రాజధాని మార్పుతో రైతులకేనా నష్టం?

ABN , First Publish Date - 2020-03-18T05:52:25+05:30 IST

రాజధాని రైతులను ‘ఆశపోతులు’ అని అపహాస్యం చేస్తున్న ఓ విజ్ఞులారా! మీకో దండం. మీ సంస్కారానికి మరొక దండం. అమరావతి రేపు ఏమవుతుందనేది పక్కన పెట్టేద్దాం. మాలాంటి వాళ్ళం అప్పుడు...

రాజధాని మార్పుతో రైతులకేనా నష్టం?

ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వారిని ఎక్కడికక్కడ ఎదిరించకపోతే రాబోయేవి చెడ్డ రోజులే. ఇప్పుడు ముస్లింల మీదనే కదా, మాకేమని సాటి హిందువులు; రాజధాని మార్పు కమ్మ రైతులకే కదా నష్టం, మాకేంపని అని మిగిలిన కులాలు అనుకుంటే, ఆ తరవాత మనదాకా వస్తే మాట్లాడే వారుండరనేది చరిత్రలో రుజువయిన అంశం. వాస్తవానికి రాజధానిలో వున్న మిగిలిన కులాలు ఆ మాట అనుకోవడం లేదు. రాజధానేతర ప్రాంతాలలో ఈ భావన వుండటం సరైంది కాదు. ఇది రాజధాని ప్రాంతపు సమస్య మాత్రమే అనుకోవడం- మొత్తం రాష్ట్రానికే నష్టం.


రాజధాని రైతులను ‘ఆశపోతులు’ అని అపహాస్యం చేస్తున్న ఓ విజ్ఞులారా! మీకో దండం. మీ సంస్కారానికి మరొక దండం. అమరావతి రేపు ఏమవుతుందనేది పక్కన పెట్టేద్దాం. మాలాంటి వాళ్ళం అప్పుడు కూడా పంటపొలాల్లో రాజధాని వద్దని కొట్లాడాం! కథలు రాశాం, వ్యాసాలు రాశాం. అప్పుడు ప్రతిపక్షనేతగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా రాజధానికి సపోర్టు చేస్తూ 30వేల ఎకరాల భూమి సేకరించాలని శాసనసభలో నిలబడి మరీ చెప్పాడు. చంద్రబాబు ఎలాగూ అమరావతిని రాజధాని చెయ్యదలుచుకున్నాడయ్యె, చేశాడు. అది గతం. ఇప్పుడు జగన్‌ వద్దనుకుంటున్నాడు. తిరిగి దాన్ని రివర్స్‌ చెయ్యడం వ్యతిరేకంగా సాగే ప్రక్రియ. ప్రజలపట్ల బాధ్యత, మన్ననా, గౌరవం లేక పోయాక- ఇదో లెక్కా! 


అయితే, ఇప్పుడు ఆలోచించాల్సింది రాజధాని సమస్య ఆ ముప్పై గ్రామాల ‘బలిసిన’ రైతుల సమస్య మాత్రమేనా? మిగిలిన మధ్యతరగతి, పేదలకూ సంబంధం లేదా? ఇప్పుడీ మార్పు వల్ల, జరుగుతున్న పరిణామాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు ఎలా వుండబోతుంది? ఎలాగూ పెట్టారు కదా? ఇప్పుడు మార్చాలని ఎందుకనుకుంటున్నారు? ఇక్కడ వ్యాపారం జరిగింది, ఓ కులం లబ్ధిపొందిందనే ఉక్రోషం మాట అలా వుంచి, రేపు విశాఖలో మాత్రం రియల్ ఎస్టేట్‌ వ్యాపారం జరగదని చెప్పగలరా?  అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాలి. అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకే తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతును ఆంధ్రప్రాంతం నుండి కూడా ఇచ్చాం. కనక ఏ సమస్యకైనా నిర్దిష్టత వుండాలి, నిర్దిష్ట పరిష్కారముండాలి. అలా రాజధాని కూడా నిర్దిష్టంగా వుండాల్సిందే! మూడు రాజధానులు అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు మ్యాప్‌లో- మూడు ఊళ్ళకు టిక్కు పెడతారన్నమాట, ఎంత సొంపుగా వుందీ?!


