అదే కష్టం

ABN , First Publish Date - 2022-01-19T06:24:25+05:30 IST

ఈ ఫొటోలో కనిపిస్తున్నది మొలక వచ్చిన ధాన్యం.

అదే కష్టం

అకాల వర్షంతో రైతులకు మళ్లీ నష్టం

తడిసి మొలక వచ్చిన ధాన్యం

కుప్పల్లోని ధాన్యం రంగుమారే ప్రమాదం 

రంగు మారిన ధాన్యానికి ధర వచ్చేనా? 

ప్రభుత్వం సకాలంలో ధర ప్రకటించేనా?

గత ఏడాది రైతులు అమ్ముకున్నాకే ఉత్తర్వులు 

నాడు మిల్లర్లకే మేలు చేసిన ప్రకటన


ఈ ఫొటోలో కనిపిస్తున్నది మొలక వచ్చిన ధాన్యం. బందరు మండలం గుండుపాలెంకు చెందిన గంటా సత్యనారాయణ కల్లంలో ఆరబెట్టిన ధాన్యం ఇటీవలి వర్షాలకు తడిసి, మొలక వచ్చింది. ఈ ధాన్యాన్ని మచిలీపట్నం-చిన్నాపురం రోడ్డుపై ఆరబెట్టారు. సత్యనారాయణ మాదిరిగానే గుండుపాలెంకు చెందిన రైతులు చాలామంది తడిసిన ధాన్యాన్ని ఇలా రోడ్డుపైకి చేర్చి ఆరబెడుతున్నారు. తడిసిన, రంగుమారిన ఽధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.


అకాల వర్షం కురిసినా, సకాలంలో కురవకపోయినా కష్టం రైతులకే. ఖరీఫ్‌ అయినా, రబీ అయినా నాట్లు వేయాలన్నా, కోత కోయాలన్నా రైతు ఆకాశం వంక చూడాల్సిందే. వరి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి పరిహసిస్తే శ్రమకు తగిన ఫలితం ఉండదు. అష్టకష్టాలూ పడి పంటను దక్కించుకున్నా, గిట్టుబాటు ధర లభించదు. ఈ ఏడాదీ రైతులకు అదే కష్టం. ఇటీవల కురిసిన అకాల వర్షంతో కుప్పల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొంత ధాన్యానికి మొలక వచ్చింది. మిగిలిన ధాన్యం రంగు మారే ప్రమాదముంది. అదే జరిగితే మిల్లర్లు ఏదో ఒక సాకుతో ధర తగ్గించేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. లేకుంటే రైతుకు మిగిలేది కన్నీళ్లే.


 ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : ఏటా రైతులకు కష్టాలు తప్పడంలేదు. ఈ నెల 13, 14 తేదీల్లో కురిసిన అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షంతో కుప్పల్లోకి నీరు చేరింది. పొలాల్లోనూ నీరు నిల్వ ఉండిపోయింది. కుప్ప నూర్పిళ్లకు, ధాన్యం రవాణాకు పొలం సిద్ధం కావాలంటే మరో 20 రోజులైనా సమయం పడుతుంది. ఇన్ని రోజులపాటు తడిసిన ధాన్యం కుప్పల్లోనే ఉంటే రంగుమారి పోతుందని, అదే జరిగితే మిల్లర్లు అనేక వంకలు పెట్టి ధాన్యం ధరను అమాంతం తగ్గించి వేస్తారని రైతులు ఆందోళన చెందుతున్నారు.


మళ్లీ పాత కథేనా? 

గత ఏడాది నవంబరులో కోతకు సిద్ధంగా ఉన్న వరి భారీవర్షాలకు తడిసిపోయింది. అష్టకష్టాలూ పడి రైతులు తడిసిన ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చి విక్రయిస్తే తేమ శాతం అధికంగా ఉందని, పాయ వచ్చిందని, రంగు మారిందని రకరకాల కారణాలు చూపి, ధర తగ్గించి వేశారు. 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,418కి కొనుగోలు చేయాల్సి ఉండగా, మిల్లర్లు రూ.800 నుంచి 900 వరకు మాత్రమే ధర చెల్లించారు. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకునేంత జాగా లేకపోవడంతో రైతులు తక్కువ ధర వచ్చినా తెగనమ్ముకున్నారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా విక్రయించుకున్న తరువాత బస్తాకు రూ.1,200 ధర ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన మిల్లర్లకే మేలు చేసింది. రైతుల నుంచి రూ.800కు కొనుగోలు చేసిన మిల్లర్లు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకున్నారు. 


ఈ ఏడాదైనా ముందుగా స్పందించాలి

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల హెక్టార్లలో వరి సాగు జరిగింది. కోతల అనంతరం రబీలో 1,28,421 హెక్టార్లలో అపరాల పంటగా మినుము సాగు చేశారు. ముందస్తుగా సాగు చేసిన మినుము ఫిబ్రవరి నెలాఖరునాటికి కోతకు వస్తుంది. వరి కుప్పల నూర్పిడి కూడా ఆ సమయంలోనే వేగవంతమవుతుంది. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు కుప్పల్లోకి నీరు చేరింది. దీంతో ధాన్యం రంగుమారే ప్రమాదముంది. రంగు మారిన ధాన్యం కొనుగోలుపై, మద్దతు ధరపై ప్రభుత్వం త్వరితగతిన స్పష్ట్టమైన ప్రకటన చేయాలని  రైతులు కోరుతున్నారు. 


తేమ శాతం తెస్తున్న తంటా 

ఇటీవల కురిసిన వర్షాలకు రాశులుగా పోసిన ధాన్యం కొంతమేర తడిసింది. రెండు రోజులపాటు వర్షం కురవడంతో, గాలిలో తేమ శాతం పెరిగింది. దీంతో ధాన్యంలో 17 పాయింట్ల వరకు  ఉన్న తేమ శాతం 19 పాయింట్లకు చేరింది. మిల్లర్ల వద్దకు ఈ ధాన్యం తీసుకువెళితే  తేమశాతం అధికంగా ఉన్నదని, ఆరబెట్టి తీసుకురమ్మని చెబుతున్నారు. సోమవారం  మధ్యాహ్నం సమయంలో మచిలీపట్నంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై  జల్లులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబె ట్టిన ధాన్యాన్ని  కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో హడావిడిగా ధాన్యం కాటా వేశారు.  ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను కొంత వరకు సడలించి, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-01-19T06:24:25+05:30 IST