అన్నమయ్య అన్నది - 30

ABN , First Publish Date - 2020-03-20T17:47:32+05:30 IST

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో..

అన్నమయ్య అన్నది - 30

ఇవాళ అంతర్జాతీయంగా ఏ రచనా సంవిధానం,‌ ఏ‌ విధమైన చింతన,‌ ఏ విధమైన‌ భావన ఉన్నతమైన కవిత్వంగా పరిగణించబడుతూ, కొనియాడబడుతూ ఎక్కువగా చదవబడుతున్నదో ఆ‌ స్థాయిలో కవిత్వం‌ చెప్పారు అన్నమయ్య. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఒక  అంతర్జాతీయ కవి అన్నమయ్య. మనకై‌ ఉన్నది అన్నమయ్య‌ అన్నది. స్మరించుకుందాం రండి -- 


***


"సకల భూతదయ చాఁలఁగ గలుగుట
ప్రకటించి దేహ సంభవమైన ఫలము"

 


అన్ని ప్రాణులపైనా కావాల్సినంత దయ‌ను కలిగి ఉండడమే దేహంతో పుట్టినందుకు జరగాల్సిన కార్యం (ఫలము) లేదా పని అంటూ‌ అన్నమయ్య చాలా సూటిగా ఈ దేహం చెయ్యాల్సిన పనిని చెబుతూ సంకీర్తన్ని సంధిస్తున్నారు.


ఈ భూత దయ అన్నదే ఉండి ఉంటే ఇవాళ ఈ ప్రపంచం ఎదుర్కుంటున్న కొన్ని   భయంకరమైన వ్యాధులు వ్యాపించి ఉండేవి కావు. ప్రాణుల్ని దయ లేకుండా చంపి తినడం వల్ల ప్రపంచ మానవాళి కొన్ని భయంకరమైన వ్యాధులకు బలయిన‌ సంగతి మనకు తెలిసిందే.‌  "ధర్మో జీవదయాతుల్యో న క్వాపి జగతీతలే/ తస్మా త్సర్వ ప్రయత్నేన కార్యా జీవదయా నృభిః" అని‌ ఒక పూర్వ సంస్కృత శ్లోకం చెబుతోంది. అంటే ధర్మాల్లో జీవదయకు సమమైనది మఱొకటి ఈ జగత్తులో లేదు‌.‌ కనుక ప్రయత్నించి జీవదయకు చెందిన కార్యాలతో ప్రవర్తించాలి అని అర్థం. మనిషిని మనిషి  దయ ‌లేకుండా రకరకాలుగా హింసించడం అన్నది‌ కూడా యుగయుగాలుగా వస్తున్నదే.‌  దయలేకపోవడం అన్నది‌ మానవాళికి చేస్తున్న హాని మానని పుండై సమాజాన్ని బాధిస్తూనే ఉంది. "అహింసా‌ పరమో ధర్మః‌‌ తథాSహింసా పరం తపః / అహింసా పరమం‌ జ్ఞానం అహింసా పరమార్జవం" ‌అని‌ భారతం చెప్పింది. అంటే అహింసే ఉత్తమమైన ధర్మం. అలా అహింస ఉత్తమమైన తపస్సు.‌ అహింసే ఉత్తమమైన  జ్ఞానం‌. అహింసే ఉత్తమమైన సంపాదన అని‌ అర్థం.  


"తలకొన్న ఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త-
మలవరించుట కర్మియైన ఫలము
పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి
గలుగుట హరికృప గలిగిన ఫలము "


చెలరేగే ఫలితం అన్న వాంఛ తగలకుండా చిత్తాన్ని ఉంచుకోవడం కర్తవ్యం చేసేవాడి పని అనీ, అన్ని పనుల్లోనూ బ్రహ్మార్పణ బుద్ధి కలగడం హరికృప కలిగిన కార్యం లేదా పని అనీ అన్నమయ్య తొలిచరణంలో అంటున్నారు. 