రైతులనే కాదు- రైతు కూలీలనూ, పేద కూలీలకు కూడా ఉపాధి భృతి రూ.2,500 బదులు రూ.5,000 మరో ఐదేళ్ళపాటు ఇస్తామని ఎందుకు ఆశపెడుతున్నారూ? అన్ని వర్గాల ప్రజలకూ ఇన్నేసి రాయితీలు ఇచ్చి, వారిని వదిలించుకుని ఆ ప్రాంతాన్నీ, ఆ భూమినీ ఎందుకు మీ గుప్పిటలో పెట్టుకోవాలనుకుంటున్నారు? ఇది మీ ప్రభుత్వపు ఆలోచన మాత్రమేనా? ఇంకేమైనా బయటశక్తుల వ్యూహ రచనా? అది బయట పడడం ఆంధ్రప్రజలకు శ్రేయస్కరం. తరతరాలుగా, సామాన్యుల దగ్గర భూమిని లేకుండా చేయాలనే పెట్టుబడి వర్గాల, దాని అంతేవాసుల కుట్రకు రైతులు నిత్యం గిలగిలా కొట్టుకుంటూనే వున్నారు. దొంగవిత్తనాలనూ, దొంగమందులనూ దాటుకుని గుప్పెడు పంట పండితే దానికీ మార్కెట్‌ లేకుండా చేసి రైతును కన్నీళ్ళపాలు చేస్తున్న వ్యవస్థ ఇది. ఇక దిక్కుతోచని రైతులు ఏ స్థితికి వచ్చాడంటే ‘వ్యవసాయం దండగ’ అనే కాడికి వచ్చాడు. దీనికితోడు ‘పంకా’ కింద తెల్లబట్టలేసుకుని కూర్చుని- కాయితాలు నింపేవాడికున్న గౌరవం, ఆదాయం,- భూమిని దున్ని పంటను సృష్టించే రైతుకు లేకుండా పోయింది. 


ఇదిగో ఇలాంటి దౌర్భాగ్యం నుండి బయట పడేదెట్లా అని కునారిల్లుతున్న రైతాంగంలో భాగమే రాజధాని రైతులు. మూడు పంటలూ, సుభిక్షమైన ప్రాంతానికి ఏం వచ్చిందీ? అనుకోవచ్చు. కానీ మార్కెట్‌ వుంది. అది మన చేతుల్లో లేదు. అయితే, ముఫ్పై గ్రామాలూ, మూడు పంటల భూములు కావనేది ఓ నిజం. అయినా ఈ రైతులకు సహితం భూమి జారిపోతే ఎట్లా అనే అనుమానాలు మొలకెత్తుతున్నా- హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ కళ్ళలో కనబడింది. రైతుకంటే వారి పిల్లలకు మరింత ఎక్కువగా కనబడింది. ఆ రూపకర్త చంద్రబాబేనని నమ్మారు. ఇక్కడకూడా అంత సిటీ తయారవుతుందనే ఆశతో తమ భూములను చాలావరకు ఇష్టంగానే ఇచ్చారు, ఇష్టం లేకుండా తప్పనిసరై ఇచ్చినవాళ్ళ సంఖ్య తక్కువేనని చెప్పాలి. అందులోనూ ఆ రైతులకు నష్ట పరిహారాలిచ్చి వెళ్ళగొడతామంటే భూములిచ్చే వాళ్ళు కాకపోవచ్చు. కానీ వాళ్ళు రాజధానిలో లబ్ధి పొందుతారనే ఆశను కలిగించారు. ఆ ఆశ వారు దురాశతో తమకైతాము తెచ్చుకున్నది కాదు. అయితే కాలం జరిగి పోయింది. అది ఇప్పుడు భూమిగా లేదు, వ్యాపార వస్తువుగా మారిపోయింది.


