కరోనా కట్టడికి చేయాల్సింది చాలా ఉంది!

ABN , First Publish Date - 2020-04-06T06:10:58+05:30 IST

కరోనా (కోవిడ్‌-19) విపత్తు స్వాతంత్య్రం తర్వాత బహుశా భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆర్థిక అత్యవసర పరిస్థితి అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌...

కరోనా కట్టడికి చేయాల్సింది చాలా ఉంది!

  • నిపుణులు, విపక్షాల సలహా తీసుకోండి 
  • ప్రభుత్వానికి రఘురామ్‌ రాజన్‌ సూచన 

న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్‌-19) విపత్తు స్వాతంత్య్రం తర్వాత బహుశా భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆర్థిక అత్యవసర పరిస్థితి అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ఈ విపత్తుతో ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వెంటనే సమర్థులైన నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2008 ఆర్థిక సంక్షోభం వంటి క్లిష్టపరిస్థితుల్లో దేశాన్ని నడిపిన విపక్ష నేతల సాయం తీసుకునేందుకూ ప్రభుత్వం వెనకాడకూడదన్నారు. 


పీఎంఓ నిపుణులపై భారం వద్దు..

కోవిడ్‌-19 విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నిపుణులపైనే ఆధారపడడం ఏ మాత్రం మంచిది కాదని రాజన్‌ స్పష్టం చేశారు. కరోనా పేరుతో వారిపై మరింత భారం వేయడం ఏ మాత్రం మంచిది కాదన్నారు. అయితే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను రాజన్‌ సమర్ధించారు.


2008 కంటే ఘోరం.. 

2008 ఆర్థిక సంక్షోభ సమయంతో పోలిస్తే భారత ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉందని రాజన్‌ పేర్కొన్నారు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ వస్తు సేవలకు డిమాండ్‌ లేక అల్లాడిపోయినప్పటికీ అంతకు ముందు సంవత్సరాల్లో సాధించిన అధిక వృద్ధి రేటుతో మన కంపెనీలు నెట్టుకు వచ్చాయన్నారు. కార్మికులూ ఎవరూ పెద్దగా రోడ్డున పడలేదన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి లేదన్నారు. అయినా సరైన విధానాలు, ప్రాధాన్యాలు, నిధుల సమీకరణల ద్వారా భారత్‌ కరోనా వైరెస్‌ మహమ్మారితో తలెత్తిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కోగలదని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు రాజన్‌ పలు సూచనలు చేశారు. 


  1. పరిస్థితి అదుపులోకి రాకపోతే ఈ నెల 14 తర్వాత వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభించాలి. అందుకోసం వెంటనే ఏర్పాట్లు చేయాలి
  2. పని ప్రదేశాలకు దగ్గరలోని హాస్టళ్లలో ఉండే ఆరోగ్యవంతులైన యువకులను పనుల్లోకి తీసుకోవాలి
  3. నిరుపేదలు, తక్కువ జీతాలతో పని చేసే అట్టడుగు మధ్య తరగతి ప్రజలకు జీవిత భద్రత కల్పించాలి
  4. నేరుగా నగదు బదిలీ కింద ప్రస్తుతం ఇస్తున్న సాయం మరింత పెంచాలి

Updated Date - 2020-04-06T06:10:58+05:30 IST