‘గ్లోబల్‌ ముప్పు’పై కన్నేయండి

ABN , First Publish Date - 2022-05-19T06:44:15+05:30 IST

అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బ్యాంక్‌లను కోరారు.

‘గ్లోబల్‌ ముప్పు’పై కన్నేయండి

మూలధన సమీకరణతో పాటు తగిన చర్యలు చేపట్టండి.. బ్యాంక్‌లకు ఆర్‌బీఐ గవర్నర్‌ సూచన


ముంబై: అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బ్యాంక్‌లను కోరారు. బ్యాంక్‌లపై వాటి దుష్ప్రభావాలను వీలైనంతగా తగ్గించుకునేందుకు మూలధన సేకరణతోపాటు చొరవగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎండీ, సీఈఓలతో ఆర్‌బీఐ గవర్నర్‌, అధికారులు మంగళ, బుధవారాల్లో సమావేశమయ్యారు. కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతివ్వడంలో బ్యాంక్‌లు కీలకపాత్ర పోషించాయని శక్తికాంత దాస్‌ ఈ సందర్భంగా అన్నారు. సవాళ్ల సమయంలోనూ దేశీయ బ్యాంకింగ్‌ రంగం నిలకడగా రాణించగలిగిందన్నారు. కస్టమర్ల ఇబ్బందుల పరిష్కార వ్యవస్థను మరింత మెరుగుపర్చడంపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు అవసరమైన మద్దతును కొనసాగించాలని బ్యాంక్‌లను ఆర్‌బీఐ గవర్నర్‌ కోరారు. అంతేకాదు, బ్యాంక్‌ల రుణ వితరణ, ఆస్తుల నాణ్యత, బకాయిల దక్షత, వినియోగదారుల ఇబ్బందుల పరిష్కారం, డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల ఏర్పాటు, ఐటీ మౌలిక వసతుల సామర్థ్యం, సైబర్‌ సెక్యూరిటీ అంశాలపైనా చర్చ జరిగినట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌లు ఎంకే జైన్‌, ఎం రాజేశ్వర్‌ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ తీవ్ర అవరోధాలు ఎదుర్కొంటోంది. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కమోడిటీల ధరలు ఆకాశాన్నంటాయి. ఆర్‌బీఐ సహా అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లకు ధరల నియంత్రణ ప్రధాన సవాలుగా మారింది. ధరలకు కళ్లెం వేసేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 0.40 శాతం పెంచింది. వచ్చే రెండు ద్రవ్యపరపతి సమీక్షల్లోనూ వడ్డింపులు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-05-19T06:44:15+05:30 IST