ఇక బదిలీ బాట!

ABN , First Publish Date - 2021-06-24T05:09:19+05:30 IST

మహరాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు పరిధిలో ఐదు జిల్లాల్లో పనిచేస్తున్న దేవదాయ శాఖ సిబ్బంది బదిలీకి రంగం సిద్ధమైంది. ఇక్కడ పనిచేస్తున్న కీలకమైన సిబ్బంది మంగళవారం కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. సుమారు 10 మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అటెండర్లు మినహా కార్యాలయంలో కీలక పోస్టుల్లో పనిచేస్తున్న వారందరికీ బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇక బదిలీ బాట!
మాన్సాస్‌ కార్యాలయం

మాన్సాస్‌ సిబ్బంది రామతీర్థానికి మార్పు

 ఈఓగా ఉన్నతాధికారిని నియమించే అవకాశం

ట్రస్టు బోర్డు హవా తగ్గించేందుకు ఎత్తుగడ

ప్రభుత్వ ప్రయత్నంపై దేవదాయ శాఖలో చర్చ 

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

మహరాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సాస్‌) ట్రస్టు పరిధిలో ఐదు జిల్లాల్లో పనిచేస్తున్న దేవదాయ శాఖ సిబ్బంది బదిలీకి రంగం సిద్ధమైంది. ఇక్కడ పనిచేస్తున్న కీలకమైన సిబ్బంది మంగళవారం కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లారు. సుమారు 10 మంది ఉద్యోగులను బదిలీ చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. అటెండర్లు మినహా కార్యాలయంలో కీలక పోస్టుల్లో పనిచేస్తున్న వారందరికీ బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం ఆలయ కార్యకలాపాలు చూసేందుకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవంగా బదిలీ చేయాలన్నదే ముఖ్య ఉద్దేశం తప్ప రామతీర్ధంలో ఎక్కువ మంది సిబ్బంది ఉండాల్సిన ఆవశ్యకత లేదు. మాన్సాస్‌ ట్రస్టులో కీలక బాధ్యతలు చూస్తున్న సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బందిని బదిలీ చేసి ప్రస్తుత ట్రస్టు బోర్టును బలహీనపరిచేలా వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సిబ్బందికి రికార్డుల గురించి కానీ... ఇటీవల వరకు ఉన్న సంచయిత పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు కానీ తెలియవు. దీంతో మాన్సాస్‌ సమాచారం ఏదీ బయటకు రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మాన్సాస్‌ ట్రస్టు ఐదు జిల్లాల్లో సుమారు 4వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అత్యంత విలువైన భూములున్నాయి. వీటికి కార్యకలాపాలన్నీ ట్రస్టు చైర్మన్‌ నియమించిన కరస్పాండెంట్‌ చేతిలో పెడుతున్నారు. లావాదేవీలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే చైర్మన్‌ అనుమతితో జరుగుతున్నాయి. ఇన్ని వేల కోట్ల ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ పరంగా దేవదాయ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ అధికారి మాత్రమే పర్యవేక్షిస్తారు. ఎగ్జిక్యూటివ్‌ అధికారులంతా జిల్లా స్థాయిలో ఉన్నతాధికారిగా ఉన్న దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలో పనిచేయాలి. ఎగ్జిక్యూటివ్‌ అధికారి పోస్టు కోసం ఇప్పటివరకు మాన్సాస్‌ పాలకవర్గాలు తమకు నచ్చిన వారి పేర్లను సూచిస్తున్నాయి. ఈ పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ట్రస్టుపై పర్యవేక్షణకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారిని నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.  



Updated Date - 2021-06-24T05:09:19+05:30 IST