పశువుల సంతపై చిన్నచూపేల?

ABN , First Publish Date - 2022-07-04T05:19:16+05:30 IST

నర్సాపూర్‌లో ప్రతీ శుక్రవారం నిర్వహించే కూరగాయలు, పశువుల సంత ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

పశువుల సంతపై చిన్నచూపేల?

మున్సిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం 

సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం


నర్సాపూర్‌, జూలై3: నర్సాపూర్‌లో ప్రతీ శుక్రవారం నిర్వహించే కూరగాయలు, పశువుల సంత ద్వారా రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పశువుల సంతకు నియోజకవర్గ పరిధిలోని మండలాలతో పాటు జోగిపేట, సంగారెడ్డి, తూప్రాన్‌ ప్రాంతాల నుంచి కూడా పశువుల అమ్మకాలు, కొనుగోలు కోసం రైతులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దీంతో ప్రతీ శుక్రవారం పశువుల సంత సందడిగా ఉంటుంది. అయితే ఎన్నో ఏళ్లుగా సంత నిర్వహిస్తున్నా సొంత స్థలం లేకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. పశువుల సంత నుంచి మున్సిపాలిటీకి ఏటా రూ.లక్షల ఆదాయం తైబజార్‌ ద్వారా వస్తుంది. అయినా సొంత స్థలం ఏర్పాటుతో పాటు సంతకొచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం తాగునీటిని కూడా అందుబాటులో ఉంచడం లేదు. ఎండ, వాన నుంచి రక్షణగా షెడ్లను కూడా ఏర్పాటు చేయడం లేదు. పశువుల సంతకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని ఎన్నో రోజులుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సొంత స్థలం లేకపోవడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో రానురాను పశువుల క్రయవిక్రయాలకు ఇక్కడకు వచ్చే రైతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మొన్నటి వరకు నిర్వహించిన ప్రైవేటు స్థలంలో భవన నిర్మాణాలు జరగడంతో ప్రస్తుతం ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో అరకొర సౌకర్యాల మధ్యకొనసాగిస్తున్నారు. పశువులసంతకు ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించి తగిన సౌకర్యాలు కల్పిస్తే సంత మరింతగా అభివృద్ధి చెందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. 


సంత నిర్వహణ మాకు అప్పగించండి                   

  -  మార్కెట్‌ కమిటీ 

నర్సాపూర్‌ పశువుల సంతను తమకు అప్పగించాలని మార్కెట్‌కమిటీ పాలకవర్గం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు పలుమార్లు తీర్మానాలు చేయడంతో పాటు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. మున్సిపాలిటీ మాత్రం మార్కెట్‌కమిటీకి అప్పగించడానికి ఆసక్తి చూపడం లేదు.

Updated Date - 2022-07-04T05:19:16+05:30 IST