Abn logo
Nov 29 2020 @ 01:18AM

ఇంకేం మిగిలిందని..

జిల్లాలో వర్షాల దెబ్బకు తల్లడిల్లిపోతున్న అన్నదాతలు

చేతికి పంట వచ్చే సమయంలో ఎక్కడికక్కడ నేలకొరిగి కుళ్లిపోయిన పంట

 ధాన్యమంతా నీళ్లపాలు, కోసిన పంటా జలార్పణం

 1.43 లక్షల ఎకరాల్లో పంటకు దెబ్బ.. నష్టం రూ.343 కోట్లు

 లక్ష మెట్రిక్‌ టన్నులపైగా ధాన్యం రంగుమారి ఎందుకు పనికిరాని పరిస్థితి

 ఆశలు వదులుకోలేక పంట రక్షించుకునే ప్రయత్నాలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వరికి ఉరిపడింది. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు ఉసురుతీయడంతో అన్నదాత ఈసురోమంటున్నాడు. ఏంచేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నాడు. పెట్టినపెట్టుబడి ఎందుకూ పనికిరాక జలార్పణం కావడంతో కన్నీటి పర్యం తం అవుతున్నాడు. గుండెదిటవు చేసుకోలేక గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఖరీఫ్‌ నాట్లు వేసింది మొదలు పంట కోతకు వచ్చే వరకు మూడుసార్లు ప్రకృతి వైపరీత్య గండాలు ఎదు రైతే అన్నీ తట్టుకుని అన్నదాతలు పంట బతికించుకున్నారు. తీరా ధాన్యరాశులు కళ్లచూసే సమయంలో కన్నుకుట్టి మళ్లీ ప్రకృతి కాటేయడంతో ఇప్పుడు దీనంగా మారారు. తాజా వర్షాలకు జిల్లాలో 1.43 లక్షల ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ఎక్కడికక్కడ చేలల్లో పంట నేలకొరిగింది. వరి కంకులు కుళ్లిపోయాయి. కోసిన పంట తడిచి పనికిరాకుండా మారింది. కుప్పల్లో నీళ్లు చేరి ఆశలు నీరుగార్చేశాయి.  రూ.200 కోట్ల ధాన్యం రంగుమారి పనికిరాకుండా ఉంది.

దేవుడే దిక్కు...

మునుపెన్నడూ లేనంతగా జిల్లాలో ఈసారి ఖరీఫ్‌ పంట వర్షాలకు భారీగా దెబ్బతింది. వరుసగా మూడుసార్లు ప్రకృతి పగబట్టడంతో అన్నదాతలు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 2.19 లక్షల హెక్టార్లలో వరి నాట్లు పడ్డాయి. అయితే ఇవి పొట్ట దశకు చేరి మంచి దిగుబడి ఇచ్చే తరుణంలో ఆగస్టులో గోదావరి వరదలు జిల్లాను చుట్టేశాయి. డెల్టాతోపాటు కోనసీమలో లక్షల ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ఎక్కడికక్కడ నేలవాలిపోయి కంకులు రాలిపోయాయి. దుబ్బులు కుళ్లిపోయి భారీగా నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఎలాగోలా కోలుకున్న అన్నదాతను గత నెల అక్టోబరులో తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు మరోసారి దెబ్బకొట్టాయి. కోనసీమ, కాకినాడ, రామచంద్రపురం, రాజమహేంద్రవరం తదితర డివిజన్లలో 1.50 లక్ష ల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. వరదలకు అనేకచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. నేలకొరిగిన చోట్ల పంట కుళ్లిపోయింది. దీంతో నష్టం భారీగా వాటిల్లింది. అటు 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పూర్తిగా రంగు మారి ఎందుకు పనికిరాకుండా పోయింది. అయితే ఈ గండం నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ ఇప్పుడు నివర్‌ తుఫాను ప్రభావంతో 1.43 లక్షల ఎకరాల్లో వరి పంట మళ్లీదెబ్బతింది. ఈసారి కూడా మళ్లీ కోనసీమలో అధికంగా నష్టం వాటిల్లింది. ఆతర్వాత కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, రాజమహేంద్రవరం తదితర డివిజన్లలో వేలాది ఎకరాల్లో వరి  నేలవాలిపోయింది. మరో వారంలో కోతలు మొదలవుతాయనుకున్న తరుణంలో వర్షాలకు ఇవన్నీ వాలిపోయి నీటిలో ఉండిపోయాయి. దీంతో ఇప్పుడు అవన్నీ కుళ్లిపోయాయి. ధాన్యం కంకులు నల్లగా మారి బూజుపట్టేశాయి. కోనసీమసహా దాదాపు 28 మండలాల్లో ధాన్యం రాశులు చేలల్లో రాలిపోయి కుళ్లిపోయాయి. అప్పటికే కోసిన పంటలు కూడా దుబ్బుతోసహా నీళ్లలో ఉండిపోయి కుళ్లిపోయాయి. వందల ఎకరాల్లో పంట కంకుల్లో ధాన్యంబదులు పొల్లే ఉండడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అటు 25కుపైగా మం డలాల్లో పంట కోసి కుప్పలు వేశారు. ఈదురుగాలులకు ఇవి కొంతవరకు ఎగిరిపోయాయి. మరికొన్నిచోట్ల కింద నీరు చేరి పంట కుళ్లిపోయింది. మధ్యలో కూడా వర్షం చేరి పంట పనికిరాకుండా పోయింది. ఇలా ఎక్కడికక్కడ 1.43 లక్షల ఎకరాల్లో పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరాకు ఎనిమిది బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. తాజా వర్షాలకు 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పూర్తిగా రంగుమారి ఎందుకు పనికిరాకుండా పోయింది. మొత్తంమీద చూస్తే అక్టోబరు,         నవంబరు వరదలు, వర్షాలకు కలిపి జిల్లావ్యాప్తంగా లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం రంగుమారి తినడానికి పనికిరాకుండా పోయింది. మెట్రిక్‌టన్నుకు మద్దతు ధర రూ.18,680 చొప్పున దాదాపు రూ.200 కోట్ల వరకు ధాన్యం నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈ ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లా మొత్తం మీద 13 లక్షల టన్నుల ధాన్యం సేకరణ చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు కూడా మొదలై చాలారోజులవుతుంది. ఇప్పటివరకు కేవలం 48వేల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం మాత్రమే సేకరణ జరిగింది. వరుస నష్టాలకు వరి దెబ్బతినడంతో ఈసారి ధాన్యం సేకరణ లక్ష్యానికి దూరంగా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇక తాజా పంట నష్టానికి సంబంధించి డిసెంబర్‌ 1 నుంచి అంచనాలు ప్రారంభించి 30 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.


Advertisement
Advertisement
Advertisement