లాక్‌డౌన్‌ వేస్ట్‌

ABN , First Publish Date - 2021-05-07T09:19:25+05:30 IST

‘‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆలోచనే లేదు. అలా చేస్తే.. గొంతు పిసికినట్లే..! ప్రజా జీవనం స్తంభించిపోతుంది. నిత్యావసరాలకు ఇబ్బంది కలుగుతుంది.

లాక్‌డౌన్‌ వేస్ట్‌

ప్రకటిస్తే గొంతు పిసికినట్లే..

ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం

నిత్యావసర, అత్యవసర సేవలకు ఆటంకం 

ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతుకు నష్టం

పరిశ్రమలు మూతపడి ఉత్పాదకత ఆగిపోతుంది

లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోతే 

మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే ప్రమాదం

కేసులు ఎక్కువుంటే సూక్ష్మ కట్టడి జోన్లు: కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం

చైనా నుంచి 12 ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకర్లు

టీకా, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ కోసం పీఎంకు ఫోన్‌

సత్వర సరఫరాకు కేంద్ర మంత్రి గోయల్‌ స్పందన

ప్రజలకు ఇంటికే కొవిడ్‌ కిట్లు.. సీఎం వెల్లడి

కొత్తగా 6,026 కేసులు; 52 మంది మృతి


హైదరాబాద్‌, మే 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆలోచనే లేదు. అలా చేస్తే.. గొంతు పిసికినట్లే..! ప్రజా జీవనం స్తంభించిపోతుంది. నిత్యావసరాలకు ఇబ్బంది కలుగుతుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముంది’’ అన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గురువారం ఆయన ప్రగతిభవన్‌లో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..


లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ‘‘రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా వలస కార్మికులున్నారు. మొదటివేవ్‌లో లాక్‌డౌన్‌తో వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని మనం చూశాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ పెడితే.. వీరంతా తమ రాష్ట్రాలకు వెళ్తే.. తిరిగి రావడం కష్టమే. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పుష్కలంగా ఉంది. 6,144 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండిపోయింది. ధాన్యం సేకరణ ఆషామాషీ కాదు. ఒక చైన్‌ వ్యవస్థ ఇమిడి ఉన్న ప్రక్రియ.


ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవారు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు.. మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలించే ప్రక్రియ.. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల మంది భాగస్వాములవుతారు. ఈ ప్రక్రియలో వలస కూలీల పాత్ర కూడా కీలకం. లాక్‌డౌన్‌ పెడితే రైతుకు నష్టమే. కొనుగోలు వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. నిత్యావసరాల సరఫరా, పాలు, కూరగాయలు, పండ్లు, అత్యవసర వైద్య సేవలు, ప్రసవాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆపలేం. ఆక్సిజన్‌ సరఫరా అత్యంత కీలకం. లాక్‌డౌన్‌ విధిస్తే.. వీటన్నింటికీ ఆటంకాలేర్పడుతాయి. ఒక భయానక పరిస్థితి సృష్టించినట్లవుతుంది. అందుకే.. లాక్‌డౌన్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదు’’ అని వివరించారు. అలాగని కరోనా వ్యాప్తిని అడ్డుకోకుండా ఉండలేమని సీఎం అన్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మైక్రో కంటైన్‌మెంట్లుగా ప్రకటిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతబడి ఉత్పాదకత ఆగిపోతుందని, అంతా ఆగమాగం అవుతుందని, క్యాబ్‌డ్రైవర్లు, ఆటోరిక్షా వాలాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తితే.. మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే ప్రమాదముందన్నారు.


నిధుల విడుదలకు ప్రత్యేక అధికారి

సెకండ్‌వేవ్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 1.56 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని, 1.35 లక్షల మంది కోరుకున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రతిరోజూ సాయంత్రం కరోనా పరిస్థితులపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆ బాధ్యత చేపట్టాలన్నారు. ఆయా వివరాలను పబ్లిక్‌డొమైన్‌లో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేలా, వెనువెంటనే నిధులు విడుదల చేసేలా ప్రత్యేక అధికారిని నియమించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మొదటి డోసు టీకా తీసుకున్న వారికి రెండో డోసులో ప్రాధాన్యమివ్వాలని సూచించారు. 


