Nara Lokesh ను ఈడ్చుకెళ్లి.. కాలర్ పట్టిన పోలీస్.. TDP సీనియర్లను వాహనంలోకి విసిరిన వైనం!

ABN , First Publish Date - 2021-08-17T08:05:18+05:30 IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు

Nara Lokesh ను ఈడ్చుకెళ్లి.. కాలర్ పట్టిన పోలీస్.. TDP సీనియర్లను వాహనంలోకి విసిరిన వైనం!

  • పరామర్శపైనా ప్రతాపం!
  • అధికార బలం..
  • పోలీసు జులుం
  • లోకేశ్‌ను ఈడ్చుకెళ్లి.. కాలర్‌ పట్టిన పోలీస్‌
  • రమ్య కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లిన లోకేశ్‌
  • వెంట మాజీ మంత్రులు, టీడీపీ శ్రేణులు
  • పోటీగా వైసీపీ నాయకులు, శ్రేణుల రాక
  • లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు.. తోపులాట
  • టీడీపీ నేతలపై పోలీసుల ఆగ్రహం
  • సీనియర్లను వాహనంలోకి విసిరిన వైనం
  • ఆనందబాబుపై చేయి చేసుకున్న ఎస్పీ
  • నేతలందరూ వివిధ స్టేషన్లకు తరలింపు
  • 5 గంటలు స్టేషన్‌లో ఉంచి లోకేశ్‌ విడుదల


గుంటూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. వారిని నిలువరించాల్సిన పోలీసులు... ప్రతిపక్ష నేతలపైనే తమ ప్రతాపం చూపించారు. ఈ పోటాపోటీ నిరసనలు, ఆందోళనలతో గుంటూరు నగరం వేడెక్కింది. టీడీపీ నేత లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి... స్టేషన్ల చుట్టూ తిప్పి చివరికి వదిలేశారు. గుంటూరులో బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సోమవారం గుంటూరుకు వెళ్లారు. 


లోకేశ్‌ గుంటూరు జీజీహెచ్‌కు వస్తున్నారని తెలిసి టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రమ్య మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించి ఆమె ఇం టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


లోకేశ్‌  వస్తున్నారనే మృతదేహాన్ని తరలిస్తున్నారని.. 2 నిమిషాల్లో పోస్టుమార్టం, 5 నిమిషాల్లో పంచనామా అయిపోయిందా అని నిలదీశారు. రోడ్డుపై బైఠాయించారు. దీంతో వైసీపీ శ్రేణు లు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశ లో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.


అదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌ కుమార్‌ అక్కడకు వచ్చారు. వైసీపీ కార్యకర్త లు వారి వాహనంపై చేతులతో మోదుతూ వారికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. దీంతో నరేంద్ర బండి దిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉండడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆదే సమయంలో మృతదేహం ఉన్న వాహనాన్ని వెనుక గుండా పోలీసులు రమ్య నివాసానికి తరలించారు.



రణరంగాన్ని తలపించిన పరమాయకుంట..

రమ్య నివాసం ఉన్న గుంటూరు కాకాని రోడ్డులోని పరమాయకుంటలో రణరంగాన్ని తలపించింది. రమ్య కుటుంబ సభ్యులను లోకేశ్‌ పరామర్శిస్తుండగానే వైసీపీ నేతలను కూడా పోలీసులు అనుమతించారు. దీంతో మరోసారి వాగ్వావాదం, దూషణల పర్వం మొదలయ్యాయి. రమ్య ఇంట్లో నుంచి లోకేశ్‌ బయటకు వచ్చే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే లు మహ్మద్‌ ముస్తాఫా, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరె డ్డి, మేయర్‌ మనోహర్‌నాయుడు పెద్దఎత్తున అనుచరులతో చేరుకున్నారు. 


అప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌కుమార్‌ అక్కడ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు లోకేశ్‌ ను ఉద్దేశించి విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినదించారు. ఇది ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.


