Railway Fares : రైలు టిక్కెట్ ఛార్జీల్లో ఈ వివక్ష ఎందుకు?

ABN , First Publish Date - 2022-07-22T21:17:09+05:30 IST

రైలు ప్రయాణికుల టిక్కెట్ ఛార్జీల విషయంలో దారుణమైన వివక్ష కనబడుతోందనే

Railway Fares : రైలు టిక్కెట్ ఛార్జీల్లో ఈ వివక్ష ఎందుకు?

న్యూఢిల్లీ : రైలు ప్రయాణికుల టిక్కెట్ ఛార్జీల విషయంలో దారుణమైన వివక్ష కనబడుతోందనే విమర్శలు వస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారిని సాకుగా చూపిస్తూ వయోవృద్ధులు, క్రీడాకారులకు రాయితీలను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని, ఎంపీలకు మాత్రం ఇబ్బడిముబ్బడిగా రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. తెలంగాణా మంత్రి, టీఆర్ఎస్ అగ్ర నేత కల్వకుంట్ల తారక రామారావు కూడా తన ఆవేదనను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. కరుణతో వ్యవహరించి సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్ధరించాలని, ఇది మనందరి బాధ్యత అని కేంద్రానికి హితవు పలికారు. 


రాయితీలు రైల్వేలపై పెను భారం 

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) బుధవారం పార్లమెంటు (Parliament)కు ఇచ్చిన సమాధానంలో, వయోవృద్ధులు, క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీలలో కల్పించే రాయితీలను కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రద్దు చేశామని, ఈ రాయితీల పునరుద్ధరణ జరుగుతుందని ఇప్పట్లో ఆశించరాదని తెలిపారు. ఈ రాయితీల భారం రైల్వేలపై అధికంగా ఉంటోందని చెప్పారు. ఈ రాయితీల పునరుద్ధరణ వాంఛనీయం కాదని అన్నారు. రైళ్ళలో వివిధ తరగతుల ప్రయాణ ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. టిక్కెట్ ఛార్జీలు తక్కువగా ఉండటం, వివిధ వర్గాల ప్రయాణికులకు రాయితీలు ఇవ్వడం వల్ల పదే పదే నష్టాలు వస్తున్నాయని చెప్పారు. 


ప్రయాణ వ్యయంలో అందరికీ 50 శాతం రాయితీ

ప్రస్తుతం భారతీయ రైల్వేలలో అన్ని రకాల ప్రయాణికుల ప్రయాణ వ్యయంలో 50 శాతానికి పైగా ఆ సంస్థ భరిస్తోందని వైష్ణవ్ అన్నారు. ఛార్జీల స్ట్రక్చర్ తక్కువగా ఉండటమే దీనికి కారణమని చెప్పారు. సీనియర్ సిటిజన్లతో సహా అందరూ ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారని వివరించారు. దీంతోపాటు కోవిడ్-19 మహమ్మారి  (Covid-19 Pandemic) కారణంగా ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం గత రెండేళ్ళలో 2019-20లో వచ్చిన ఆదాయం కన్నా తగ్గిపోయిందన్నారు. వీటన్నిటి ప్రభావం రైల్వేలపై దీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుందన్నారు. రాయితీల భారం రైల్వేలపై చాలా ఎక్కువగా ఉంటోందన్నారు. సీనియర్ సిటిజన్లతో పాటు అందరికీ రాయితీల పరిధిని విస్తరించాలని కోరడం వాంఛనీయం కాదన్నారు. అనేక ప్రతికూల పరిస్థితులు, సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ, దివ్యాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీలను కొనసాగిస్తున్నామన్నారు. 


రాయితీలను పునరుద్ధరించాలి : కేటీఆర్

ఈ నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. వయోవృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని అనేక మంది గళమెత్తుతున్నారు. ఈ డిమాండ్‌ను తెలంగాణా మంత్రి కేటీఆర్ (KTR) కూడా కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా వినిపించారు. శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. వయోవృద్ధులను సంరక్షించుకోవడం కేవలం మన బాధ్యత మాత్రమే కాదని, అది మన కర్తవ్యమని తెలిపారు. రైలు టిక్కెట్ ఛార్జీల్లో వయోవృద్ధులకు ఇస్తున్న రాయితీలను తొలగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుసుకుని విచారించానని చెప్పారు. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని, కారుణ్యం ప్రదర్శించాలని కోరారు. 


ఎంపీలపై అమిత ప్రేమ

సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను 2020 మార్చిలో ఉపసంహరించారు. కానీ పార్లమెంటు సభ్యులకు మాత్రం రాయితీలను కొనసాగిస్తున్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, గడచిన ఐదేళ్ళలో ఎంపీలు, మాజీ ఎంపీల రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.62 కోట్లు ఖర్చు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.19.34 కోట్లు; 2018-19లో రూ.19.75 కోట్లు; 2019-20లో రూ.16.4 కోట్లు; 2020-21లో రూ.2.47 కోట్లు; 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.3.99 కోట్లు చెల్లించింది. 


వయోవృద్ధుల నుంచి రాబట్టినది రూ.1,500 కోట్లు

వయసు 60 సంవత్సరాలు పైబడిన పురుషులకు రైలు ప్రయాణ ఛార్జీలో 40 శాతం, వయసు 58 ఏళ్ళు పైబడిన మహిళలకు 50 శాతం రాయితీ ఇచ్చేవారు. 2020 మార్చిలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా మొదటి లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో, వయోవృద్ధుల ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను ఉపసంహరించారు. అప్పటి నుంచి వారి ప్రయాణ ఛార్జీలపై భారతీయ రైల్వేలకు రూ.1,500 కోట్లు ఆదాయం లభించింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు స్పందిస్తూ,  ప్రభుత్వం తమకు ఏమీ ఇవ్వడం లేదని, అధికారంలో ఉన్నవారికి వృద్ధులంటే విలువ లేదని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జీవిత కాలం పింఛను, కేంటీన్, అన్నింటిలోనూ రాయితీలు పొందుతున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు మాత్రం ఏమీ రావడం లేదంటున్నారు. రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 


ఆర్టీఐ దరఖాస్తుతో అసలు వివరాల వెల్లడి

సమాచార హక్కు చట్టం ప్రకారం చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన దరఖాస్తుకు భారతీయ రైల్వేలు ఇచ్చిన సమాధానంలో, 2020 మార్చి 20 నుంచి 2022 మార్చి 31 వరకు 7.31 కోట్ల మంది వయోవృద్ధులు రైళ్ళలో ప్రయాణం చేశారు. వీరిలో 60 ఏళ్ళ వయసు పైబడిన పురుషులు 4.46 కోట్ల మంది కాగా, 58 ఏళ్ళ వయసు పైబడినవారు 2.84 కోట్ల మంది, ట్రాన్స్‌జెండర్లు 8,310 మంది. సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ ఛార్జీల్లో రాయితీ లేకపోవడంతో టిక్కెట్ ఛార్జీలను పూర్తిగా చెల్లించారు. వీరి టిక్కెట్ ఛార్జీల విలువ రూ.3,464 కోట్లు కాబట్టి రాయితీ లేకపోవడం వల్ల రైల్వేలకు రూ.1,500 కోట్లు లభించింది. 




Updated Date - 2022-07-22T21:17:09+05:30 IST