వ్యాక్సిన్‌ రవాణాకు లాజిస్టిక్‌ కంపెనీలు సై

ABN , First Publish Date - 2020-11-25T06:36:42+05:30 IST

అన్నీ సవ్యంగా సాగితే.. నాలుగైదు నెలల్లో దేశీయంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటు ధరను పక్కన పెడితే..వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం పెద్ద సవాలు కానుంది...

వ్యాక్సిన్‌ రవాణాకు లాజిస్టిక్‌ కంపెనీలు సై


  • ఏర్పాట్లలో ప్రధాన కంపెనీలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అన్నీ సవ్యంగా సాగితే.. నాలుగైదు నెలల్లో దేశీయంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటు ధరను పక్కన పెడితే..వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా పంపిణీ చేయడం పెద్ద సవాలు కానుంది. రవాణా, పంపిణీకి అవసరమైన కోల్డ్‌చైన్‌, మౌలిక సదుపాయాలు తగినంత స్థాయిలో లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలతో కలిసి సమష్టి వ్యాక్సిన్‌ పంపిణీ వ్యూహాన్ని సిద్ధం చేయాలని కేంద్ర ప్రభు త్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్నోమెన్‌ లాజిస్టిక్స్‌, బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌ వంటి లాజిస్టిక్‌ కంపెనీలు వ్యాక్సిన్‌ రవాణా, పంపిణీకి సిద్ధమవుతున్నాయి. కొన్ని కంపెనీలు దేశీయంగా వ్యాక్సిన్‌ పంపిణీకి వ్యాక్సిన్‌ తయారు చేయనున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వంటి కంపెనీలతో చర్చలు జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తమ ఖాతాదారులుగా ఉన్న ఔషధ కంపెనీల కోసం కొవిడ్‌ వ్యాక్సిన్‌ రవాణా, పంపిణీకి ప్రత్యేక ఏర్పా టు చేస్తున్నామని మహీంద్రా లాజిస్టిక్స్‌ ఎండీ, సీఈఓ రామ్‌ప్రవీణ్‌ స్వామినాధన్‌ తెలిపారు. తెలంగాణలోని పటాన్‌చెరు సమీపంలో ఇటీవల 4 లక్షల చదరపు అడుగుల వేర్‌హౌ్‌సను కంపెనీ ప్రారంభించింది.

జహీరాబాద్‌లో గ్రేడ్‌ ఏ వేర్‌హౌ్‌సను సమకూర్చుకుంటోంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి రానుంది. కొవిడ్‌ సమయంలో పెద్ద ఫార్మా కంపెనీల కోసం తెలంగాణాతో పాటు దేశంలో అవసరమైనంత కొత్త వేర్‌హౌస్‌ స్థలాన్ని ఏర్పాటు చేశాం. త్వరలో అందుబాటులోకి వచ్చే కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రోగి వద్దకు చేర్చడానికి  అవసరమైన ఏర్పాటు చేస్తున్నామని స్వామినాధన్‌ అన్నారు. ఫార్మాస్యూటికల్‌ క్లస్టర్లు ఉన్న హైదరాబాద్‌ వంటి కీలక ప్రాంతాల్లో కంపెనీకి 10 వరకూ ఫార్మా డెడికేటెడ్‌ వేర్‌హౌ్‌సలు ఉన్నాయని చెప్పారు.

కోల్డ్‌చైన్‌ లాజిస్టిక్స్‌ సేవలను అందిస్తున్న స్నోమన్‌ లాజిస్టిక్స్‌ దాదాపు 7 కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వ చేయడానికి తగిన ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ఇప్పటికే టైఫాయిడ్‌, ఇన్‌ఫ్లూయింజా తదితర వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 30కి పైగా ఉష్ణోగ్రత నియంత్రణ వేర్‌హౌ్‌సలను స్నోమన్‌ నిర్వహిస్తోంది. 

అదే బాటలో బ్లూడార్ట్‌: వ్యాక్సిన్స్‌ నిల్వ కోసం హైదరాబాద్‌తో పాటు చెన్నై, కోల్‌కతా వంటి ప్రాంతాల్లో బ్లూడార్ట్‌ అదనపు ఉష్ణోగ్రత నియంత్రణ గదులను ఏర్పాటు చేస్తోంది. ఉష్ణోగ్రత నియంత్రణ లాజిస్టిక్‌ అందిస్తూ బ్లూడార్ట్‌ ఇప్పటికే వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్న కంపెనీలకు సేవలు అందిస్తోంది. ఆల్‌కార్గో లాజిస్టిక్స్‌కు చెందిన గతి కైసర్‌ కూడా ఫార్మా కంపెనీలతో చర్చలు సాగిస్తోంది. మరోవైపు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వ్యాక్సిన్‌ను రవాణా చేసే విమానాలకు అనుకూలమైన స్లాట్‌లు ఇవ్వాలని భావిస్తున్నారు.  

సిద్ధంగా ఉండాలి: ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభు త్వం యోచిస్తోంది. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై భారత్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలను నిర్వహించి ఇక్కడ అందుబాటులోకి తీసుకురానుంది. బయోలాజికల్‌ ఈ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై జనవరిలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, వేసవి లో వ్యాక్సిన్‌కు లైసెన్స్‌ లభించే వీలుందని కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వచ్చే వీలుందని హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అందువల్ల ముందుగానే తగినన్ని కోల్డ్‌చైన్‌ సదుపాయాలు, పంపిణీకి తగిన వ్యూహా న్ని సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-11-25T06:36:42+05:30 IST