లారీలు ఢీ.. ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-04-17T05:57:39+05:30 IST

ఇద్దరు లారీల డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ డ్రైవర్‌ తరపున వెళ్లిన వారు వారికి సర్ది చెప్తుండగా మరో లారీ వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం అర్ధరాత్రి దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని గణపతి కోల్డ్‌స్టోరేజ్‌ వద్ద చోటు చేసుకుంది.

లారీలు ఢీ.. ముగ్గురి మృతి

డ్రైవర్లకు సర్దిచెప్తుండగా ఘటన

గామాలపాడులో విషాదం 


దాచేపల్లి, ఏప్రిల్‌ 16: ఇద్దరు లారీల డ్రైవర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ డ్రైవర్‌ తరపున వెళ్లిన వారు వారికి సర్ది చెప్తుండగా మరో లారీ వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం అర్ధరాత్రి దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ సమీపంలోని గణపతి కోల్డ్‌స్టోరేజ్‌ వద్ద చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. కారంపూడి మండలం బ్రహ్మనాయుడు కాలనీకి చెందిన డ్రైవర్‌ రావూరి గోవిందరాజు(41) పొందుగుల నుంచి దాచేపల్లికి సిమెంట్‌ లోడుతో వెళ్తున్నాడు. అదే సమయంలో మిర్చిలోడుతో వస్తున్న మరో లారీ డ్రైవర్‌ బాబు వాహనాన్ని సిమెంట్‌లోడు లారీ తాకింది. ఈ ఘటనలో మిర్చి లారీకి  కట్టిన తాడు ఊడి బస్తాలు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు లారీలను నిలిపి గొడవపడ్డారు. ఈ క్రమంలో సిమెంట్‌ లోడు లారీ డ్రైవర్‌ గోవిందరాజు జరిగిన వివాదంపై గామాలపాడు గ్రామంలోని దూరపు బంధువులకు సమాచారమిచ్చాడు. దీంతో గామాలపాడుకి చెందిన టైలర్‌ షేక్‌ జానీ(35), లైటింగ్‌ పనిచేసే పిడుగు వెంకట్రామయ్య(18) అక్కడకు చేరుకుని డ్రైవర్లకు సర్ది చెప్తున్నారు. అదే సమయంలో దామరచర్ల నుంచి దాచేపల్లి వైపు అక్రమ మద్యం కలిగి ఉన్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న రెండు లారీలను ఢీకొట్టింది. మిరపకాయల లారీ, సిమెంట్‌ లారీ మధ్య నిల్చొని డ్రైవర్లతో మాట్లాడుతున్న జానీ, వెంకట్రామయ్యతో పాటు సిమెంట్‌ లారీ డ్రైవర్‌ గోవిందరాజు అక్కడికక్కడే మృతి చెందారు. గామాలపాడుకి చెందిన షేక్‌ గౌస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడి పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  వెంకట్రామయ్యకు వివాహం కాలేదు.షేక్‌ జానీకి భార్య రంజాన్‌బీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన సంఘటనపై ఎస్‌ఐ  బాలనాగిరెడ్డి కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-04-17T05:57:39+05:30 IST