తోటలో భారీ జనసందోహంతో ఉన్న YSRCP MLA పెద్దారెడ్డిని కలిసి డీఎస్పీ.. పలు అనుమానాలు..!

ABN , First Publish Date - 2022-01-15T06:26:42+05:30 IST

తోటలో భారీ జనసందోహంతో ఉన్న YSRCP MLA పెద్దారెడ్డిని కలిసి డీఎస్పీ.. పలు అనుమానాలు..!

తోటలో భారీ జనసందోహంతో ఉన్న YSRCP MLA పెద్దారెడ్డిని కలిసి డీఎస్పీ.. పలు అనుమానాలు..!

  • జోరుగా కోడి పందేలు
  • తాడిపత్రి ఎమ్మెల్యే తోట వద్ద నిర్వహణ
  • భారీగా హాజరైన ప్రజలు 
  • డీఎస్పీ ఆధ్వర్యంలో  పోలీసుల దాడులు
  • ఉదయం 11 గంటలకు దాడులు చేయగా..
  • రాత్రి 9 గంటలైనా నమోదుకాని కేసు
  • ఎమ్మెల్యేతో సమావేశమైన డీఎస్పీ


అనంతపురం, జనవరి 14: జిల్లాలో పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కోడిపందేలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం తి మ్మంపల్లి వద్ద ఉన్న తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోట వద్ద శుక్రవారం భారీఎత్తున కోడిపందేలు నిర్వహించినట్లు సమాచారం. కోడి పందేలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చినట్లు తెలిసింది. భారీ జనసందోహం మధ్య పదుల సంఖ్యలో వచ్చిన కోళ్లతో పందేలు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు వివరించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో తాడిపత్రి రూరల్‌ సీఐ మల్లికార్జున గుప్తా, యల్లనూరు, పుట్లూరు ఎస్‌ఐలు రవికిరణ్‌, గురుప్రసాద్‌రెడ్డి, సిబ్బందితో కలిసి దాడులు చేశారని చెబుతున్నారు.


దీంతో కోడిపందెం రాయుళ్లతోపాటు హాజరైన ప్రజలు పరుగులు తీశారని, ఘటనాస్థలంలో నాలుగు కోళ్లు, 5 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకుని, పుట్లూరు పోలీసు స్టేషనకు తరలించినట్లు తెలిసింది. పోలీసుల దాడుల తర్వాత సాయంత్రం కూడా భారీఎత్తున కోడి పందేలు జరిగాయని తెలుస్తోంది. ఉదయం పోలీసుల దాడుల నుంచి పరారైన వారు తిరిగి కోడిపందేలు నిర్వహించారని సమాచారం.


ఎమ్మెల్యేను కలిసిన డీఎస్పీ

తోటలో ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డితో డీఎస్పీ చైతన్య కలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోడిపందేల దాడులకు వెళ్లి తిరిగి వస్తూ తోటలో ఉన్న పెద్దారెడ్డి వద్దకెళ్లి మాట్లాడారు. కోడిపందేల దాడులకు సంబంధించి వీరి మధ్య చర్చ సాగినట్లు సమాచారం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తోట వద్ద భారీ జనసందోహం మధ్య కోడిపందేలు నిర్వహించినా వారిలో ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకపోవడాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్యే పెద్దారెడ్డి సూచనల మేరకే డీఎస్పీతోపాటు అధికారులు రిక్తహస్తాలతో తిరిగి వచ్చారని తెలుస్తోంది. కోడిపందెంరాయుళ్లలో ఎక్కువమంది పెద్దారెడ్డి అనుచరులున్నారన్న కారణంగానే వారిని అరెస్టు చేయకుండా పోలీసు అధికారులు జాప్యం చేస్తున్నారు. ఉదయం 11 గంటల సమయంలో కోడిపందేల శిబిరంపై దాడులు చేసినా.. రాత్రి 9 గంటల వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వందలాదిమంది ప్రజల సమక్షంలో భారీగా కోడిపందేలు జరిగినా అందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకోకపోవడం, నిర్వాహకులతోపాటు పందెంరాయుళ్ల గురించి సేకరించిన వివరాలతో ఎందుకు కేసు నమోదు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో డీఎస్పీ కలవడం వల్లే కేసు నమోదులో తీవ్ర జాప్యం జరుగుతోందన్న ప్రచారం కూడా ఉంది. కోడిపందేల శిబిరంపై దాడుల విషయమై ‘ఆంధ్రజ్యోతి’తో డీఎస్పీ మాట్లాడుతూ.. దాడుల్లో 5 మోటారుసైకిళ్లు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కోడిపందేల నిర్వాహకుల గురించి ఆరా తీస్తున్నామనీ, వివరాలు సేకరించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-01-15T06:26:42+05:30 IST