ప్రవాస భారతీయులకు ముఖ్య గమనిక.. Dubai లో ఉండగా Passport పోతే..

ABN , First Publish Date - 2022-06-30T21:30:20+05:30 IST

విదేశీ ప్రయాణాలు చేసేవారి వద్ద ఉండాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్టు ఒకటి. కానీ.. కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త లేదా ఇతరత్రా కారణాలతో పాస్‌పోర్టు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలో చిక్కుకున్న వారి కోసం దుబాయ్ ప్రభుత్వం ఓ చక్కని పరిష్కారం చూపెట్టింది.

ప్రవాస భారతీయులకు ముఖ్య గమనిక.. Dubai లో ఉండగా Passport పోతే..

ఎన్నారై డెస్క్: విదేశీ ప్రయాణాలు చేసేవారి వద్ద ఉండాల్సిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్టు ఒకటి. కానీ.. కొన్ని సందర్భాల్లో అజాగ్రత్త లేదా ఇతరత్రా కారణాలతో పాస్‌పోర్టు పోగొట్టుకునే అవకాశం ఉంది. అయితే.. దుబాయ్(Dubai)లో ఉండగా ఇలాంటి సమస్యలో చిక్కుకునే విదేశీ ప్రయాణికుల కోసం స్థానిక ప్రభుత్వం ఓ చక్కని పరిష్కారం చూపెట్టింది. ఇందులో భాగంగా.. ప్రయాణికుడు తన పాస్‌పోర్టు పోగొట్టుకున్నట్టు ధ్రువీకరిస్తూ లాస్ట్ పాస్‌పోర్టు సర్టిఫికేట్(Lost passport certificate) పేరిట పోలీసులు ఓ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. దీని సాయంతో టూరిస్టులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. 


దరఖాస్తు చేసుకోవడం ఇలా... 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోపే అధికారులు లాస్ట్ పాస్‌పోర్టు సర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. ప్రయాణికులు మూడు మార్గాల్లో ఈ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా లేదా స్మార్ట్ పోలీస్ స్టేషన్లలో లేదా దుబాయ్ పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో  అప్లై చేసుకోవచ్చు. అయితే.. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వారు ముందుగా తమ పాస్‌పోర్టు తాలూకు స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన కాపీ లేని పక్షంలో ప్రయాణికులు తమ దేశ రాయబార కార్యాలయాన్ని సంప్రదించి ఓ కాపీని తీసుకోవాలి. ఇక ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు 50 దిర్హామ్స్ దరఖాస్తు రుసుము కింద, మరో 20 దిర్హామ్స్ ఇన్నోవేషన్ ఫీజు కింద చెల్లించాలి. స్మార్ట్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఫీజు కింద 100 దిర్హామ్స్ చెల్లించాల్సి ఉంటుంది.   


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయదలిచిన వారు https://www.dubaipolice.gov.ae వెబ్‌సైట్‌లో లాస్ఐటెమ్స్ లింక్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత.. యాక్సెస్ సర్వీసెస్ లింక్‌ సాయంతో స్కాన్డ్ కాపీతో పాటూ ప్రయాణికుడి పేరు,  పాస్‌పోర్టు నెంబర్, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, పుట్టిన తేదీ తదితర వివరాలు సమర్పించి లాస్ట్ పాస్‌పోర్ట్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ జారీ అయ్యాక.. ప్రయాణికులు తమ దేశ రాయబార కార్యాలయాలను సంప్రదించి వెంటనే కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలి. 


Updated Date - 2022-06-30T21:30:20+05:30 IST