పరిహారం ఎగ్గొట్టేందుకు.. కుంటి సాకులు

ABN , First Publish Date - 2020-12-06T05:03:29+05:30 IST

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పరిహారం ఎగొట్టేందుకు కుంటిసాకులు వెతుకుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజ మెత్తారు.

పరిహారం ఎగ్గొట్టేందుకు.. కుంటి సాకులు
బాపట్ల: అప్పికట్ల గ్రామంలో రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నారా లోకేశ్‌

దున్నపోతు ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడదాం..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

జిల్లాలో పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటన

పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా


పొన్నూరుటౌన్‌, బాపట్ల, చిలకలూరిపేట, డిసెంబరు5:  పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పరిహారం ఎగొట్టేందుకు కుంటిసాకులు వెతుకుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజ మెత్తారు. తుఫాన్‌ కారణంగా జిల్లాలో పంట నష్ట పోయి న ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. రైతుల గోడు విని వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తొలుత పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి పొలాలను సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మురుగు నీటి కాల్వలు పూడిక తీయకపోవటం వల్ల పంట పొలాల్లో వర్షపు నీరు భారీగా నిల్వ ఉండి వరి పంట కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. లోకేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయం చేసేవరకు రైతుల పక్షాన పోరాడుతామని ప్రకటించారు. అనంతరం  బాపట్ల మండలం చుండూరుపల్లి, ఈతేరు, అప్పికట్ల గ్రామాల్లో పర్యటించి రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. పాలకులు జరిగిన నష్టాన్ని పరిశీలించకుండానే రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలోని ఈ దున్నపోతు ప్రభుత్వంపై కలసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గాలిలో తిరుగుతూ గాలి ముఖ్యమంత్రిగా మారిపోయారన్నారు. రైతులు ఉపయోగించే విద్యుత్‌కు మీటర్లు బిగించాలనుకోవటం సరికాదన్నారు. ఆ విధంగా మీటర్లు బిగిస్తే పగలుగొట్టి తగలబెట్టాలన్నారు. అనంతరం చిలక లూరిపేట మండలంలో లోకేశ్‌ పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంట పరిశీలించారు. చంద్రబాబునాయుడు పోరాటం చేసిన తర్వాత రూ.1,200 కోట్ల బీమా బకాయిల్లో రూ.560 కోట్లు చెల్లించారన్నారు. సీజన్‌ అయి పోయిన తర్వాత పద్ధతి  లేకుండా బీమా చెల్లిస్తే నష్టపోయిన రైతులను ఎవరు ఆదుకుంటారని లోకేశ్‌ ప్రశ్నించారు. గతంలో హుద్‌హుద్‌, తిత్లీ తుఫానులు వచ్చిన సమయంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పంట నమోదు చేసి నష్టపరిహారం అందించిం దని గుర్తు చేశారు. సలాం కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పర్చూరు ఎమ్మెల్యే, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు,  వేగేశన నరేంద్రవర్మ, మాజీ మంత్రి ప్రత్తిపాటి, జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:03:29+05:30 IST