పరమాత్ముడు బందీ అయ్యేది భక్తికే!

ABN , First Publish Date - 2020-06-28T07:10:42+05:30 IST

అంబరీశోపాఖ్యాన ఘట్టంలో పరమాత్మ ‘‘నా భక్తుడైనవాడు నా మేలు కోరుచున్నందున, వారికి నేనే రక్షకుడను. గోవు వెంట పడే కోడెలాగా.. భక్తుని వెంట పడతాను’’ అని....

పరమాత్ముడు బందీ అయ్యేది భక్తికే!

నాకు మేలు గోరు నాభక్తుఁడగు వాడు,

భక్త జనుల కేన పరమ గతియు

భక్తుఁడెందు జనినఁ బఱతెంతు వెనువెంట 

గోవు వెంటఁ దగులు కోడెభంగి 


(భాగవతం - 9వ స్కంధము)


అంబరీశోపాఖ్యాన ఘట్టంలో పరమాత్మ ‘‘నా భక్తుడైనవాడు నా మేలు కోరుచున్నందున, వారికి నేనే రక్షకుడను. గోవు వెంట పడే కోడెలాగా.. భక్తుని వెంట పడతాను’’ అని అభయమిచ్చెను. ఒకప్పుడు రాజర్షి అయిన అంబరీశుడికి తన సుదర్శన చక్రమునే అనుగ్రహించిన కరుణామూర్తి శ్రీమహావిష్ణువు. ఒక రోజు ద్వాదశీవ్రతం సందర్భంగా, అంబరీశుడు భోజనం చేయడానికి ఉపక్రమించగా.. దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. భోజనానికి ఆహ్వానించగా.. ఆ మహర్షి స్నానానికని నదికి వెళ్లి, ఎంతకీ తిరిగి రాలేదు. ద్వాదశి ఘడియలు ముగుస్తుండటంతో.. అంబరీశుడు నీళ్లు తాగి, మహర్షి రాకకోసం నిరీక్షించాడు. తిరిగి వచ్చి, విషయాన్ని గ్రహించిన దుర్వాసుడు.. తన జుట్టు నుంచి కృత్యను సృష్టించి, అంబరీశుడిపై ప్రయోగించాడు. దీంతో.. అంబరీశుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా.. అది దుర్వాసుని వెంబడించింది. దుర్వాసుడు ఆ చక్ర జ్వాలలను తట్టుకోలేక త్రిమూర్తుల వద్దకు వెళ్లి.. వారిని శరణు వేడాడు. శీహరి పాదాలపై పడ్డాడు. దానికి శ్రీహరి.. ‘‘గడ్డి ఏనుగును బంధించినట్లే.. భక్తి అనే తాడుకు నేను బందీనవుతాను. నేను భక్తపరాధీనుడను. భక్తులను ఎదిరించే శక్తి నాకులేదు. నేను నా సుదర్శనాన్ని అంబరీశుడికి ఇచ్చాను. నీవు అతడిని శరణువేడటమే మార్గం’’ అని చెప్పగానే.. దుర్వాసుడు అంబరీశుడిని శరణువేడాడు. ఆ రాజర్షి సుదర్శన చక్రాన్ని ప్రార్థించగానే.. దుర్వాసుడు చక్ర విముక్తుడయ్యాడు.


భగవంతుడిని భక్తితో కట్టిపారేయొచ్చు. అహంకారం పతనానికి నాంది పలుకుతుందనడానికి దుర్వాస-అంబరీశుల ఇతిహాసం ఒక నిదర్శనం. భక్తిమార్గంలో ధ్రువుడు, ప్రహ్లాదుడు, గజేంద్రుడు, ద్రౌపది, కుచేలుడు ఆ శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. రావణుడు కైలాసాన్ని ఎత్తినా.. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడిపై ‘శక్తి’ ఆయుధాన్ని ప్రయోగించి మూర్చిల్లేలా చేసినా.. తన ఇరవై చేతులతో భూమండలాన్నే మోస్తున్న ఆదిశేషుడి అవతారమైన లక్ష్మణ స్వామిని ఎత్తలేకపోయాడు. అదే.. భక్తాగ్రేసరుడైన హనుమంతుడు లక్ష్మణుడిని సునాయాసంగా రాముడి చెంతకు తీసుకెళ్లాడు. మారుతి పరమ భక్తుడు కావడం వల్లే.. రామలక్ష్మణులను తన భుజాలపై కూర్చోబెట్టుకుని ఎగరగలిగాడు. భక్తిలేకుండా చేసే వ్రతదానములు, జపతపాదులు, యజ్ఞ యాగాదులు, నియమ నిష్ఠలకు భగవంతుడు వశుడు కాడు. తులాభారంలో సత్యభామ వజ్రవైఢూర్యాలు, ఆభరణాలను వేసినా తూగని శ్రీకృష్ణుడు.. రుక్మిణీదేవి భక్తితో వేసిన తులసీదళానికి లొంగిపోయాడు. భగవంతుడికి భక్తి ఒక్కటే ప్రధానం.


- రాయసం రామారావు (ఎంఏబీఎల్‌)

94921 91360

Updated Date - 2020-06-28T07:10:42+05:30 IST