పెళ్ళిలో హోరెత్తించే సంగీతం.... కోళ్ళఫారం కొంపముంచింది

ABN , First Publish Date - 2021-11-24T16:59:21+05:30 IST

''ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది''అనే సామెత ఎలానూ ఉంది. ఇలాంటి ఒక సంఘటనే ఒడిశాలోని..

పెళ్ళిలో హోరెత్తించే సంగీతం.... కోళ్ళఫారం కొంపముంచింది

భువనేశ్వర్: ''ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది''అనే సామెత ఎలానూ ఉంది. ఇలాంటి ఒక సంఘటనే ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో హోరెత్తించిన వాద్య ఘోష ఒక కోళ్లఫారం యజమాని కొంప ముంచింది. పౌల్ట్రీ ఫారంలోని 63 కోళ్లు 'గుండెపోటు'తో చనిపోయాయి. పౌల్ట్రీ ఫారం యజమాని రంజిత్ కుమార్ దీనిపై నీలగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ పార్టీ పెద్ద సౌండ్‌తో తన పౌల్ట్రీ ఫారం మీదుగా వెళ్లిందని, తాను డీజే వద్దకు వెళ్లి కోళ్లు బెదురుతాయని, సౌండ్ తగ్గించాలని  కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని రంజిత్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పెళ్లికొడుకు మిత్రులు తనపై పెద్దగా కేకలు వేయడమే కాకుండా మరింత సౌండ్ పెంచి హంగామా సృష్టించారని వాపోయాడు. ఉద్దేశపూర్వకంగానే బ్యాండ్ పార్టీని తన పౌల్ట్రీ ఫారం దగ్గర ఆపి 15 నిమిషాల పాటు వాద్య ఘోష హెరెత్తించారని అతను ఫిర్యాదు చేశాడు. ఊరేగింపు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత తాను తిరిగి కోళ్ల ఫామ్‌లోకి వెళ్లగానే అక్కడ కోళ్లు నేలపై పడి ఉండటం చూసి షాక్ తిన్నానని చెప్పాడు. వెంటనే వెటర్నరీ వైద్యులు వచ్చి చూశారని, గుండెపోటుతోనే కోళ్లు చనిపోయాయని నిర్దారించారని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన కోళ్లఫారంలో సుమారు 2,000 కోళ్లు ఉన్నాయని, 63 కోళ్లు అక్కడికక్కడే చనిపోయాయని, ఒక్కో కోడి బరువు 3 కిలోలు ఉంటుందని చెప్పారు. అయితే, దర్యాప్తు పూర్తయ్యేంత వరకూ కోళ్లను అక్కడి నుంచి తీయవద్దని పోలీసులు చెప్పడంతో వాటిని డిస్పోజ్ చేయలేదని రంజిత్ కుమార్ చెప్పారు. పౌల్ట్రీ ఫారమ్‌లోని కోళ్లకు ఎలాంటి జబ్బూ లేదని తెలిపారు.


కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. పెళ్లి కొడుకు కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ బుధవారంనాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని కోరినట్టు నీలగిరి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఒక నిర్దిష్ట పరిమితి దాటి శబ్దాలు వినాల్సి వస్తే కోళ్లకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని, పెద్ద పెద్ద సౌండ్లు, బాణసంచాకు జంతువులు, పక్షలు బెదరిపోతుంటాయని వెటర్నరీ వైద్యుడు సిబా ప్రసాద్ దాస్ వివరించారు.

Updated Date - 2021-11-24T16:59:21+05:30 IST