Abn logo
May 7 2021 @ 04:24AM

మీవాళ్లే మూర్ఖపురెడ్డి అంటున్నారు

జగన్‌ రెడ్డీ... నీ చేతకాని పాలనను మీ ఎంపీలే ఎండగడుతున్నారు: లోకేశ్‌


అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘జనం కాదు జగన్‌రెడ్డీ... నీ చేతకాని పాలనను వైసీపీ ఎంపీలే ఎండగడుతున్నారు. కరోనా కట్టడికి ఏం చేయలేని నీ పనికిమాలిన పాలనను దుమ్మెత్తిపోశారు. ప్రజల ప్రాణాలు గాలికి ఒదిలేశామని, ఈ విషయం మూర్ఖపు ముఖ్యమంత్రికి చెప్తే... సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్ష సాధింపులకు దిగుతాడని భయపడి ఎవరూ నోరు మెదపడం లేదు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. వైసీపీ ఎంపీలు మార్గాని భరత్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పార్టీ నేతలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణలు కరోనా పరిస్థితులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ తీరుపై మాట్లాడిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ లోకేశ్‌ గురువారం ట్వీట్‌ చేశారు. ‘‘కరోనా నియంత్రణకు జగనేం చేశాడు... బొక్క చేశాడు... అంటూ పులివెందుల పిల్లి మెడలో తొలి గంట కట్లాడు ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. ‘ప్రభుత్వం లాజిస్టిక్స్‌ మెయిన్‌టైన్‌ చేయడం లేదు. జగన్‌ చేతులెత్తేశాడు’ అని ఆకుల ఆగ్రహంగా ఉన్నారు. శవాల దహనం కూడా చందాలేసుకుని చేయాల్సి వస్తోందని వైసీపీ నేతలే వాపోతున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతుల మంత్రిని బూతులతో, పేటీఎం బ్యాచీలను ఫేక్‌ ట్వీట్‌లతో దింపుతావు. నిన్న మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని’’ అంటూ లోకేశ్‌ ఎద్దేవా చేశారు.