అసలొదిలేసి కొసరుపై

ABN , First Publish Date - 2020-04-08T09:20:33+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాయమైన స్టాకుపై జిల్లా ఎక్సైజ్‌శాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. సిబ్బందిని లోబర్చుకుని అధికార పార్టీ నేతలు

అసలొదిలేసి కొసరుపై

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాయమైన స్టాకుపై జిల్లా ఎక్సైజ్‌శాఖ పిల్లిమొగ్గలు వేస్తోంది. సిబ్బందిని లోబర్చుకుని అధికార పార్టీ నేతలు పలుచోట్ల మద్యం దుకాణాల్లో సరుకును ఊదేస్తే అదేం పట్టించుకోకుండా ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులతో మంగళవారం హడావుడి చేసింది. జిల్లావ్యాప్తంగా 425 మద్యం దుకాణాలుంటే అందులో ఏరికోరి చిన్నదుకాణాలు, ఊరి చివరన ఉన్నవి ఎంచుకుని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌లు, డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది దాడులు నిర్వహించి తూతూమంత్రం తేడాలు గుర్తించి మమ అనిపించేశారు. కనిపించని స్టాకు ఏమైందో ఆరా తీయకుండా కేవలం డబ్బులు కట్టించేసుకుని రసీదులు ఇచ్చేసి వచ్చారు. జిల్లాలో 425 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో మార్చి 22 నాటికి సరుకు పూర్తి స్థాయిలో ఉంది. కాకపోతే ఆరోజు ఆదివారం. పైగా జనతా కర్ఫ్యూ. అదేరోజు రాత్రి ప్రధాని మోదీ మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో మందుబాబులు పెద్దఎత్తున దుకాణాలకు సరుకు కోసం వచ్చారు.


అయితే దుకాణాల్లో సిబ్బంది వీరికి కొంత సరుకు మాత్రమే విక్రయించారు. ముఖ్యమైన బ్రాండ్లకు చెందిన సగం స్టాకు అధికార పార్టీ కీలక నేతల వద్దకు వెళ్లిపోయింది. కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ సర్కిల్‌ పరిధిలో పలువురు నేతలు సిబ్బందితో కుమ్మక్కై సరుకును దారిమళ్లించేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఆనుకుని ఉన్న దుకాణాల్లో మతలబు జరిగింది. ప్రభుత్వ ధర కంటే కొంచెం ఎక్కువ డబ్బులు దుకాణాల్లోని సిబ్బందికి సదరు వైసీపీ నేతలు ఇచ్చి సరిపెట్టేశారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌తో మిగిలిన చిల్లర బ్రాండ్లు దుకాణాల్లోనే ఉంచి సీళ్లు వేసేశారు. నిఘా కోసం సిబ్బంది ఒకరిద్దరిని నియమించారు. అయితే ఈ దుకాణాల్లో చాలావాటి సీళ్లను స్థానిక వైసీపీ కీలక నేతలు ఆ తర్వాత కూడా తీయించి సరుకు ఇంటికి తీసుకుపోయారు.


ఒకరకంగా లాక్‌డౌన్‌కు ఒకరోజు ముందు ఆ తర్వాత సరుకు సగానికిపైగా అనేకచోట్ల వైసీపీ నేతలు తరలించేశారు. ఇటీవల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మందు మాయం అవుతుండడంతో స్టాకుల తనిఖీల పేరుతో మంగళవారం జిల్లావ్యాప్తంగా 55 దుకాణాల్లో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో రాజమహేంద్రవరం పరిధిలో 17, కాకినాడ పరిధిలో సుమారు 15, మిగిలినవి కోనసీమలో ఉన్నాయి. ఆకస్మిక దాడులకు ఎంచుకున్న దుకాణాల్లో చాలా మతలబు జరిగింది. వైసీపీ నేతలు సరుకు దాటించేసిన పెద్ద దుకాణాలు వదిలేసి చిన్నాచితకా వాటిపైనే ప్రతాపం చూపారు. దీంతో వీటిలో స్వల్ప మొత్తం స్టాకు రిజిస్టర్‌కు, అందులో ఉన్న సీసాలకు వ్యత్యాసం కనిపించింది. దీంతో వ్యత్యాసం ఉన్న సీసాలకు ధర కట్టి ఆ డబ్బును దుకాణం సిబ్బంది నుంచి వసూలు చేసి రసీదులు ఇచ్చారు.


వాస్తవానికి పెద్ద మద్యం దుకాణాల్లో తనిఖీలు చేస్తే బాగోతాలు బయటపడతాయి. ఇదేదీ చేయకుండా చిన్నదుకాణాలు ఎంచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క జనతా కర్ఫ్యూ రోజు రాత్రి జనం ఒక్కసారిగా మందుకోసం రావ డంతో లెక్కలు రాయకుండా సరుకు విక్రయించి, ఆ డబ్బు దుకాణంలో ఉంచేశారని, దాంతోనే వ్యత్యాసాలు కనిపించాయని, ఆ వ్యత్యాసానికి ఇప్పుడు డబ్బులు కట్టేశారంటూ అధికారులు తేల్చేశారు.


అమ్మో..ఆయన... రాయవరం ఎక్సైజ్‌ సీఐ అనపర్తి మద్యం దుకాణంలో మార్చి 25 నుంచి మార్చి 29 వరకు అయిదు రోజులు మద్యం తరలించినట్టు అధికారులు గుర్తించారు. ఇక్కడి సిబ్బందితో కుమ్మక్కై రూ.4.10 లక్షల సరుకును తీసుకువెళ్లి కేవలం రూ.1.25 లక్షలు మాత్రమే చెల్లించినట్టు రికార్డుల్లో గుర్తించారు. ఈలోపు సదరు సీఐ అరెస్టు కావడంతో మిగిలిన రూ.2.85 లక్షలను అతడి నుంచి జీతం నుంచి రికవరీ చేసేలా జిల్లా నుంచి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.

Updated Date - 2020-04-08T09:20:33+05:30 IST