మారకుంటే మీకే నష్టం!

ABN , First Publish Date - 2021-02-25T07:50:47+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండొద్దని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.

మారకుంటే మీకే నష్టం!

  • పార్టీ ఉంటేనే మనం ఉంటాం.. 
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిర్లక్ష్యం వద్దు!
  • గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
  • హైదరాబాద్‌, రంగారెడ్డి, పాలమూరు ప్రజాప్రతినిధులతో భేటీలో కేటీఆర్‌
  • జీహెచ్‌ఎంసీ ఫలితాలపై అసంతృప్తి
  • జాగ్రత్తగా లేకుంటే మున్ముందు కష్టమే
  • టీఆర్‌ఎస్‌ నేతలకు సుతిమెత్తని హెచ్చరిక
  • ఆరున్నరేళ్లలో 1,32,799 ఉద్యోగాలిచ్చాం
  • బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు
  • వాణీదేవి అర్హురాలని ప్రత్యర్థులే అంటున్నారు
  • ఎమ్మెల్సీ ప్రచార సన్నాహక భేటీలో కేటీఆర్‌


మెజారిటీతో గెలుస్తా

ప్రజాసేవ చేయడం నాకేం కొత్త కాదు. మా నాన్నకు రిటైర్మెంట్‌ సమయంలో ప్రధాని పదవి వచ్చినట్లుగా.. నాకీ ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. అధిక మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం ఉంది. పట్టభద్రుల సమస్యలను దగ్గరి నుంచి చూశా.ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తా. 

 టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి


హైదరాబాద్‌/సిటీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎక్కడా నిర్లక్ష్యంగా ఉండొద్దని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోలాగా నిర్లక్ష్యం వద్దు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌, మహేశ్వరం, పార్టీ ఎమ్మెల్యేలున్న ఎల్బీనగర్‌, ముషీరాబాద్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఉప్పల్‌లోనూ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పట్టభద్రుల ఎన్నికల్లో ఈ పరిస్థితి పునరావృతం కావొద్దు’ అని సూచించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశం కేటీఆర్‌ అధ్యక్షతన జరిగింది. మూడు జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ‘2022లో సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరే అభ్యర్థి అనుకొని పని చేయండి. 


మనం నమోదు చేయించిన పట్టభద్రులు పార్టీకి ఓటు వేసేలా చూడండి. జాగ్రత్తగా ఉండండి. లేదంటే భవిష్యత్తులో మీకే నష్టం’ అని సుత్తిమెత్తగా హెచ్చరించినట్లు తెలిసింది. ‘దుబ్బాకలో మొదలైన ప్రతికూల ఫలితాల పరంపర జీహెచ్‌ఎంసీలోనూ కొనసాగింది. మున్ముందు పరిస్థితి ఇలానే ఉంటే పార్టీకి, మనందరికీ నష్టం. పార్టీ బాగుంటేనే మనం ఎమ్మెల్యేలు, మంత్రులు కాగలం. ఈ విషయాన్ని విస్మరించవద్దు’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ.. మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ప్రకా్‌షగౌడ్‌, భేతి సుభా్‌షరెడ్డి, ముఠా గోపాల్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఫలితాలపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. 


దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి..

‘ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు. సామాజిక మాధ్యమాల్లో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని.. అదే వేదిక ద్వారా వాస్తవాలు ప్రజలకు తెలిసేలా తిప్పికొట్టాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘విపక్షాలు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి విమర్శించడం విజ్ఞత కాదు. పట్టభద్ర ఓటర్లు విచక్షణతో ఓటేస్తారు. చేసిన పనులను అర్ధమయ్యేలా వివరించండి’ అని సూచించారు. ‘సమయం తక్కువగా ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రతి ఓటరును ఒకటికి నాలుగుసార్లు కలవండి. ప్రతి 50 మంది ఓటర్లకు ఇద్దరు, ముగ్గురిని ఇన్‌చార్జ్‌లుగా నియమించండి. నమోదు చేయించిన వారితోపాటు ఇతర ఓటర్లను కూడా పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లాలి. దివంగత ప్రధాని పీవీ  కూతురు ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం, అభ్యర్థి సానుకూలతలు గురించి చెప్పండి. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ఏం చేసింది. ఎమ్మెల్సీగా ఆరేళ్లలో రాంచందర్‌రావు ఏం చేశారన్నది ఓటర్లకు చెప్పండి. మనం అభివృద్ధి చేస్తున్నది నిజం. ఉద్యోగాలు భర్తీ చేసింది వాస్తవం. ఈ వివరాలు ఓటర్లకు అర్ధమయ్యేలా చెప్పి ఒప్పించండి. ఇది మీ బాధ్యత’ అని కేటీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. 


