రామో రామశ్చ రామశ్చ

ABN , First Publish Date - 2020-06-21T08:35:17+05:30 IST

అశేష భారతీయులకు రాముడు ఆరాధ్యదైవం. ఏదైనా వినరాని దుర్ఘటన గాని, వినరాని మాటగాని వినగానే రామ రామ! అని ఆ మహనీయమూర్తిని సుజన ..

రామో రామశ్చ రామశ్చ

అశేష భారతీయులకు రాముడు ఆరాధ్యదైవం. ఏదైనా వినరాని దుర్ఘటన గాని, వినరాని మాటగాని వినగానే రామ రామ! అని ఆ మహనీయమూర్తిని సుజన మానవులు స్మరిస్తారు. ఆ స్మరణతో ఆ దుర్వార్త, దుర్ఘటన శ్రవణ దోషం తొలగిపోతుందని భావిస్తారు. ‘హరేరామ, రామ రామ’ అనే స్మరణ పదాలు పాపహరణాలుగా ప్రజల హృదయాలలో పాతుకుపోయాయి. విష్ణువు ధరించిన దశావతారాలలో మూడు అవతారాలు రాముడు అనే పేరుతో వున్నాయి. అవి పరశురాముడు, రఘురాముడు, బలరాముడు.


మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః

రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కి రేవచః


ఇవీ దశావతారాలు. అయితే కొందరు పండితులు మూడవ రామశ్చ స్థానంలో కృష్ణశ్చ పదాన్ని చేర్చారు. సూర్యవంశ క్షత్రియ రాజులలో రఘు మహారాజుతో ప్రజారంజక పరిపాలన ప్రారంభమైంది. రాముని పాలనలో అది మరింత రమ్యంగా సాగింది. ‘రామరాజ్యం’ అంటే ‘ప్రజారంజక రాజ్యం’ అనే కీర్తి పొందింది. ‘‘మా సూర్యవంశం గొప్పది, మేము గొప్పవాళ్లం’’ అని రఘురాముడెప్పుడూ విర్రవీగలేదు. విద్యార్థి దశలో వశిష్ఠ మహాఋషి ఆశ్రమంలో చేరి, అన్ని వర్గాల విద్యార్థులతో కలసిమెలసి విద్యాభ్యాసం సాగించాడు. అరుంధతీ మాత, వశిష్ఠ మహర్షి దంపతుల ప్రేమాదరాలు చూరగొన్నాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన విశ్వామిత్ర మహర్షికి శిష్యుడై, ప్రియ సోదరుడు లక్ష్మణునితో కలసి అస్త్రశస్త్ర ధనుర్విద్యలలో ఆరితేరి.. మహా వీరుడయ్యాడు.


తమ గురువు ఆశ్రమంపై దాడి చేస్తున్న రాక్షసులు తాటక, సుబాహుల్ని రాముడు చెండాడి విశ్వామిత్రుడి మెప్పు పొందాడు. జనకుని ధనుర్యాగంలో ఎవరూ ఎత్తలేని శివధనస్సును రాముడు అవలీలగా ఎక్కుపెట్టి.. సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. సమకాలీన యోధులతో సాటిలేని బాహుబలం, సౌందర్యం, సౌజన్యం మూర్తీభవించిన రఘురాముడు తన శక్తిని సద్వినియోగం చేశాడు. ఏ రాజ్యాన్నీ ఆక్రమించలేదు. బలగర్వంతో దురాక్రమణలకు పాల్పడుతున్న రావణుని నిర్జించినా, అతని లంకా రాజ్యాన్ని కైవసం చేసుకోలేదు. అతని తమ్ముడు విభీషణుడినే అధిపతిని చేశాడు. లంకానగర స్వర్ణమయ వైభవాన్ని తన తమ్ముడు లక్ష్మణుడు తిలకించి తనతో చెప్పినా, 


‘‘అపి స్వర్ణమయీలంకా నమే లక్ష్మణ రోచతే

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’’

‘లక్ష్మణా! లంకా నగరం స్వర్ణమయమే అయినా, దానిని నేను కోరను. జన్మభూమి, జన్మనిచ్చిన తల్లి, స్వర్గం కన్న మిన్న అయినవి’ అన్నాడు. ఆదికవి, రామాయణం రచించిన వాల్మీకి ‘రామో విగ్రహవాన్‌ ధర్మ’ (ధర్మం మూర్తీభవించిన స్వరూపమే రాముడు) అన్నాడు.


                    - పారుపల్లి వెంకటేశ్వరరావు, సెల్‌ : 98481 61208

Updated Date - 2020-06-21T08:35:17+05:30 IST