'పెగాసస్'పై ఉభయసభల్లోనూ వెనక్కి తగ్గని విపక్షాలు

ABN , First Publish Date - 2021-07-27T17:46:17+05:30 IST

'పెగాసస్' స్పైవేర్ అంశం పార్లమెంటు ఉభయసభలను ఆరవ రోజైన మంగళవారంనాడు కూడా..

'పెగాసస్'పై ఉభయసభల్లోనూ వెనక్కి తగ్గని విపక్షాలు

న్యూఢిల్లీ: 'పెగాసస్' స్పైవేర్ అంశం పార్లమెంటు ఉభయసభలను ఆరవ రోజైన మంగళవారంనాడు కూడా కుదిపేసింది. తొలుత సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే పెగాసస్ వ్యవహారంపై తక్షణం చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయసభలూ కొద్దిసేపు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు రైతుల ఆందోళన, పెగాసస్ ప్రాజెక్ట్, తదితర అంశాలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. దీంతో 11.45 గంటల వరకూ సభను స్పీకర్ వాయిదా వేశారు. సోమవారంనాడు కూడా లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గత వారంలో ప్రారంభమైనప్పుడు ఆదిలోనే విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురైంది. కొత్తగా మంతివర్గంలోకి తీసుకున్న ఎంపీలను సభకు ప్రధాని పరిచయం చేస్తుండగా విపక్షాలు అడ్డుకున్నాయి.


కాగా, మంగళవారంనాడు పెగాసస్ అశం రాజ్యసభను కూడా కుదిపేసింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు పెగాసస్ ప్రాజెక్ట్ మీడియా రిపోర్ట్ అంశంపై నినాదాలకు దిగారు. దీంతో సభా కార్యక్రమాలను రాజ్యసభ చైర్మన్ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. సోమవారంనాడు కూడా రాజ్యసభ ఐదుసార్లు విపక్ష సభ్యుల ఆందోళన మధ్య వాయిదా పడింది.

Updated Date - 2021-07-27T17:46:17+05:30 IST