అపెక్స్‌ కమిటీతో కాఫీ రైతులకు నష్టం

ABN , First Publish Date - 2022-01-25T06:00:23+05:30 IST

విశాఖ మన్యంలో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే కాఫీ పంటకు గిట్టుబాటు ధరను అందించడంలో అపెక్స్‌ కమిటీ విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర ఆరోపించారు.

అపెక్స్‌ కమిటీతో కాఫీ రైతులకు నష్టం
దొన్నుదొర


కమిటీ ధర కంటే వర్తకులే అధిక ధర ఇస్తున్నారు..

టీనేజర్‌ సంస్థ రూ.280కి కొనుగోలు చేస్తుంటే..జీసీసీ రూ.180 కొనుగోలు..

కాఫీ రైతును దోచేస్తున్న జీసీసీ

టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు దొన్నుదొర

అరకులోయ, జనవరి 24: విశాఖ మన్యంలో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే కాఫీ పంటకు గిట్టుబాటు ధరను అందించడంలో అపెక్స్‌ కమిటీ విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర ఆరోపించారు. సోమవారం ఆయనిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. గిరిజన రైతులకు నష్టం వచ్చేలా అపెక్స్‌ కమిటీ ధర నిర్ణయించిందన్నారు. జీసీసీ ఇచ్చిన ధర కంటే వర్తకులు, కొన్ని సంస్థలు అధిక ధరలకు కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన రైతులను పట్టించుకోవడం లేదని, కాఫీ రైతులకు మేలు చేయాలనే ఆలోచనే లేదని విమర్శించారు. అపెక్స్‌ కమిటీ పార్చిమెంట్‌ కాఫీ కిలో రూ.180, చెర్రి రకానికి రూ.75గాను, రొబొస్ట్రా రకం కాఫీకి రూ.60 ధర నిర్ణయించింద న్నారు. ఈ మేరకు జీసీసీ 2021 నవంబరు 24వ తేదీన జీసీసీ సర్క్యులర్‌ను జారీ చేసిందన్నారు. అయితే బెంగళూరు మార్కెట్‌లో అరబికా పార్చిమెంట్‌ కాఫీ కిలో రూ.319 ఉందని కాఫీబోర్డు ప్రకటించిందని, ఇంత మంచి రేటు ఉంటే జీసీసీ ద్వారా రూ.180 ధరను అపెక్స్‌ కమిటీ ఎలా నిర్ణయించిందని దొన్నుదొర ప్రశ్నిం చారు. మాక్స్‌ వంటి ప్రయివేటు సంస్థలకు అపెక్స్‌ కమిటీ అమ్ముడుపోయి గిరిజన కాఫీ రైతులకు దగా చేసిందనే అను మానం కలుగుతుందన్నారు. అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రాంతాల్లో కాఫీ రైతులతో పనిచేస్తున్న టీనేజర్‌ అనే సంస్థ కిలో అరబికా కాఫీ రూ.280 చొప్పున, ఇతర ప్రయివేటు వర్తకులు కిలో అరబికా కాఫీ రూ.230 కొనుగోలు చేస్తున్నారన్నారు. మరి జీసీసీ మాత్రం అరబికా కాఫీ కిలోరూ.180 ధరకు కొనుగోలు చేస్తున్నదన్నారు. జీసీసీ ఇంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఐటీడీఏ పీవో, జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని లాభదాయకమైన ధరతో కాఫీని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.526 కోట్లతో కాఫీతోటలను అభివృద్ధి చేసిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కాఫీ రైతులకు ఎటువంటి ప్రోత్సాహం కల్పించడం లేదని విమర్శించారు. కాఫీ రైతులకు గిట్టుబాటుధర కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు.



 

Updated Date - 2022-01-25T06:00:23+05:30 IST