లెక్క చూసి నొక్కేస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-10-01T09:39:56+05:30 IST

అక్రమాలను వెలికి తీయాల్సినోళ్లే మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లెక్క చూసి నొక్కేస్తున్నారు..!

పంచాయతీల ‘ఆడిట్‌’లో అక్రమ వసూళ్లు

ఖర్చు చేసిన నిధుల్లో 2శాతం నుంచి 3శాతం కమీషన్‌

లెక్కల్లో ట్రాక్టర్ల కొనుగోళ్లనూ వదలని అధికారులు

అక్రమాలపై జిల్లాలో జోరుగా చర్చ


ఖమ్మం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):  అక్రమాలను వెలికి తీయాల్సినోళ్లే మరిన్ని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీల్లో నిధుల ఖర్చు లెక్కగట్టి మరీ కమీషన్‌ వసూలు చేస్తున్నాని, అవి ఇవ్వకపోతే ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఖమ్మం జిల్లాలోని పంచాయతీల్లో జరుగుతున్న ఆడిటింగ్‌ ప్రక్రియ తీరు పలు అనుమానులకు తావిస్తోంది. జిల్లాలో గత నెలలో ఆడిటింగ్‌ ప్రారంభమవగా ప్రతీ మండలంలో దాదాపు వారంపాటు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో పలు పంచాయతీలకు చెందిన కొందరు గ్రామస్థులు, పాలకవర్గసభ్యులు తమ పంచాయతీల్లో అక్రమాలు జరిగాయంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా.. ఎలాంటి అక్రమాలు జరగలేదని తేల్చడం వెనుక భారీగానే అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. అడిటింగ్‌ అధికారులు అందినకాడికి తీసుకుని లెక్కలు నొక్కేశారన్న చర్చ జరుగుతోంది. 


బోనకల్‌ మండలంలోని ఓ చిన్న పంచాయతీలో రూ.27లక్షలకు ఆడిట్‌ జరగ్గా.. అక్కడ ఎలాంటి అక్రమాలు జరగలేదని, లెక్కలు సక్రమంగా ఉన్నాయని ఆడిటింగ్‌ అధికారులు తేల్చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ పంచాయతీలో జరిగిన అక్రమాల లెక్కలు బయట పెట్టకుండా ఉండేందుకు సదరు అధికారులు సంబంధిత పంచాయతీ సర్పంచ్‌ నుంచి రూ.81వేలను డిమాండ్‌ చేయగా.. బేరమాడి రూ.60వేలకు ఒప్పందం చేసుకుని ఆ నగదును ముట్టజెప్పినట్టు సమాచారం. వైరా నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రూ.25లక్షల నిధుల ఖర్చుకుగాను రూ. 50వేలు వసూలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఈ రెండు పంచాయతీల్లోనే కాదు జిల్లాలోని ప్రతీ పంచాయతీలో జరిగే ఆడిట్‌లోనూ ఇదే తంతు జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


2శాతం నుంచి 3శాతం కమీషన్‌ ముట్టజెప్పాల్సిందే..

పెద్ద పంచాయతీ, చిన్న పంచాయతీ తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆడిటింగ్‌కు వెళ్లిన అధికారులకు అన్నీ రకాల సౌకర్యాలు కల్పించాల్సిందేనట. అలా వెళ్లిన అధికారులు లెక్కలు మొత్తం చూసిన తర్వాత బేరాలు ఆడటం మొదలు పెడుతున్నారట. దీంతో తమ పంచాయతీల్లో జరిగిన అక్రమాలు బయటకు రాకుండా ఉండాలంటే సంబంధిత సర్పంచ్‌లు అధికారులకు అడిగినంతా ముట్టజెబుతున్నారని తెలుస్తోంది. ఇలా ప్రతీ పంచాయతీలో ఖర్చయిన నిధుల ప్రకారం 2శాతం నుంచి 3శాతం కమీషన్‌ అడుగుతున్నారని సమాచారం. ఒకవేళ ఎవరైనా పరపతి వాడినా.. లేక తాము చెప్పిన కమీషన్‌కు అంగీకరించకపోయినా సమయం ప్రకారం అక్రమాలు బయటకు వస్తాయని బెదిరిస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత ఎంతోకొంతకు బేరమాడి అందినకాడికి దండుకుని లెక్కలు మార్చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ కమీషన్‌లో తమ ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఇవ్వాలని సదరు అధికారులు చెబుతుండటం గమనార్హం. ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద, చిన్న పంచాయతీల్లో వసూళ్లకు పాల్పడితే వారి వసూలు చేసిన నగదు రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా. 


పంచాయతీ ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా..

పంచాయతీల్లో ఖర్చు చేసిన నిధులకుగాను కమీషన్‌ లెక్కలో ట్రాక్టర్ల కొనుగోలు లెక్కలు కూడా చేరుస్తున్నారని కొందరు సర్పంచ్‌లు తమ తోటి సర్పంచ్‌లతో చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ప్రతి పంచాయతీలో ట్రాక్టర్‌ కొనుగోలుపై రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఒక్క పంచాయతీలో పనిచేసే సిబ్బంది జీతాలు మినహా మిగిలిన అన్ని ఖర్చులనూ లెక్కించి కమీషన్‌ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలు మొదలు సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, వీధిలైట్లు, నల్లా కనెక్షన్లకు అనుమతులు, పారిశుధ్య పనులు లాంటి వాటిల్లో అక్రమాలకు పాల్పడటం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడిన కొందరు ప్రజాప్రతినిధులు ముందుగానే సంబంధిత అధికారులకు అడిగినంతా ముట్టజెప్పి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఈ విషయాలు ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు తెలిసినా నేరుగా వారిని మందలించలేకపోతున్నారని ఒకవేళ మందలిస్తే తమ అనుచరగణమైన సర్పంచ్‌లు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండటంతో మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. 

Updated Date - 2020-10-01T09:39:56+05:30 IST