ఇంత దూరం వచ్చాక రాజధాని అక్కడ పెట్టటం తప్పనుకుంటే, ఆ తప్పును మరో తప్పుతో సరిదిద్దగలరా? అది తప్పనుకున్నా తిరిగి అక్కడ నుండి లేపాలనుకోవడం మరింత తప్పుకాదా? చంద్రబాబు మీద ద్వేషం- ముప్పై గ్రామాల ప్రజల మీద తీర్చుకుంటారా? ఇది నేనంటున్న మాట కాదు, జనం అనుకుంటున్నమాట. ఇక రాజధాని ఎత్తివేసి, రాయితీలు పెంచినంతమాత్రాన రైతు ఆశలు తీరుతాయా? ఈ ‘ఆశపోతు’ రైతుల వివరాల్లోకి వస్తే ఒక ఎకరంలోపు భూమి వున్న రైతులు 20 వేలమంది, రెండు ఎకరాల లోపు 6 వేల పైచిలుకు జనం, ఐదు ఎకరాలలోపు 3,500 మంది.- వీళ్ళంతా దోపిడీ చేసి సంపాదించారనే అనుకుందామా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు ఇవేనా? పైపై డేటాలెందుకూ? ప్రభుత్వమిచ్చిన డేటాలే వున్నాయికదా! ఏ భూమి వుంటే ఆత్మగౌరవం, జీవితం పట్ల ప్రగాఢ విశ్వాసం వుంటుందని నమ్మి,- భూమిలేని వాళ్ళ కు కూడా భూమి కావాలని కొట్లాడే మాలాంటి వాళ్ళం- ఈ చిన్న, సన్నకారు రైతుల భూములు కోల్పోయి, భవిష్యత్తులో ఉపాధి వనరులు తగ్గిపోయి, ఇప్పటిదాకా ఇంతో అంతో నిశ్చింతగా వున్న వారి జీవితాలు ఇకముందు ఛిద్రమయిపోతాయని అర్థమవుతుంటే చూడలేకపోతున్నాం.రచయితగా కంటే ఓ సామాజిక కార్యకర్తగా మౌనంగా వుండలేక పోతున్నాను.


చిత్తూరు జిల్లాలో ‘శ్రీ సిటీ పారిశ్రామిక సెజ్‌’ కింద 12వేల ఎకరాల భూమి ఆయా ప్రాంతాల దళిత, పేద రైతుల నుండి లాక్కుంటే, ఆ దళితులంతా (అక్కడ కూడా ఎక్కువ ఇందిరమ్మ ఇచ్చిన అసైన్డ్‌ భూములే) ఎక్కడవున్నారో ఏ రిక్షా లాక్కుని బతుకుతున్నారో ఆచూకీ లేదు. పులిచింతలకింద- కోళ్ళూరు, గొల్లపల్లి వంటి పది గ్రామాల ప్రజలను ఎత్తివేయించి పట్టణాలకు దగ్గరగా స్థలాలిచ్చారు. ఇప్పుడు ఆ రైతులను వాళ్ళ పరిస్థితి గురించి అడగండి. వారికి ఆనాడున్న అస్తిత్వం, విశ్వాసం, మనోధైర్యం- ఈనాడెందుకు లేకుండా పోయాయో వినిరండి. అప్పుడు కూడా మేం ఆ రైతుల వెంట నిలబడ్డాం. కానీ అప్పట్లోకూడా రాజకీయపార్టీల, నాయకుల, కుల పెద్దల మాటను దాటిరావడం వాళ్ళకూ సాధ్యం కాలేదు. సరిగ్గా ఇప్పుడూ అదే స్థితి. అమరావతి రాజధాని సమస్య రైతులదే అనుకుంటే చాలా ప్రమాదం. ఇది దళిత, నిరుపేద కూలీలకు భవిష్యత్తులో జీవన సమస్య కాక తప్పదు. అది గుర్తించకపోతే రాబోయే రోజుల్లో అక్కడి జనానికి కష్టకాలం దాపురించినట్టే. రైతుకు కలిగే నష్టం ఒక విధమైతే కూలీలకు కలిగే నష్టం అంతకంటే ఎక్కువ. 


