ట్రేడింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని..!

ABN , First Publish Date - 2022-08-06T05:23:08+05:30 IST

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయయుడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు అలవాటు పడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దాన్ని పూడ్చేందుకు బావ ఇంట్లో చోరీ చేశాడు. భారీగా నగదు, బంగారం కాజేశాడు. ఆరు నెలల వరకు దొంగ ఎవరో తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి అంతర్మథనం చెందాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పందనలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. టెక్నాలజీ అసలు దొంగను పట్టించింది. బావమరిదే బావ ఇంట్లో చోరీకి పాల్పడినట్టు నిర్ధారించింది.

ట్రేడింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని..!
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ జీఆర్‌ రాధిక.. ఇన్‌సెట్‌లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం బిస్కెట్‌

బావ ఇంట్లో చోరీ చేసిన ఉపాధ్యాయుడు
రూ. 21.5లక్షలు, బంగారం కాజేసిన వైనం
ఆరు నెలల తర్వాత బాధితుడి ఫిర్యాదు
టెక్నాలజీతో ఆధారాలు సేకరించిన పోలీసులు
నిందితుడి అరెస్టు.. చోరీ సొత్తు స్వాధీనం
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఆగస్టు 5)

ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయయుడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు అలవాటు పడ్డాడు. షేర్‌ మార్కెట్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దాన్ని పూడ్చేందుకు బావ ఇంట్లో చోరీ చేశాడు. భారీగా నగదు, బంగారం కాజేశాడు. ఆరు నెలల వరకు దొంగ ఎవరో తెలుసుకోలేక డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి అంతర్మథనం చెందాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్‌లో స్పందనలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. టెక్నాలజీ అసలు దొంగను పట్టించింది. బావమరిదే బావ ఇంట్లో చోరీకి పాల్పడినట్టు నిర్ధారించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాధిక వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తూరులోని అఫీషియల్‌ కాలనీలో ఉపాధ్యాయుడు జన్ని అప్పన్న నివాసముంటున్నారు. అప్పన్న బావమరిది పక్కి ఏడుకొండలు కూడా ఉపాధ్యాయుడే. ఏడుకొండలు స్వగ్రామం భామిని మండలం పెద్దదిమిలి. అప్పన్న, ఏడుకొండలు కుటుంబాలతో సహా ఒకే వీధిలో నివసిస్తున్నారు. ఏడుకొండలు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు అలవాటు పడ్డాడు. వీటితోపాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌, బిట్‌కాయిన్స్‌, ఎంసీఎస్‌ కొమొడిటీ ట్రేడింగ్‌, షేర్‌ మార్కెట్‌ వంటివాటిలో ట్రేడింగ్‌ చేయడం వ్యసనంగా మారింది. రూ.30 లక్షల వరకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పోగొట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. అప్పన్న కుమారుడి పెళ్లి గత ఏడాది కరోనా వ్యాప్తి సమయంలో హడావుడిగా జరిగింది. కోడలు తెచ్చిన కట్నకానుకల ఇంట్లో భద్రపరిచారు. ఈ విషయాన్ని ఏడుకొండలు గమనించి.. సొంత బావ ఇంట్లో చోరీకి ప్రణాళిక రచించాడు. అప్పన్న కుటుంబంతో సహా బయటకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి.. ఆ తాళాన్ని ఇంటిముందు ఉన్న రాయికింద భద్రపరిచేవాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్‌ 25న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. ఇదే అదునుగా ఏడుకొండలు.. రాయి కింద ఉన్న తాళంతో ఇంటిని తెరిచాడు. బీరువా కూడా తెరిచి.. అందులో ఉన్న రూ.21.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారాన్ని కాజేశాడు. యథాప్రకారం ఎక్కడి తాళాలు అక్కడ పెట్టేశాడు. బీరువాలో డబ్బులు, బంగారం కనబడకపోవడంతో.. ఇది ఇంటి దొంగల పనా? లేదా బయటవారి పనా? అని అప్పన్న ఆరు నెలలుపాటు ఎటూ తేల్చుకోలేకపోయాడు. చివరకు ఈ ఏడాది ఏప్రిల్‌ 30న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ విఠలేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తూరు సీఐ, ఇద్దరు కానిస్టేబుల్‌ విచారణ చేపట్టారు. సెల్‌టవర్‌ లొకేషన్‌తోపాటు.. చోరీ జరిగిన రోజు ఇంట్లోకి  ప్రవేశించినవారి ఫోన్‌ నంబర్లు.. ఆ రోజు ఎక్కడెక్కడ సంచరించారన్నది ఫోన్‌ లొకేషన్‌తో ఆధారాలు సేకరించారు. దీంతో అసలు దొంగ పక్కి ఏడుకొండలేనని నిర్ధారించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో తానే చోరీకి పాల్పడ్డానని ఏడుకొండలు అంగీకరించాడు. చోరీకి గురైన రూ.21.5 లక్షల నగదు, 5 తులాల బంగారం బిస్కెట్‌ను ఆయన నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని ఎస్పీ రాధిక తెలిపారు. చోరీ కేసులో చురుగ్గా దర్యాప్తు చేపట్టిన కొత్తూరు సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ విఠలేశ్వరరావు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-06T05:23:08+05:30 IST