లారీల దొంగ అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు

ABN , First Publish Date - 2021-03-07T12:15:27+05:30 IST

పార్కు చేసి ఉంచిన లారీలను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని కాలాపత్తర్‌ పోలీసులు అరెస్ట్‌...

లారీల దొంగ అరెస్ట్‌.. పరారీలో మరో ఇద్దరు

హైదరాబాద్/మదీన : పార్కు చేసి ఉంచిన లారీలను దొంగిలిస్తున్న ఓ వ్యక్తిని కాలాపత్తర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. శనివారం పురానీహవేలీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌, కాలాపత్తర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సుదర్శన్‌, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ విక్రంసింగ్‌లతో కలిసి వివరాలను వెల్లడించారు. నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన సులేమాన్‌ఖాన్‌ కుమారుడు సాబెర్‌ఖాన్‌(42)లారీడ్రైవర్‌. మద్యం, గంజాయి, జల్సాలకు బానిసయ్యాడు. దీంతో సులువుగా డబ్బులు సంపాదించాలంటే లారీలను దొంగిలించాలని పథకం పన్నాడు. తన స్నేహితులైన సలీమ్‌ అలియాస్‌ లాలూ, యస్రూన్‌ను తనతో కలుపుకుని లారీలను తస్కరించడం మొదలుపెట్టారు. 


పార్కు చేసి ఉన్న లారీలను గుర్తించి రాత్రిపూట ముగ్గురూ వెళ్ళి మారు తాళపుచెవితో లారీని తస్కరించి తీసుకెళ్తారు. అలా ఫిబ్రవరిలో కాలాపత్తర్‌ పీఎస్‌ పరిధిలో ఒక లారీ, గత నవంబర్‌లో బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలో ఒక లారీని దొంగిలించారు. దొంగిలించిన లారీలను స్ర్కాఫ్‌ దుకాణాలకు విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారు. లారీల దొంగతనంపై దర్యాప్తు చేపట్టిన కాలాపత్తర్‌ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన ఒక లారీ(ఏపీ 22 వై5369)ని రాజస్థాన్‌లో స్వాధీనం చేసుకున్నారు. దీన్ని విలువ రూ.20లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక కృషి చేసిన డిటెక్టివ్‌ టీమ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌ టి.విక్రంసింగ్‌, కానిస్టేబుళ్ళు బాల దస్తగిరి, మహ్మద్‌ సైఫ్‌ ముహియుద్దీన్‌, ఆర్‌.నవీన్‌ కుమార్‌, డి.వెంకటేశ్వర్లు, కె.జగదీశ్వర్‌, జి.సతీ్‌షకుమార్‌లను అభినందించి అవార్డులను అందజేశారు.

Updated Date - 2021-03-07T12:15:27+05:30 IST