YSRCP MP Magunta పై తెరవెనుక కుట్ర జరుగుతోందా..!?

ABN , First Publish Date - 2021-08-07T07:02:30+05:30 IST

మాగుంట శ్రీనివాసులరెడ్డిపై నమోదైన కేసు విషయం జిల్లాలో రాజకీయ సంచలనాన్ని సృష్టించింది...

YSRCP MP Magunta పై తెరవెనుక కుట్ర జరుగుతోందా..!?

  • నిజమా.. వేటాడుతున్నారా!
  • మాగుంటపై కేసు నమోదులో మర్మమేమిటో?

  • (ఆంధ్రజ్యోతి ఒంగోలు)

నెల్లూరు జిల్లాలో మట్టి అక్రమ రవాణాకు సంబంధించి సీనియర్‌ రాజకీయ నాయకుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై నమోదైన కేసు విషయం జిల్లాలో రాజకీయ సంచలనాన్ని సృష్టించింది. ప్రధానంగా మాగుంట కుటుంబ అభిమాన శ్రేణులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. మట్టి అక్రమ రవాణాకు మాగుంట పాల్పడటం అంటే జిల్లాలో ప్రత్యర్థులు కూడా నమ్మలేకపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆ వ్యవహారంలో మాగుంట పాత్ర లేదని ప్రచారం జరుగుతోంది. కారణమేమైనా మరోవైపు ఆయన పేరును కేసు నుంచి తొలగించేందుకు అధికారులు తాజాగా విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన పేరును ఫిర్యాదులో ఉద్దేశపూర్వకంగా పేర్కొన్నారా లేక పొరపాటున నమోదు చేశారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిజానికి ఆ విషయంలో మాగుంట కానీ, ఆయన సంస్థలకు కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రమేయం లేదన్న భావనకు అధికారులు వచ్చినట్లు తెలిసింది. మాగుంట పేరు అంతదూరం ఎందుకు వెళ్లిందనేది ప్రశ్నార్థకం.


2014లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మాగుంటకు చంద్రబాబు గౌరవం ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. గత ఎన్నికల సందర్భంలో ఆయన వైసీపీలో చేరి 2లక్షల మెజార్టీతో గెలిచారు. అనంతరం కారణం ఏమైనా ఆయన ఊహించిన స్థాయిలో సీఎం జగన్‌ వద్ద ఆదరణ లభించలేదు. ముఖ్యంగా ఆయన వ్యాపారాలు కూడా మన రాష్ట్రంలో స్తంభించాయి.


ఇటీవల ఆయన కుమారుడు దూకుడుగా ప్రజల్లోకి దూసుకెళుతుంటే అడ్డంకులు కల్పిస్తూ అధిష్ఠానం హెచ్చరికలు జారీ చేసింది. అయినా కుమారుడిని ప్రత్యక్ష రాజకీయ వారసుడిగా ప్రకటించిన మాగుంట రెండు మూడు రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలకు విందు ఇచ్చి కుమారుడిని పరిచయం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు కూడా వచ్చారు. ఈ దశలో మాగుంట పేరుపై ఉన్న కేసును అధికారులు లీక్‌ చేయడం గమనార్హం. దీంతో ఈ విషయంలోనూ తెరవెనుక కుట్ర ఏమన్నా జరుగుతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏదేమైనా మాగుంట మాత్రం తీవ్ర మనస్తాపానికి గురికాగా, జిల్లాలోని అనుచరులు, మాగుంట కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Updated Date - 2021-08-07T07:02:30+05:30 IST