"కర్మణ్యేవాధికారస్తే మా‌ ఫలేషు‌ కదాచన / ‌మా‌ కర్మఫల హేతుర్భూర్మాతే సంగోSస్త్వకర్మణి" ‌అని భగవద్గీత (అధ్యాయం 2 శ్లోకం 47) లో  ప్రవచించబడ్డది. భగవద్గీతలో ఇతర పలు శ్లోకాలలా ఈ శ్లోకమూ దోషార్థంతో చలామణిలో ఉన్నది. అయితే  ఉద్దేశించబడ్డ అర్థం:  నీకు కర్తవ్యం (కర్మ) లోనే‌‌ అర్హత (అధికారః) ఉంది. ఎప్పటికీ ఫలితానికి లేదా లాభానికి కారణంగా ఉండద్దు (మా హేతుః). ఈ అర్థాన్ని మనం‌ గ్రహించగలగాలి. ఈ‌‌‌ ఉద్బోధను మనం‌ అవగతం చేసుకోగలిగితే మనకు ఆవేదన, ఆందోళనలు ఉండవు. ప్రశాంతంగా బ్రతకడానికి ఈ‌ మానవాళికి‌ భగవద్గీత‌‌‌ చూపిన‌ మార్గాల్లో ఇది ఒకటి.


భగవద్గీత (అధ్యాయం 2 శ్లోకం 19)లో మఱో‌ ఉద్బోధ ఇలా మనకై ఉంది. "తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ‌‌సమాచర / అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః". అంటే (నువ్వు కర్తవ్యం చెయ్యాలి కనుక) నువ్వు ఎల్లప్పుడూ ఫలితంలో ఆపేక్ష లేనివాడివై చెయ్యాల్సిన కర్తవ్యాన్ని బాగా చెయ్యి. ఫలితంలో ఆపేక్షను వదిలేసి కర్తవ్యాన్ని చేసే పురుషుడు మోక్షాన్ని (పరంను) పొందుతాడు అని అర్థం. అన్నమయ్య బ్రహ్మార్పణ బుద్ధి అని దీన్నే చెబుతున్నారు.  


వైనీస్ కవి-తాత్త్వికులు లావ్ ట్సూ (Lao tzu) తమ‌‌ టా‌ఔ - టీ- చింగ్ (Tao -Te-Ching) 10 వ కవితలో "ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యి....అది అత్యున్నతమైన గుణం" అనీ,  24వ కవితలో "నీ పని చెయ్యి ఆపై వదిలెయ్యి" అనీ, 37వ కవితలో "వాంఛ లేనప్పుడు అన్నీ ప్రశాంతతలో ఉంటాయి" అనీ తెలియజెప్పారు. 


"యెప్పుడుఁ దిరివేంకటేశు సేవకుఁడౌట
తప్పక జీవుఁడు దానైన ఫలము
కప్పిన సౌఖ్య దు:ఖమ్ముల సమముగా
నొప్పుట విజ్ఞాన మొదవిన ఫలము " 


ఎప్పుడూ శ్రీ‌‌ వేంకటేశుడి (సేవకుడవడమే) పూజించే వాడవడమే మనిషైనందుకు చెయ్యాల్సిన పని అనీ,

ఉన్న సుఖ దుఃఖాలు సమంగా ప్రకాశింపచెయ్యడం విజ్ఞానం‌ చేసే పని అనీ ఈ‌ సంకీర్తన్ని ముగించారు అన్నమయ్య‌.



విజ్ఞానం అంటే ఎఱుక (knowledge) అని అర్థం.‌‌ ఎఱుక‌ ఉంటే  అంటే ఏది‌ ఏదో‌ తెలిస్తే సుఖ దుఃఖాలు సమంగానే‌ తెలిసి‌ వస్తాయి. ఆ సత్యాన్నే చెబుతున్నారు అన్నమయ్య. 


దేని పని ఏదో చెబుతూ అత్యంత అవసరమైన‌ విషయాల్ని తెలియజేస్తూ మనిషైన‌ వాడి పని‌ ఏమిటో తెలియజేస్తూ  ఆపై విజ్ఞానం చెయ్యగల పని ఇదేనని విశదపఱుస్తూ‌ ఉన్నది ఇలా అన్నమయ్య అన్నది.



ఈ శీర్షికలో ఇంతవఱకూ వచ్చిన రచనల లింక్‌లు


వేంకటేశ్వరుని మతం ఇదే!

ఆ చోటు కోసం మళ్లీ ఇక్కడే పుట్టాలి!

దంచుతున్న ఈ స్త్రీ ఎవరంటే..

తొందరపడి ఆ పని చేయలేదు 

వేంకటేశ్వరుడి నవ్వులు.. ఆమెకు అక్షింతలు! 










రోచిష్మాన్
9444012279
rochishmon@gmail.com

Updated Date - 2020-03-20T17:47:32+05:30 IST