దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని పొడిగించాలి : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-04-10T22:17:57+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని పొడిగించాలి : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని మరికొంత కాలం పొడిగించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అన్నారు. 


రావత్ శుక్రవారం మాట్లాడుతూ ఈ నెల 14న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని ఎత్తివేయరాదని చెప్పారు. భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావిత రాష్ట్రాల సంఖ్యను బట్టి చూసినపుడు, ప్రస్తుతం అమలవుతున్న అష్ట దిగ్బంధనాన్ని మరికొంత కాలం పొడిగించవలసి ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అంతం చేయడానికి వీలుగా అష్ట దిగ్బంధనాన్ని పొడిగించాలన్నారు. 


ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం కోవిడ్-19 స్టేజ్ -1లో ఉందన్నారు. తమ రాష్ట్రంలో ఇది రెండో దశ కాదన్నారు. కోవిడ్-19 కేసులు కనిపించినా, కనిపించే అవకాశం ఉన్నా, ఆ ప్రాంతాలను దిగ్బంధించామని చెప్పారు. 


ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొని, వచ్చినవారి గురించి మాట్లాడుతూ వెంటనే పరీక్షలు చేయించుకోకపోతే హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించామని, దీంతో చాలా మంది ముందుకు వచ్చి, పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. మిగతావారు కూడా ముందుకు వచ్చి, పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 


ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం రెండు టెస్టింగ్ కేంద్రాలు ఉన్నాయని, రోజుకు 120 పరీక్షల చొప్పున నిర్వహించగలుగుతున్నామని తెలిపారు. ప్రస్తుతం తమకు ఎన్-95 మాస్క్‌లు భారీగా అవసరం లేదన్నారు. తమ వద్ద 30 వేల మాస్క్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్) కిట్లు దాదాపు 10,000 ఉన్నాయని తెలిపారు. 257 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించవలసిన అవసరం రాలేదన్నారు. 


ఉత్తరాఖండ్‌లో కోవిడ్-19 కారణంగా ఎవరూ మరణించలేదు. ఇప్పటి వరకు 35 కేసులు నమోదు కాగా, ఐదుగురు కోలుకున్నారు.


Updated Date - 2020-04-10T22:17:57+05:30 IST