బైడెన్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాం: భారత రాయబారి

ABN , First Publish Date - 2021-01-21T16:38:10+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవం బుధవారం అట్టహాసంగా ముగిసింది. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

బైడెన్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాం: భారత రాయబారి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవం బుధవారం అట్టహాసంగా ముగిసింది. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 'బైడెన్ హయాంలో భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆయనతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధం మరింత బలపడనుంది. ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలు మరింత పెరిగేందుకు ఇది నాంది. ఇంతకుముందు బైడెన్ ఉపాధ్యక్షుడిగా, సెనేటర్‌గా ఈ దిశగా కృషి చేయడమే దీనికి నిదర్శనం.' అని సంధు అన్నారు. 


ఇక కరోనా నిబంధనల నేపథ్యంలో చాలా తక్కువ మంది హాజరైన ఈ వేడుకకు తనకు పిలుపు రావడం తనతో పాటు భారత్‌కు దక్కిన అరుదైన గౌరవంగా రాయబారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న రాయబారి సంధు ఫోటొలను భారత ఎంబసీ ట్వీట్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్‌కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.       

Updated Date - 2021-01-21T16:38:10+05:30 IST