గాజువాకలో ఉత్సాహంగా సాగిన లోకేశ్‌ రోడ్‌ షో

ABN , First Publish Date - 2021-03-05T06:26:37+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం గాజువాకలోని ప్రధాన రహదారుల్లో రోడ్‌ షో నిర్వహించారు.

గాజువాకలో ఉత్సాహంగా సాగిన లోకేశ్‌ రోడ్‌ షో
గాజువాకలో నారా లోకేశ్‌ రోడ్‌ షో

అడుగడుగునా  మహిళల నీరాజనాలు

హాజరైన అభిమానులు, పార్టీ కార్యకర్తలు  

గాజువాక/ కూర్మన్నపాలెం, మార్చి 4: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం గాజువాకలోని ప్రధాన రహదారుల్లో రోడ్‌ షో నిర్వహించారు. పాతగాజువాక నుంచి ప్రారంభమై థియేటర్ల జంక్షన్‌, కొత్తగాజువాక, రాజీవ్‌ రోడ్డు, కాకతీయ జంక్షన్‌, వికాస్‌నగర్‌ జంక్షన్‌, పెదగంట్యాడ మెయిన్‌రోడ్డు, బాలచెరువు కాలనీ జంక్షన్‌, నడుపూరు జంక్షన్‌, చైతన్యనగర్‌లమీదుగా కూర్మన్నపాలెం జంక్షన్‌కు రోడ్‌ షో చేరింది. ఈ సందర్భంగా నెల్లిముక్కులో టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని, చైతన్యనగర్‌లో తెలుగుదేశం బలపరిచిన సీపీఐ అభ్యర్థి ఏజే స్టాలిన్‌ ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని లోకేశ్‌ ప్రారంభించారు.  రోడ్‌షో ప్రారంభానికి ముందే శ్రీకన్యా థియేటర్‌ రోడ్డులో ఇంటింటి ప్రచారం చేశారు. అక్కడి మహిళలు, అభి మానులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఉదయం తొమ్మిది గంటలకు పాతగాజువాకలో ప్రారంభమైన రోడ్‌షో మధ్యాహ్నం ఒంటిగంటకు కూర్మన్నపాలెం జంక్షన్‌లో ముగిసింది. దారి పొడవునా మహిళలు లోకేశ్‌ నుదుటన కుంకుమ దిద్ది స్వాగతం పలికారు. పలు జంక్షన్‌లలో ఆయన చేసిన ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. టీడీపీకి చెందిన వార్డు కార్పొరేటర్‌ అభ్యర్థులు పీలా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, బైపిల్లి గాంధీ, పులి లక్ష్మీబాయి, బెంగళూరు రమణ, మహమ్మద్‌ రఫీ, ప్రసాదుల విజయసునీత, లేళ్ల కోటేశ్వరరావు, మొల్లి ముత్యాలు, పాల అచ్చిలనాయుడు, గంటా వెంకటసాయి ప్రేమ మేనక పాల్గొన్నారు.


రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ  మద్దతు 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమి టీ  నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని  లోకేశ్‌ సందర్శించి , కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ ఉక్కు పోరాట సమితి నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం టీడీపీ ప్రచారాలను అన్నింటినీ పక్కనబెడుతున్నామని  వివరించారు. ఉపాధిని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటం లో యువత బాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చా రు. ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంగా నేడు విశాఖ స్టీలుప్లాంటు ఉద్భవించిందన్నారు. కార్మికుల పోరాటాలతోనే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, తద్వారా ప్రైవేటీకరణ ప్రక్రియను నిలుపుదల చేయవచ్చన్నారు. కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమి టీ నేతలు జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌, డి.ఆది నారాయణ, గంధం వెంకటరావు, బోసుబాబు, బొడ్డు పైడిరాజు, మస్తానప్ప,  రామ్మోహన్‌కుమార్‌,  శ్రీనివాసరావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. 


అక్కిరెడ్డిపాలెంలో ఘన స్వాగతం

అక్కిరెడ్డిపాలెం: రాష్ట్రంలో ధరలను అదుపుచేయడంతో పాటు అవినీతి రహిత పాలన టీడీపీతోనే సాధ్యమని లోకేశ్‌ అన్నారు. అక్కిరెడ్డిపాలెం వద్ద ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు కార్యకర్తలతో ముచ్చటించారు. గ్రేటర్‌ విశాఖలో టీడీపీ విజయం సాధిస్తే పన్నుల తగ్గింపుతో పాటు అనేక సమస్యలను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. లోకేశ్‌ వెంట టీడీపీ విశాఖ పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,  రాష్ట్ర నాయకులు కాకి గోవిందరెడ్డి, మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి పాల్గొన్నారు.



Updated Date - 2021-03-05T06:26:37+05:30 IST