ఇరుకు దారుల్లో దూసుకెళ్తున్నాయి..

ABN , First Publish Date - 2022-05-03T06:19:57+05:30 IST

గడివేముల మండలంలోని జిందాల్‌ పరిశ్రమకు ముడి సరుకులు సరఫరా చేయడానికి.. పరిశ్రమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలను తరలించడానికి భారీ వాహనాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇరుకు దారుల్లో దూసుకెళ్తున్నాయి..
ఇరుకు రోడ్డులో వస్తున్న భారీ వాహనాలు

జిందాల్‌కు భారీ వాహనాల రాకపోకలు
టాఫిక్‌జామ్‌, ప్రమాదాలతో ప్రజల అవస్థలు


గడివేముల, మే 2: గడివేముల మండలంలోని జిందాల్‌ పరిశ్రమకు ముడి సరుకులు సరఫరా చేయడానికి..  పరిశ్రమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలను తరలించడానికి భారీ వాహనాలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. పరిశ్రమ యాజమాన్యం కర్మాగారం నుంచి నంద్యాల సమీపంలోని వెంకటేశ్వర క్రాస్‌ రోడ్డు వరకు రహదారిని నిర్మించింది. భారీ వాహన చోదకులు హైదరాబాద్‌, కర్నూలు, బళ్లారి పట్టణాలకు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగించాలి. కానీ ఈ మార్గంలో వెళితే దూరం పెరుగుతుందని... టోల్‌గేట్‌ రుసుం చెల్లించాల్సి వస్తుందని గడివేముల మీదుగా వెళ్తున్నారు. దీంతో  సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇరుకు దారిలో...

గడివేములలోని ఆర్‌అండ్‌బీ రహదారి కొత్త బస్టాండు నుంచి ఏబీఎం చర్చి వరకు మలుపులతో ఇరుకుగా ఉంటుంది. ఈ రహదారికి ఇరువైపులా దుకాణాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో వాహనాలు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవడం కష్టమే. ఇలాంటి ఇరుకు మార్గంలో రోజుకు 60 నుంచి 80 భారీ వాహనాలు అతి వేగంగా దూసుకెళ్తున్నాయి. ఈ వాహనాల హారన్‌లతో ప్రజలు హడలిపోతున్నారు. ఒక్కోసారి భారీ వాహనాలు మలుపుల వద్ద నిలిచి పోతుండటంతో గంటలకొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. మలుపుల వద్ద కూడా వేగం తగ్గించకపోవడంతో ప్రమాదాలు  చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి ప్రదేశాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఆంక్షలు ఉన్నా అడ్డుకునే వారేరీ?

గడివేముల ఆర్‌అండ్‌బీ రహదారిలో భారీ వాహనాల రాకపోకలపై గతంలోనే ఆంక్షలు విధించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలు తిరగాలి. ఆ తర్వాత జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. అప్పట్లో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, పాణ్యం సీఐ నాగరాజుయాదవ్‌ ప్రత్యేక చర్యలు తీసుకొని భారీ వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఆ తర్వాత అధికారులు అలసత్వం వహించడంతో భారీ వాహన చోదకులు గడివేముల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

భారీ వాహనాలను నియంత్రించాలి

భారీ వాహనాల రాకపోకలను గడివేముల మీదుగా వెళ్లకుండా నియంత్రించాలి. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి.

-డి. నాగశేషులు, నంద్యాల జిల్లా, టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు

జరిమానాలు విధిస్తున్నాం

గడివేముల మీదుగా వెళ్లే భారీ వాహనాలపై చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలు అతిక్రమించి ఇటువైపు వస్తే జరిమానాలు విధిస్తున్నాం.

-హుసేన్‌బాషా, ఎస్‌ఐ, గడివేముల

Read more