Asaduddin Owaisi on Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-26T01:51:05+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ వీడలేదు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం రోజుకో..

Asaduddin Owaisi on Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ వీడలేదు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను అక్కడికీ, ఇక్కడికీ తిప్పుతూ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోతులు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు కోతుల్లా ప్రవర్తిస్తూ ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు జంప్ చేస్తున్నారని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.



ఇదిలా ఉండగా.. ఏక్‌నాథ్ షిండేతో పాటు అతని క్యాంపులోని రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ శిబిరం నుంచి డిప్యూటీ స్పీకర్‌కు రాసిన లేఖపై స్పీకర్ కార్యాలయం స్పందించింది. మహారాష్ట్ర శాసనసభ కార్యదర్శి రెబల్ ఎమ్మెల్యేలకు తాజాగా నోటీసులు పంపారు. శివసేన పంపిన అనర్హత అభ్యర్థనపై జూన్ 27 లోపు స్పందించాలని రెబల్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేసింది. ఉద్ధవ్ మద్దతుదారుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంజయ్ రౌత్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఆ రెబల్ ఎమ్మెల్యేల్లో ఎవరికి అయితే మంత్రి పదవులున్నాయో.. వారందరినీ 24 గంటల్లో మంత్రి పదవుల నుంచి తొలగిస్తామని సంజయ్ రౌత్ చెప్పడం గమనార్హం.



గడచిన 24 గంటలుగా ఏం జరిగిందంటే..

రెబెల్‌ ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారంతా 24 గంటల్లోగా ముంబైకి తిరిగి వచ్చేస్తే మహావికాస్‌ అఘాడీ కూటమి నుంచి వైదొలగే అంశాన్ని పరిశీలిస్తామని, వారి సమస్యలపై ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించి పరిష్కరించడానికి సిద్ధమని పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘లక్ష్యం లేకుండా ఎందుకు తిరుగుతారు? తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. బానిసత్వాన్ని అంగీకరించడం కన్నా.. ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుందాం’’ అంటూ మరాఠీలో ట్వీట్‌ చేశారు. మరోవైపు.. ముంబైకి దాదాపు మూడువేల కిలోమీటర్ల దూరాన గువాహటిలో మకాం వేసిన ఏక్‌నాథ్‌ షిండే గూటికి గురువారం మరో ముగ్గురు శివసేన ఎమ్మెల్యేలు చేరారు. దీంతో తనకు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 46 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. 35 మంది సేన ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌కు సమర్పించారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు, వీడియో దిగి మీడియాకు విడుదల చేశారు.

Updated Date - 2022-06-26T01:51:05+05:30 IST