డిబేట్లలో పరువు తీసుకోవద్దు..

టీవీ చానళ్లలో చర్చలకు పార్టీ నాయకులు వెళ్లే అంశంపైనా కేటీఆర్‌ స్పందించినట్లు తెలిసింది. ‘ప్రసార మాధ్యమాలు నిర్వహించే డిబేట్లకు వెళ్లండి. వద్దని చెప్పడం లేదు. ఏ అంశం మీద చర్చ ఉంటుందన్నది తెలుసుకొని ముందస్తుగా సన్నద్ధమై వెళ్లాలి. లేకపోతే వ్యక్తిగతంగా మీతోపాటు పార్టీకి నష్టం. నిన్న ఓ ఛానల్‌(ఏబీఎన్‌)లో జరిగిన ఘటనల్లాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. ప్రజా జీవితంలో ఉన్న వారికి ఆవేశాలు, ఉద్రేకాలు పనికిరావు. సమర్ధంగా సర్కారు తరఫున వాణి వినిపించండి’ అని సూచించారు. 


1.32 లక్షల ఉద్యోగాలిచ్చాం..

ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో 1,32,799 ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులో 36 వేల నియమాకాలను టీఎ్‌సపీఎస్సీ చేపట్టింది. జెన్‌కో, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, విద్యా, పంచాయతీరాజ్‌ శాఖలు మిగతా కొలువులను భర్తీ చేశాయి. ఈ అధికారిక లెక్కలు తప్పంటే నేను ఎవరితోనైనా చర్చకు సిద్ధం’’ అని చెప్పారు. ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాలది చిల్లర ప్రచారమని ధ్వజమెత్తారు. మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్‌, బీజేపీలకన్నా.. ఉద్యోగస్థులు తమకు అత్యంత సన్నిహితులని కేటీఆర్‌ చెప్పారు. పీఆర్సీ కచ్చితంగా ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. హైదరాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి వాణీదేవికున్న అర్హతలు ఎవరికీ లేవని చెప్పారు. పీవీ కుటుంబానికి గౌరవం దక్కాలనే సీఎం కేసీఆర్‌ ఆమెకు అవకాశం కల్పించారని తెలిపారు. 


పీవీ కుటుంబం మీద నిజంగానే గౌరవం ఉంటే వాణీదేవిని రాజ్యసభకు పంపొచ్చు కదా అని ప్రతిపక్షాలు అంటున్నాయని.. అంటే ప్రత్యర్థులు కూడా వాణీదేవి ఉన్నత పదవికి అర్హురాలని సర్టిఫికెట్‌ ఇస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ‘బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచందర్‌రావు ఆరేళ్లలో ఏం చేశారు? నిన్ను గెలిపించినందుకు ఒక్క పైసా అయినా తెచ్చావా? స్వతహాగా న్యాయవాదివి.. అన్యాయంగా మాట్లాడొద్దు’ అని కేటీఆర్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎ్‌సకు 56 సీట్లు వచ్చాయని, తామే నంబర్‌ వన్‌ అని చెప్పారు. సర్జికల్‌ స్ర్టైక్స్‌ అని బీజేపీ నాలుగు సీట్లు ఎక్కువగా గెలిచిందన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయామని తాను అనుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంపై ఈ నెల 27న హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గ స్థాయిలో జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వాణీదేవి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నాయకులకు కేటీఆర్‌ స్పష్టం చేశారు. 


‘జీడీపీ’ బాగా పెంచేశారు!

విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రం మాట తప్పిందని కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో బీజేపీ దారుణంగా విఫలమైందన్నారు. ‘‘జీడీపీ పెంచుతామన్నారు. చెప్పినట్లుగానే గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ (జీడీపీ) ధరలు భారీగానే పెంచారు. రూ.15 లక్షలు ఇస్తామన్నారు. మీకు వచ్చాయో రాలేదో తెలియదు కానీ.. నాకు మాత్రం ట్విటర్‌లో బీజేపీ నుంచి 15 లక్షల తిట్లు వచ్చాయి. అసత్యాల పునాదుల మీద గద్దెనెక్కిన బీజేపీ.. పట్టభద్రులను ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోంది?’’ అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసిందని, అందులో ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి.. బీజేపీ నిరుద్యోగులను మోసం చేసిందని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు విమర్శించారు. మాజీ ప్రధాని పీవీలోని గుణాలు వాణీదేవిలోనూ ఉన్నాయని, ఆమెను గెలిపించాలని కోరారు.

Updated Date - 2021-02-25T07:50:47+05:30 IST