లోక్‌అదాలత్‌లో 13,500 కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2022-06-27T05:15:54+05:30 IST

సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణాని అరికట్టడంలో ప్రతీ ఒక్కరు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి వైవీఎస్‌బీజీ పార్థసారధి విజ్ఞప్తి చేశారు.

లోక్‌అదాలత్‌లో 13,500 కేసుల పరిష్కారం
జిల్లా కోర్టు భవనంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తోన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీఎస్‌బీజీ పార్థసారధి

మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాని అరికట్టాలి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వైవీఎస్‌బీజీ పార్థసారధి 

గుంటూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మాదకద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణాని అరికట్టడంలో ప్రతీ ఒక్కరు తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి వైవీఎస్‌బీజీ పార్థసారధి విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్‌భవనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం, మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం జరిగింది. అలానే జాతీయ లోక్‌అదాలత్‌ సందర్భంగా అవగాహన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారధి మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ఆదివారం జాతీయ లోక్‌ అదాలత్‌ని నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో లోక్‌ అదాలత్‌లో దాదాపు 13,500 కేసులను పరిష్కరించదగినవిగా గుర్తించి ఇరువర్గాలకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అత్యధిక సంఖ్యలో కేసుల పరిష్కారం కోసం జిల్లాలో 35 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. గుంటూరులో 8 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  న్యాయసేవాధికార సంస్థ ప్యానెల్‌ లాయర్లు, పారా లీగల్‌ వలంటీర్లు రాజీ పడదగ్గ కేసులలోని కక్షిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటే యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కుటుంబ సభ్యులు నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. మహిళల అక్రమ రవాణ, వారిని వ్యభిచార కూపాల్లోకి దింపడం చాలా పెద్ద నేరమని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తోన్న వారు, మానవ అక్రమ రవాణకు పాల్పడుతోన్న వారి సమాచారం ఉంటే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలన్నారు.  జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి రత్నకుమార్‌ మాట్లాడుతూ ఇటీవలకాలంలో యువత ఎక్కువ మంది గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని చెప్పారు. వ్యసనాలకు బానిస అయిన వారిని డీ ఎడిక్షన్‌ సెంటర్ల ద్వారా చికిత్స అందించి వారికి విముక్తి కలిగించి సమాజంలో అందరితో కలిసి పోయేలా చేయాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగించడం, అమ్మడం, కొనడం వంటి నేరాలకు పల్పాడితే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు జరుగుతాయన్నారు. ఇటువంటి కేసులలో విచారణ దశలోనే కనీసం బెయిల్‌ కూడా రాకుండా 180 రోజుల వరకు జైలులో ఉంచడం జరుగుతుందన్నారు. నేరం నిరూపణ జరిగితే 10 నుంచి 14 ఏళ్ల వరకు కఠినమైన శిక్షలు విధించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డీఎల్‌ఎస్‌ఏ ప్యానెల్‌ లాయర్లు, పారా లీగల్‌ వలంటీర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-27T05:15:54+05:30 IST