ఇది చూశాకే.. ‘బాహుబలి’లో ఆ సీన్ క్రియేట్ చేశారేమో.. అంతుచిక్కని పురాతన శివాలయ రహస్యం!

ABN , First Publish Date - 2021-12-12T13:32:00+05:30 IST

‘బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ ఒక భారీ శివలింగాన్ని తీసుకువచ్చి..

ఇది చూశాకే.. ‘బాహుబలి’లో ఆ సీన్ క్రియేట్ చేశారేమో.. అంతుచిక్కని పురాతన శివాలయ రహస్యం!

‘బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ ఒక భారీ శివలింగాన్ని తీసుకువచ్చి జలపాతం కింద ఉంచి, మహాశివునికి నిత్యం జలాభిషేకం జరిగేలా చేస్తాడు. ఈ సీన్ ‘బాహుబలి’ సినిమా చూసినవారికి గుర్తు ఉండేవుంటుంది. ఇదేవిధంగా ఎత్తయిన జలపాతాల నుంచి జాలువారే నీటితో శివునికి జలాభిషేకం జరిగే ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో పేర్కొన్న ప్రధాన దేవతలలో ఒకరైన శివునికి సంబంధించిన ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో కూడా ఉన్నాయి. అయితే మహాశివుని అసలు నివాసం కైలాస పర్వతం అని హిందువులు నమ్ముతారు. ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన ఉత్తరాఖండ్ దేవభూమిగానూ పేరొందింది. పరమశివుడు ఈ పవిత్ర భూమిపై నడయాడినట్లు భావిస్తారు. 


ఉత్తరాఖండ్‌లో కొలువై స్కాంద పురాణంలోకూడా పేర్కొనబడిన ఒక పురాతన శివుని ఆలయం  గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయానికి మరో అరుదైన ప్రత్యేకత కూడా ఉంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే జలపాతం నీటితో ఇక్కడి శివునికి జలాభిషేకం జరుగుతుంది. ఈ ఆలయం పుంగేశ్వర శివాలయంగా పేరొందింది. ఈ శివాలయం కత్యూరి రాజుల పాలనలో (7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం) నిర్మితమయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో కైలాశ్-మానససరోవర యాత్రను చేసే భక్తులు ఈ శివాలయాన్ని సందర్శించిన తర్వాతనే తమ యాత్ర ప్రారంభించేవారు. అయితే కైలాశ్-మానససరోవర్ యాత్ర రూట్ మారిన కారణంగా ఈ సంప్రదాయం ఆగిపోయింది. పర్వత రాజు హిమాలయ కుమార్తె పార్వతీమాతను వివాహం చేసుకున్న తరువాత మహా శివుడు తన స్వస్థలమైన కైలాసానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా వారు ఈ మార్గం గుండా వెళుతూ ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని ప్రతీతి. ఈ ఆలయానికి ఉత్తరాన గౌరీగంగ నది ప్రవహిస్తుంది. ఇక్కడి జలపాతం 150 మీటర్లకు మించిన ఎత్తులో ఉంది. అక్కడి నుంచి జాలువారే నీటితో మహాశివునకి జలాభిషేకం జరుగుతుందని స్కాంద పురాణంలో ఉంది. ఈ ప్రాంతంలో శివుని అనుగ్రహం కోసం చాలా మంది తపస్సు చేశారు. ఈ ఆలయం కత్యూరి శైలిలో నిర్మితమయ్యింది. ఈ దేవాలయంపై అందమైన ఆకృతులు కనిపిస్తాయి. పుంగేశ్వర మహాదేవ్ ఆలయ గర్భగుడిలో తమలపాకు రూపంలో శివలింగం దర్శనమిస్తుంది. ప్రాంగణంలో నంది కొలువుదీరివుంది. 



Updated Date - 2021-12-12T13:32:00+05:30 IST