రవీంద్రనాయక్‌, చండూరు మండల సమావేశానికి నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే విజయ్‌పాల్‌రెడ్డి హాజరయ్యా రు. ఓ వైపు జనసమీకరణ సమావేశాలతో పాటు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి గట్టుప్పల్‌ మండలకేంద్రంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జన సమీకరణకు మునుగోడుతోపాటు నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గానికి 12వేల మంది చొప్పున జనసమీకరణ చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2022-08-19T05:44:31+05:30 IST