ఇప్పటికే రాజధాని అన్న దగ్గర నుండి- భూములు పూలింగ్‌కు ఇచ్చివేశాక, దళిత, నిరుపేద కూలీలు- గ్రామాలలో పనులు దొరికిన వాళ్ళకు దొరకగా- ఎక్కువమంది స్త్రీలు దూరప్రాంతాలైన యండ్రాయి, తాడికొండ, అమరావతి దాకా కూలీ పనులకు పోతున్నారు. నేలపల్లి- అరుణ (పేరుమార్చాను) అనే ఆమె ఏమంటున్నదో చదవండి- ‘నాకు ఇద్దరు పిల్లలు, భర్త లేడు. అసైన్డ్‌ భూమి ఒకటిన్నర ఎకరం వుంది. దీనికి రాజధాని రాకముందు 15 వేలు కౌలు వచ్చేది’. భర్త పోయాక ఆమె ప్రస్తుతం తుళ్ళూరులో వుంటోంది. పొలం ఉద్దండ రాయపాలెంలో వున్నది. ఆమెకు ఇంకా ఎసైన్డ్‌ కింద ప్లాటు ఇవ్వలేదు, కౌలు రావడం లేదు. అరుణ ఇంకా ఇలా చెప్పింది- ‘ప్రస్తుతం ధరణికోట దాకా పోతున్నాం పనులకోసం. రాజధాని పూర్తయితే ఏదో ఒకపని దొరక్కపోతుందా? అనే ఆశతో వున్నాం. అసలు ఇప్పుడు అదీ ఎత్తేస్తే మా కూలీ భవిష్యత్తు ఏంది? రాజధాని రాకముందు, -ఎత్తిపోతలు వచ్చాక మాకు ఎల్లప్పుడూ పని దొరికేది. రేపటి రోజు భూములు ప్రభుత్వం తీసేసుకుంటే ఆసాముల సంగతి సరే, మా పేదోళ్ళకు ఆదరువు ఏమిటి?, మా పిల్లలు చిన్నపిల్లలు. వీళ్ళను వదిలి నేను అంతంత దూరం వెళ్ళి ఎన్నాళ్ళని, ఎట్లా సంపాదించుకోవాలి? అసలు పర్మినెంటుగా పనులు లేకపోతే ప్రభుత్వం పదేళ్ళపాటు మాకు రెండున్నర వేల బదులు ఐదువేలు ఇస్తానని ఊరిస్తోంది. తరువాత సంగతో? ఇప్పుడు ఆశపెడుతున్నారు, బాగానే వుంది.... ముందు ముందో? పదేళ్ళంటే ఎంతండీ, చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోనే పోయింది గదా! మాకు ఆయనిచ్చే ఐదు వేలు వద్దుగానీ రాజధాని ఇక్కడనే వుండాలి. అట్లా అయితే ఏదో ఇళ్ళల్లో పనులయినా దొరుకుతాయి. లేదూ చిన్న కొట్టేదో పెట్టుకుంటేనన్నా బతకవచ్చు’.


ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధివిధానాలు మార్చి ప్రజలతో ఆడుకోవడం రాజ్యాంగానికే విరుద్ధం. ఈ రాజ్యాంగం వుంది ప్రజల బాగోగుల కోసం. అంతే కానీ, మన రాజకీయ ఆటకోసం కాదు. అటు కేంద్రంలోగానీ, ఇక్కడ రాష్ట్రంలోగానీ- అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక కారణంగా తీవ్ర మానసిక ఘర్షణకు గురవుతున్నారు. ప్రజల గురించి, సమాజం గురించి, విలువల గురించి పట్టింపు లేని పాలకులు ప్రజల పాలిట శాపం. కేంద్రంలో హిందువేతరుల పట్ల ద్వేషం, రాష్ట్రంలో కులం పేరుతో ద్వేషం. ఏ మతమూ, ఏ గ్రంథాలూ నూరిపోయవు. నిజానికి క్రీస్తు దయామయుడనీ, ఒక చెంపకొడితే మరో చెంప చూపించమని బైబిల్‌లోనే వుంది. అది ఆచరణలో చూపించినపుడే నిజమైన క్రైస్తవుడు కదా! మరిదేమిటి? కనుక నాదీ, నా రాజ్యం, నా ఇష్టం అనే మెజారిటీ అహంభావంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న మోదీగానీ, ఇంకెవరైనా గానీ- వారిని ఎక్కడికక్కడ ఎదిరించకపోతే ప్రజలకు రాబోయేవి చెడ్డ రోజులే. ఇప్పుడు ముస్లింల మీదనే కదా, మాకేమని సాటి హిందువులు; రాజధాని మార్పు కమ్మ రైతులకే కదా నష్టం, మాకేంపని అని మిగిలిన కులాలు అనుకుంటే, ఆ తరవాత మనదాకా వస్తే మాట్లాడేవారుండరనేది చరిత్రలో రుజువయిన అంశం. వాస్తవానికి రాజధానిలో వున్న మిగిలిన కులాలు ఆ మాట అనుకోవడం లేదు. రాజధానేతర ప్రాంతాలలో ఈ భావన వుండటం సరైంది కాదు. ఇది రాజధాని ప్రాంతపు సమస్య మాత్రమే అనుకోవడం- మొత్తం రాష్ట్రానికే నష్టం. నిజానికి అందరినీ సమదృష్టితో చూడాల్సిన పాలకులు ఇప్పటికే కలిగిన నష్టానికి మారుగా- ఆ ప్రాంతం నుండి రాజధాని తీసివేసి అక్కడి ప్రజలకూ, ఆ జిల్లాలకూ ఊహించని నష్టం కలుగజేసేవారు ఇంకొకచోట న్యాయం చేస్తారని అనుకోగలమా?

నల్లూరి రుక్మిణి, రచయిత్రి

Updated Date - 2020-03-18T05:52:25+05:30 IST