స్వయం సమృద్ధి దిశగా లడఖ్‌ : ఓం బిర్లా

ABN , First Publish Date - 2021-08-27T20:39:44+05:30 IST

భౌగోళిక ప్రతికూలతలు, ఇతర సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ లడఖ్ స్వయం

స్వయం సమృద్ధి దిశగా లడఖ్‌ : ఓం బిర్లా

లేహ్ : భౌగోళిక ప్రతికూలతలు, ఇతర సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ లడఖ్ స్వయం సమృద్ధి సాధించే దిశగా అభివృద్ధి చెందుతోందని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అన్నారు. లడఖ్ సౌందర్యాన్ని, అక్కడి ప్రజల శాంతి కాముకతను ప్రశంసించారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని పంచాయతీ రాజ్ సంస్థల సాధికారత కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. లేహ్‌లోని సింధు సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. 


మనం చేసే ప్రతి పనిలోనూ దేశ ప్రయోజనాలు ప్రధానం కావాలని ఓం బిర్లా చెప్పారు. దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలన్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన లడఖ్ అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలకు కల్పించేందుకు లడఖ్‌కు కేంద్ర పాలిత ప్రాంత హోదాను ఇచ్చినట్లు తెలిపారు. సంఘీభావం, సమష్టి కృషి స్ఫూర్తితోనే దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. 


లడఖ్ అభివృద్ధి చెందడం ప్రాంతీయ, జాతీయ అవసరమని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంతానికి విశిష్టమైన రూపం ఉందని తెలిపారు. దీర్ఘ కాలంలో స్థానికులు అభివృద్ధి చెందడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి చేతి వృత్తులు, హస్త కళలు, ఇతర ఉత్పత్తులు దోహదపడతాయని చెప్పారు. 


లడఖ్ ప్రజల ధైర్య, సాహసాలు, త్యాగశీలతను ప్రస్తావిస్తూ, అవసరమైతే దేశం కోసం ఆత్మ బలిదానానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారన్నారు. ఇక్కడి గ్రామాల్లో సంప్రదాయంగా స్వయం పాలనా విధానం ఉందన్నారు. పంచాయతీ రాజ్ సంస్థలకు నేరుగా ప్రజలతో అనుబంధం ఉంటుందని, అందువల్ల ప్రజల సమస్యల పట్ల శ్రద్ధవహించడానికి, పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. 


Updated Date - 2021-08-27T20:39:44+05:30 IST