KCRతో విభేదాలు.. పారిశ్రామికవేత్త జూపల్లిపై కమలం గురి..!?

ABN , First Publish Date - 2022-05-20T09:08:16+05:30 IST

తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు దృష్టి పెట్టారు.

KCRతో విభేదాలు.. పారిశ్రామికవేత్త జూపల్లిపై కమలం గురి..!?

  • రామేశ్వరరావును రాజ్యసభకు పంపే చాన్స్‌!
  • తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపైనా బీజేపీ కన్ను
  • త్వరలోనే విశ్వేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి చేరిక!
  • నల్లగొండ జిల్లాలో సీనియర్‌ నేత కుమారుడూ?
  • ఉత్తర తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత కూడా!
  • చర్చలు జరుపుతున్న మాజీ ఎంపీ పొంగులేటి?
  • ఈటలకు ప్రాధాన్యం పెంచనున్న కాషాయ పార్టీ?
  • త్వరలోనే తెలంగాణలో చింతన్‌ బైఠక్‌


న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి):తెలంగాణలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావుపై కమలనాథులు దృష్టి పెట్టారు. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమతామూర్తి ప్రారంభోత్సవం సమయంలో ఆయనకు, సీఎం కేసీఆర్‌కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జూపల్లికి, కేసీఆర్‌కు పొసగడం లేదని భావిస్తున్న బీజేపీ వర్గాలు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ఖాయమని చెబుతున్నాయి. ఆయన సేవలను పార్టీకి ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.


రాజ్యసభకు నామినేట్‌ చేసే ప్రతిపాదన కూడా వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీజేపీ ఆకర్ష్‌ ప్రయత్నాలకు రామేశ్వరరావు ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే. కాగా, కాంగ్రెస్‌ నేతలపైనా బీజేపీ దృష్టి పెట్టింది. వారిపై ‘ఆకర్ష్‌’ మంత్రాన్ని ప్రయోగించాలంటూ పార్టీ నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం సంకేతాలు పంపించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. ఇటీవల బండి సంజయ్‌ను కలిసిన కొండా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారని, ఆయన తిరిగి రాగానే బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులపై కూడా ఒత్తిడి పెంచుతున్నట్లు తెలిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్‌, భూపేందర్‌ యాదవ్‌లను కలుసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్‌ నేత కుమారుడూ బీజేపీలో చేరే సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కూడా బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.


ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ సీనియర్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి శివప్రకాశ్‌తో సమావేశమైనట్లు తెలిసింది. కాగా, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌.. పార్టీలో తనకు అంత ప్రాధాన్యమివ్వకపోవడంపై కొంత అసంతృప్తిగా ఉన్నారని.. ఇతర ప్రముఖ నేతలతో కలిసి ప్రాంతీయ పార్టీ స్థాపించే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారన్న సమాచారం అందుకున్న బీజేపీ అధిష్ఠానం వారితో చర్చలు జరిపి తగిన ప్రాధాన్యం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద తెలంగాణలో జోరు పెంచాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చారు. కేసీఆర్‌ను అవినీతి రారాజుగా అభివర్ణించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అమిత్‌ షా హామీ ఇచ్చారు. గుజరాత్‌ తరహాలోనే తెలంగాణలో కూడా త్వరలో చింతన్‌ బైఠక్‌ను నిర్వహిస్తారని, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సంతో్‌షజీతో పాటు కీలక నేతలు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.


మొన్న పంజాబ్‌.. నిన్న గుజరాత్‌.. కమల

కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బ తీయాలన్న లక్ష్యంలో భాగంగా కమలనాథులు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నిన్నమొన్నటి వరకూ కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని తిట్టిపోసిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖర్‌ బుధవారం తన పదవికి రాజీనామా చేసి గురువారం బీజేపీలో చేరారు. అలాగే గుజరాత్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌ పార్టీ నాయకత్వాన్ని నిందిస్తూ రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రస్తుత, మాజీ కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని  ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-20T09:08:16+05:30 IST