‘స్వచ్ఛంద’ దోపిడీపై లోకాయుక్త విచారణ

ABN , First Publish Date - 2021-03-04T07:07:59+05:30 IST

జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న దోపిడీపై లోకాయుక్త న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి బుధవారం విచారణ ప్రారంభించారు.

‘స్వచ్ఛంద’ దోపిడీపై లోకాయుక్త విచారణ

హాజరుకాని దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు

ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ లేఖ 

ఫిర్యాదుదారుడిని మాత్రమే విచారించిన న్యాయమూర్తి 

ఒంగోలు నగరం, మార్చి 3 : జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న దోపిడీపై లోకాయుక్త న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి బుధవారం విచారణ ప్రారంభించారు. ఒంగోలుకు చెందిన నవ్యాంధ్ర దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు కాలేషా ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరుగుతోంది. జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థలు కేంద్రప్రభుత్వం ద్వారా పొందుతున్న నిధులను దుర్వినియోగం చేస్తున్నాయంటూ లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. మినిస్టర్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ శాఖ ద్వారా జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థలకు ఏటా నిధులు అందుతున్నాయి. ఇందుకోసం జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ ద్వారా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి. రూ.కోట్లు ఈ సంస్థలకు ఏటా మంజూరవుతున్నాయి. అయితే సదరు సంస్థలు ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నట్లు రుజువవుతున్నా వాటి నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. పైగా ఏటా నిధుల విడుదల కోసం అధికారులు లంచాలు తీసుకుని ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. ఈ నిధులతో నడుపుతున్నట్లు చూపుతున్న వృద్ధాశ్రమాలు, డీడీఆర్‌సీ కేంద్రాలు, డ్రగ్‌డీ అడిక్షన్‌ కేంద్రాలను విజిలెన్సు అధికారులు తనిఖీచేయగా బోగస్‌ అని తేలాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2017 నుంచి ప్రతిపాదనలు యథేచ్ఛగా పంపుతున్నారంటూ లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. దీనిపై దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారులకు నోటీసులు పంపించినా విచారణకు హాజరుకాలేదు. ఎన్నికల విధుల్లో ఉన్నందున నెల వ్యవధి కావాలంటూ లోకాయుక్తకు విన్నవించుకుంటూ ఆ శాఖ అధికారులు లేఖ పంపించారు. దీంతో తొలిరోజు ఫిర్యాదుదారుడిని మాత్రమే విచారించినట్లు తెలిసింది. 


Updated Date - 2021-03-04T07:07:59+05:30 IST