జోరుగా అక్రమ లే అవుట్లు

ABN , First Publish Date - 2022-01-24T05:50:29+05:30 IST

డోన్‌లో అనధికార లే అవుట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. రాళ్లు పాతేసి ఇష్టం వచ్చినట్లు ప్లాట్లు అమ్ముకుంటున్నారు.

జోరుగా అక్రమ లే అవుట్లు
డోన్‌లో వేసిన అనధికార లేఅవుట్‌

డోన్‌, జనవరి 23: డోన్‌లో అనధికార లే అవుట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది.  రాళ్లు పాతేసి ఇష్టం వచ్చినట్లు ప్లాట్లు అమ్ముకుంటున్నారు.   డోన్‌ మున్సిపాలిటీతో పాటు హైవే వెంట   అనధికార లేఅవుట్లు వెలుస్తున్నాయి. పట్టణంలో లే అవుట్లు వేయాలంటే.. తప్పనిసరిగా మున్సిపాలిటీకి   సర్వే నెంబర్‌,   విస్తీర్ణం వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన   ఫీజు చెల్లించాలి.  లేఅవుట్లలో 40 అడుగుల రోడ్డు వేయాలి. మున్సిపాలిటీకి పది శాతం భూమి ఇవ్వాలి.   మరో 5 శాతం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నిబంధనలేవీ లేకుండా దందా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


రాళ్లు పాతి..  


 పట్టణంలోని వైష్ణవి డిగ్రీ కళాశాల సమీపంలో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో అనధికార లే అవుట్‌ వేశారు. కుడా అనుమతులు లేకుండానే రాళ్లను పాతేసి.. ప్లాట్లను వేస్తున్నారు. రోడ్లు 40 అడుగులు ఉండాల్సి ఉండగా.. కేవలం 15 అడుగులతో రోడ్లను వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.   పట్టణంలోని కొత్తపేట, శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ కాలనీ, శ్రీరామ్‌నగర్‌, హైవే వెంట కూడా అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి.  


అంతా పేపర్ల మీదనే వ్యాపారం: 


ఈ అనధికార లేఅవుట్ల వ్యాపారమంతా పేపర్ల మీదే పెద్ద ఎత్తున   నడుస్తోంది. అధికార లేఅవుట్ల  బ్లూప్రింట్‌ పేపర్లలో ఉన్న నెంబర్లతోనే    సెంటు స్థలం రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు అమ్ముకుంటున్నారు. అడ్వాన్సుల దగ్గర నుంచి ప్లాట్లు రిజిస్ర్టేషన్ల వరకూ అంతా పేపర్లల్లోని నెంబర్ల మీదే నడుస్తోంది.  


 చర్యలు తీసుకుంటాం


డోన్‌ మున్సిపాలిటీ పరిధిలో అనధికార లే అవుట్లపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ ప్రాంతంలో అనధికార లే అవుట్లు ఉన్నాయో ఇదివరకే గుర్తించి రాళ్లను తొలగించాం. పట్టణంలో అనధికార లే అవుట్లు ఎక్కడైనా వేసి వుంటే.. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం.  


 - ఆంజాద్‌బాషా, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, డోన్‌


Updated Date - 2022-01-24T05:50:29+05:30 IST