ప్రజలకు సీఎం సూచనలివే..

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు కూడా కరోనా కట్టడి కోసం పలు సూచనలు చేశారు. 
  • ఈ నెల 15 తర్వాత సెకండ్‌వేవ్‌ తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రజలు అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. మన జాగ్రత్తలే శ్రీరామరక్ష అనే విషయాన్ని మరిచిపోవొద్దు
  • పెళ్లిళ్లలో వందకు మించి జమ కావొద్దు. పరిశుభ్రతను పాటించాలి. శానిటైజర్లు, మాస్కులను వాడాలి. భౌతిక దూరాన్ని మరవొద్దు
  • ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందొద్దు. ముందస్తుగా.. ప్రభుత్వం అందజేసే కొవిడ్‌ కిట్లను వినియోగించుకోవాలి. ఆ కిట్లను ఇంటింటికీ అందజేస్తాం
  • రాష్ట్రవ్యాప్తంగా 5,980 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో కొవిడ్‌ ఔట్‌పేషెంట్‌ వార్డులను ఏర్పాటు చేశాం. ఆ సేవలను వినియోగించుకోవాలి

ప్రధానికి ఫోన్‌ చేశా..

రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. ‘‘వీటి సరఫరా కోసం ప్రధాని నరేంద్రమోదీతో ఫోన్‌లో మాట్లాడాను. తక్షణమే సరఫరాకు అభ్యర్థించాను. తమిళనాడులోని పెరంబదూర్‌, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ప్రాణవాయువు అందడం లేదని వివరించాను. హైదరాబాద్‌ నగరం మెడికల్‌ హబ్‌గా మారినందున.. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇక్కడి వైద్యసేవలపైనే ఆధారపడుతున్నారని తెలిపాను. దాంతో నగరం మీద భారం పడిన తీరును వివరించాను. అందుకే.. ప్రస్తుతం రోజువారీ సరఫరాలో 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను 500 మెట్రిక్‌ టన్నులకు.. 4900 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను 25 వేలకు పెంచాలని కోరాను. రోజుకు 2.50 లక్షల డోసుల వ్యాక్సిన్‌ అవసరముందని చెప్పాను. ఆయన వెంటనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆదేశాలు జారీ చేశారు. నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు.


ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌, రెమ్‌డెసివిర్‌ సరఫరాకు వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆక్సిజన్‌ సరఫరాను తూర్పు రాష్ట్రాల నుంచి జరిగేలా చూస్తామన్నారు’’ అని కేసీఆర్‌ వివరించారు. అటు రెమ్‌డెసివిర్‌ కంపెనీల యాజమాన్యాలతో, ఆక్సిజన్‌ సరఫరా కోసం ఐఐసీటీ డైరక్టర్‌ చంద్రశేఖర్‌తో ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ లభ్యత, అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ పడకలు, ప్రస్తుతం కేసుల తీరుపై సమీక్షంచారు. ప్రస్తుతం ఉన్న 9,500 ఆక్సిజన్‌ పడకలకు.. కొత్తగా మరో 5 వేల బెడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెరుగైన ఆక్సిజన్‌ సరఫరా కోసం కోటి రూపాయలకు ఒకటి చొప్పున మొత్తం 12 క్రయోజనిక్‌ ట్యాంకులను చైనా నుంచి తెప్పిస్తున్నామని వెల్లడించారు. ఆ మేరకు అత్యవసర దిగుమతికి ఏర్పాట్లు చేయాలని సీఎం సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ఐఐసీటీ డైరెక్టర్‌ సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్‌ ఎన్‌రిచర్లను కొనుగోలు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల సంఖ్యను పెంచాలన్నారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అధికారులు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారీకి చర్యలు తీసుకోవాలని, ఇందులో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములవ్వాలని సూచించారు. 

Updated Date - 2021-05-07T09:19:25+05:30 IST