జోరుగా మొరం దందా

ABN , First Publish Date - 2022-06-30T05:45:36+05:30 IST

జిల్లాలో అక్రమార్కుల తాకిడికి ప్రకృతి సంపద అయిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఏకంగా మండల కేంద్రం సమీపంలో ఉండే గుట్టలను, కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

జోరుగా మొరం దందా
గాంధారి మండలం గుడిమెట్‌, పలు తండాల పరిధిలోని గుట్టలను తవ్వేసిన దృశ్యం

- జిల్లాలో స్థానిక నేతల అండతో మొరం తవ్వకాలు

- సదాశివనగర్‌, గాంధారిలో అక్రమంగా మొరం తవ్వకాలు

- ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గుట్టల తవ్వకం

- అభివృద్ధి పనుల పేరిట గుట్టలను కొల్లగొడుతున్న వైనం

- ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2వేలకు పైగానే విక్రయం

- మామూలుగానే తీసుకుంటున్న సంబంధిత శాఖలు


కామారెడ్డి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమార్కుల తాకిడికి ప్రకృతి సంపద అయిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఏకంగా మండల కేంద్రం సమీపంలో ఉండే గుట్టలను, కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక ప్రజలు ఎవరైన నిలదీస్తే అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకొని తవ్వకాలు చేపడుతున్నామంటూ గుట్టలను మింగేస్తున్నారు. మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండే సదాశివనగర్‌, గాంధారి మండల కేంద్రం శివారులతో పాటు గ్రామాలు, తండాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలంలోనే బారీ గుట్టను మొరం తవ్వకాలతో తవ్వేశారు. ఈ తవ్వకాలకు స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారం, స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్లగొడుతుండడంతో రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తవ్వకాలకు అండగా నిలవడం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

సదాశివనగర్‌, గాంధారిలో గుట్టుగా మొరం దందా

సదాశివనగర్‌, గాంధారి మండలాల్లో ఎటు చూసినా పచ్చని కొండలు, ఎర్రటి మొరం గుట్టలు ప్రకృతి సంపద సుందరంగా ఉంటుంది. అలాంటి అందాలు ఉన్నా ఈ మండలాల్లో గుట్టుగా మొరం తవ్వకాలు జరుగుతున్నాయి. గతంలో గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అక్ర మ వెంచర్లలో రోడ్లు వేసేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో మొరం తవ్వకాలు జరుపుతూ అక్రమంగా తరలించేవారు. అదేవిధంగా ప్రైవేట్‌గా అమ్ముకొని అక్రమార్కులు సొమ్ము చేసుకునే వారు. ఇటీవల కాలంలో గాంఽధారి మండల కేంద్ర శివారుతో పాటు గుడిమెట్‌ గ్రామంలోని మహాదేవుని గుట్టతో పాటు పలు తండాల్లో ప్రైవేట్‌, ప్రభుత్వ, రెవెన్యూ స్థలాల్లోని గుట్టల్లో అక్రమంగా తవ్వకాలు గత కొన్ని రోజులుగా సాగుతున్నాయి. మండల కేంద్రానికి ప్రతిరోజూ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వందల టిప్పర్లలో తరలిస్తూ ప్రైవేట్‌ స్థలంలో బారీగా డంప్‌లు నిల్వ చేశారు. సదాశివనగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో గుట్టలను తవ్వేస్తున్నారు. స్థానికంగా ఉండే కొందరు ప్రజాప్రతినిధుల అండతో వారి కుటుంబసభ్యులు అక్రమంగా తవ్వకాలు జరుపుతూ ప్రైవేట్‌గా అమ్ముకుంటున్నారు. మొరం అక్రమ రవాణా జరుపుతున్నా పట్టింపు లేకుండా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ తవ్వకాలపై రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది సహకారం ఉండడంతోనే అక్రమర్కులు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.

అభివృద్ధి పనుల పేరిట పక్కదారి

రహదారుల నిర్మాణాలకు మొరం అవసరం కావడంతో కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు జిల్లా యంత్రాంగం నుంచి మొరం తవ్వకాలు చేసుకోవడానికి సంబంధిత శాఖల అధికారుల సిఫారసుతో క్వారీల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఆధారంగా మండల తహసీల్దార్‌లు ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండానే కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఎక్కడ ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు ఉంటే అక్కడ అక్రమంగా మొరం తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లోని గుట్టలను, అసైన్‌మెంట్‌ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేస్తూ స్థానికంగా నిర్వహించే వెంచర్లకు తరలిస్తున్నారు. వెంచర్లలో వేసే రోడ్లకు ఈ మొరాన్ని ఉపయోగిస్తూ దర్జాగా దందా కొనసాగిస్తున్నారు. ఇలా జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్‌లలోని గాంధారి, సదాశివనగర్‌, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్‌, రామారెడ్డి, నస్రూల్లాబాద్‌, మద్నూర్‌, బిచ్కుంద, పిట్లం, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, లింగంపేట్‌ తదితర మండలాల్లోని అటవీప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమార్కులు

గ్రానైట్‌, కంకరక్వారీల మాదిరిగానే మొరం తవ్వకాలకు భూగర్భగనుల శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి పర్యావరాణాన్ని దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటి పారుదల శాఖ, వ్యవసాయ తదితర శాఖల వారు తవ్వకాలకు అనుమతి ఇస్తారు. ఒక్కో క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.30 రాయల్టీ చెల్లించాలి. అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికివేస్తేనే కేసులు పెట్టే అటవీశాఖ అధికారులు ఆ చెట్లను కూడా నరికివేసి మొర్రం గుట్టలను తవ్వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములు అయిన పట్టా భూములైన నిబంధనలకు లోబడే అనుమతులు పొందాలి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో మొరం తవ్వకాలకు అనుమతులు లేవు. అయినప్పటికీ మొరం అక్రమంగా తవ్వకాలను చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ఎక్కడా తవ్వకాలు చేసిన హెక్టార్‌కు రూ.50వేలు గనుల శాఖకు మరో రూ.50వేలు తపాలా శాఖలో రిజిస్ర్టేషన్‌ కోసం చెల్లించాలి. విక్రయంపై అదనంగా 2.25 శాతం పన్ను చెల్లించాలి. ఇలా చెల్లించకపోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో చేపడుతున్న మొరం తవ్వకాలతో రూ. లక్షల్లో ప్రజాధనం అక్రమార్కుల పరమవుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్రాక్టర్‌ మొరం రూ.2వేల వరకు విక్రయిస్తుండగా ఒక్కో టిప్పర్‌ మొరం రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి పైసా చెల్లించకుండా ఆదాయానికి గండి కొడుతున్నారు.

Updated Date - 2022-06-30T05:45:36+05:30 IST