మోసంతో గెలుపు.. ఓటమితో సమానం

ABN , First Publish Date - 2020-10-08T08:14:36+05:30 IST

‘‘మిమ్మల్ని మీరు మోసగించుకోండి. కానీ ఇతరులను మోసగించ ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు మోసగించుకోవడం వల్ల కొంత సుఖం పొందవచ్చు. కానీ పరులను మోసగించడం వల్ల మొదటగా తప్పు.....

మోసంతో గెలుపు.. ఓటమితో సమానం

కబీరా ఆప్‌ ఠగాయియే, ఔర్‌ న ఠగియే కోయ్‌ 

ఆప్‌ ఠగే సుఖ్‌ ఉపజే, ఔర్‌ ఠగే దుఃఖ్‌ హోయ్‌

‘‘మిమ్మల్ని మీరు మోసగించుకోండి. కానీ ఇతరులను మోసగించ ప్రయత్నించకండి. మిమ్మల్ని మీరు మోసగించుకోవడం వల్ల కొంత సుఖం పొందవచ్చు. కానీ పరులను మోసగించడం వల్ల మొదటగా తప్పు చేసినవారవుతారు. ఫలితంగా దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది.’’ అని అంటాడు మహాత్మా కబీరు దాసు. ఎదుటివారిని మాటలతో మభ్యపెట్టి మోసగించడం వల్ల తాత్కాలికంగా సంతోషం కలగవచ్చు. కానీ ఆ తరువాత దుఃఖం అనుభవించక తప్పదని దీని అంతరార్థం. రామాయణంలో.. మారువేషంలో వచ్చిన రావణుడు సీతను మోసగించి అపహరించుకుపోయాడు. ఘనకార్యం చేశానని సంతోషంతో మీసం మెలేశాడు. కానీ.. చివరకు రాముడి చేతిలో హతమయ్యాడు. అంతేకాదు.. అతడికి తలకొరివి పెట్టడానికి కొడుకులు సైతం ఎవరూ మిగల్లేదు. మహాభారతంలో.. పాండవులకు సూది మోపినంత నేల కూడా ఇవ్వకూడదనుకున్న కౌరవులు, వారిని హతమార్చేందుకు కుట్ర పన్ని, మాయా జూదంలో ఓడించి, అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపి సంబరాలు జరుపుకొన్నారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ప్రాణాలు కోల్పోయి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ఇలా మన పురాణేతిహాసాల్లో ఈ ధర్మసూక్ష్మాన్ని విప్పిచెప్పే కథలెన్నెన్నో ఉన్నాయి. ఇదే కోవలో.. మోసం చేసి సాధించిన గెలుపు వల్ల కలిగే పర్యవసానాలను తెలిపే కథ ఒకటి హిందీ సాహిత్యంలో చాలా ప్రసిద్ధి చెందింది. అదేంటంటే.. బాబా భారతి అనే సాధువు ఊరి చివర్లో ఉన్న గుడి పక్కన చిన్న కుటీరం నిర్మించుకుని ఉంటుంటాడు. నా అనే వాటన్నింటినీ వదులుకున్న ఆయన.. సుల్తాన్‌ అనే గుర్రాన్ని మాత్రం వదులుకోలేకపోయాడు. దానికి రోజూ దాణా పెడుతూ ప్రాణప్రదంగా పెంచుకకునేవాడు.


రోజూ సాయంత్రం పూట దాని మీద కొంత దూరం స్వారీ చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందేవాడు. అలాంటి బలిష్ఠమైన గుర్రం చుట్టుపక్కల పరగణాల్లో ఎక్కడా ఉండదని అంతా చెప్పుకొనేవారు. ఈ విషయం ‘ఖడ్గసింహ్‌’ అనే బందిపోటు దొంగ చెవిన పడింది. ఒకరోజు అతడు.. బాబా సాయంత్రంపూట గుర్రపుస్వారీ చేసే సమయానికి, ఆ దారిలో ఒక వికలాంగుడి వేషంలో కూర్చున్నాడు. బాబా అక్కడికి చేరగానే.. అయ్యా, నేను పక్క ఊరికి వెళ్లాలి. కానీ, కుంటివాణ్ని కావడంతో నడవలేకపోతున్నా. నన్ను ఆ ఊరిలో దిగబెట్టండి’ అని వేడుకున్నాడు. బాబా జాలిపడి  అతణ్ని గుర్రం మీద కూర్చోబెట్టి కళ్లెం చేతబట్టి నడవసాగాడు. అవకాశం కోసం వేచిచూస్తున్న ఖడ్గ సింహ్‌.. హఠాత్తుగా కళ్లాలను లాక్కుని గుర్రాన్ని పరుగులు తీయించాడు. తీవ్ర దిగ్ర్భాంతికి గురైన బాబా.. ‘గుర్రం తీసుకెళ్లుగానీ.. నన్ను ఇలా మోసం చేసి తీసుకెళ్లినట్టు ఎవరికీ చెప్పకు. అలా చెప్తే ఇకపై ఎవరూ పేదవారికి, బాధలో ఉన్నవారికి సాయం చేయడానికి ముందుకురారు’ అని అరిచి చెప్పాడు. బాబా మాటల్లో అంతరార్థాన్ని గ్రహించిన బందిపోటు.. ‘‘మోసం చేసి గెలిచానని నేను విర్రవీగాను. కానీ తాను మోసపోయినా ఇతరుల మేలు కోసం ఆలోచించిన బాబా భారతి ముందు నేనే ఓడిపోయాను’’ అనుకుంటూ ఆ గుర్రాన్ని తీసుకొచ్చి మళ్లీ బాబా కుటీరం ముందు కట్టేసి వెళ్లిపోయాడు. 


- పరికిపండ్ల సారంగపాణి, 9849630290

Updated Date - 2020-10-08T08:14:36+05:30 IST