లోకేశ్‌పై పోలీసుల దురుసు ప్రవర్తన

ఈ సమయంలో లోకేశ్‌తో పాటు ఇతర టీడీపీ నేతలపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అక్కడున్న వైసీపీ నేతలను ఏమీ అనకుండా.. మీడియాతో మాట్లాడుతున్న లోకేశ్‌, టీడీపీ నేతలను బలవంతంగా తరలించే ప్రయత్నించారు. లోకేశ్‌ చేతు లు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఓ పోలీసు అధికారి ఆయన చొక్కా కాలర్‌ పట్టుకున్నారు. లో కేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. దీనిని చిత్రీకరిస్తు న్న మీడియా జర్నలిస్టులపై పోలీసులు విరుచుకుపడ్డారు 


ఓ మీడియా చానల్‌కు చెందిన వీడియో జర్నలిస్టు చేతిలో నుంచి కెమేరాను లాక్కుని అవతలపడేశారు. దీంతో అది ధ్వంసమైంది. ఫొటోలు తీయకుండా ప్రింట్‌ మీడియా ఫొటోగ్రాఫర్లను సైతం అడ్డుకున్నారు. ఈ సమయంలో కూడా వైసీపీ శ్రేణులు వీరంగం వేస్తూనే ఉన్నారు. పోలీసులు మాత్రం టీడీపీ నేతలను పక్కకు తోసే ప్రయత్నం చేశారు. దీనిపై మాజీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ధూళిపాళ్ల నరేంద్రలను ఎత్తి వాహనంలోకి విసిరేశారు. ఇతర నేతలను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.


లోకేశ్‌ను ప్రత్తిపాడు స్టేషన్‌కు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మహ్మ ద్‌ నసీర్‌, వంగలపూడి అనితలను చేబ్రోలుకు, ఆలపాటి, ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌, ధూళిపాళ్ల నరేంద్ర, కోవెలమూడి రవీంద్ర, ఇతర నేతలను నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లారు. టీడీపీ నేతలెవరూ రమ్య అంత్యక్రియల్లో పాల్గొనకుం డా ఇలా వివిధ ప్రాంతాలకు తరలించారు. న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ నివాళులర్పించారు. ఈ ఉద్రిక్తతలకు సంబంధించి లోకేశ్‌, మాజీ మంత్రులు సహా మొత్తం 33 మంది టీడీపీ నేతలపై పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లో సెక్షన్‌ 151 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేశారు.


ఆనందబాబుపై రూరల్‌ ఎస్పీ జులుం

మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపై రూరల్‌ ఎస్సీ విశాల్‌ గున్ని చేయిచేసుకున్నారు. బలవంతంగా పక్కకు నెట్టేయడం తో ఆనందబాబు కిందపడ్డారు. దీనిపై టీడీపీ నేతలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఆరోపించారు.


గన్‌కన్నా ముందు.. జగన్‌ రాలేదేం?

నీ కూతుళ్లకు జరిగితే.. ఇలాగే స్పందిస్తావా?: లోకేశ్‌


 ఆడబిడ్డలకు ఆన్యాయం జరిగితే గన్‌ కంటే జగన్‌ ముందుంటార ని గతంలో వైసీపీ నేతలు అన్నారని.. ఇప్పుడు ఆయనె క్కడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించా రు. గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబసభ్యుల ను సోమవారం పరామర్శించిన అనంతరం, ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌ నుంచి విడుదలయ్యాక రాత్రి మంగళగిరి లో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తమకు అవస రం లేదని, తమ కుమార్తెను తీసుకురావాలని రమ్య కు టుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారని తెలిపారు.


‘జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 500 మంది మహిళ లపై అఘాయిత్యాలు జరిగాయి. ఆడబిడ్డలపై ప్రతి రెండు రోజులకో అఘాయిత్యం జరుగుతున్నా.. దోషులను ప్రభు త్వం ఎందుకు శిక్షించలేకపోతోంది? దళిత విద్యార్ధిని హత్య కు గురైతే సీఎం స్పందించడానికి 12 గంటలా? నీ కూతుళ్ల కు జరిగితే.. ఇలాగే స్పందిస్తావా? అసలు దిశ చట్టం కింద ఒక్కరికైనా శిక్ష పడిందా? దిశ యాప్‌, చట్టం పేరుతో మీ పత్రికకు రూ.30 కోట్లతో ప్రకటనలిచ్చారు. 20 రోజుల్లో రమ్యశ్రీని హత్య చేసిన వారిని శిక్షించాలి. లేకుంటే 21వ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం’ అని లోకేశ్‌ హెచ్చరించారు.


తనను ఎందుకు అరెస్టు చేశారని ఎస్పీని అడిగితే ఆయన సమాధానం విచిత్రంగా ఉందన్నారు. తాను ఆస్పత్రికి వెళ్లి గొడవ చేశానని, అందుకే అరెస్టు చేశామని చెప్పారని.. కానీ, తాను ఆస్పత్రికి వెళ్లలే దన్న విషయం కూడా ఎస్పీకి తెలియపోతే ఎలా? అన్నారు.



Updated Date - 2021-08-17T08:05:18+05:30 IST