లూటీ..!

ABN , First Publish Date - 2022-06-20T05:10:23+05:30 IST

లూటీ..!

లూటీ..!
జీవన్గి ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన అక్రమంగా లారీలో లోడ్‌ చేస్తున్న నాపరాళ్లు


  • బషీరాబాద్‌ మండలంలో యథేచ్ఛగా నాపరాతి అక్రమ తవ్వకాలు
  • చెరువుల శిఖం, రైల్వే భూములను వదలని అక్రమార్కులు
  • రాయల్టీ లేకుండానే రవాణా
  • పట్టించుకోని మైన్స్‌, రెవెన్యూ అధికారులు

బషీరాబాద్‌, జూన్‌ 19: సర్కారు భూముల్లో నాపరాళ్ల అక్రమ తవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయి. లీజుల పేరిట, మరికొందరు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి వనరులను దోపిడీ చేస్తున్నారు. చెరువుల శిఖం, ఆర్‌అండ్‌బీ రోడ్లు, రైల్వే పట్టాల పక్కన భూములను కబ్జా చేసుకుని అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మైన్స్‌ లీజులు, రాయల్టీలు లేకుండానే విలువైన నాపరాళ్ల నిక్షేపాలను తరలించుకుపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బషీరాబాద్‌ మండలంలో నవాల్గ, కొర్విచెడ్‌, మాసన్‌పల్లి, క్యాద్గీరా, జీవన్గి, ఎక్మాయి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో విస్తారంగా నాపరాతి నిక్షేపాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు లీజుల మాటున అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి నాపరాతి సంపదను లూటీ చేస్తున్నారు. అలాగే కొర్విచెడ్‌ గ్రామ సమీపంలోని చెరువు శిఖం భూముల్లో కొందరు అక్రమంగా నాపరాళ్ల తవ్వకాలను జరుపుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఈ ప్రాంతంలోని రైల్వేలైన్‌ పట్టాల గుండా కొందరు  ఎక్స్‌కవేటర్ల ద్వారా  నాపరాతి తవ్వకాలు జరుపుతున్నారు. జీవన్గి ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్గం పక్కనే నిబంధనలకు విరుద్ధంగా  నాపరాతి గనులను తవ్వినా పట్టించుకునేవారు లేకపోవడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది.  ఇదంతా  మైన్స్‌, రెవెన్యూ అధికారులకు తెలిసినా,  పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు ఆడ్డుఅదుపులేకుండా పోతుంది. ప్రతీ రోజు ఇక్కడి ప్రాంతాల నుంచి ఎలాంటి రాయల్టీలు లేకుండానే లారీల్లో నాపరాతిని దర్జాగా తరలించుకుపోతున్నారు. కొందరు వ్యాపారులు  నాపరాతి తవ్వకాలకు తీసుకున్న లీజుల గడువు ముగిసిన అక్రమంగా తవ్వకాలు కొసాగిస్తూ దొరికినకాడికి దోచుకుంటున్నారు. ఈ నాపరాళ్ల అక్రమ తవ్వకాలు నిరాటంకంగా కొనసాగడానికి రాజకీయ వత్తిళ్లు, అధికారుల అండదండలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుర్తుకువచ్చినప్పుడు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల్లో నాపరాళ్ల తవ్వకాలను అడ్డుకుంటున్నా అక్రమార్కులు లెక్క చేయడం లేదు.  ఏదేమైనా నాపరాతి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో  అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. 

Updated Date - 2022-06-20T05:10:23+05:30 IST