లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2020-04-10T08:06:02+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మరికొన్ని రోజులు పొడిగిస్తే మంచిదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ మంచి ఫలితాలే...

లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు

  • మరికొన్ని రోజులు పొడిగించాలి
  • పేదలు, కూలీలకు 5 వేలివ్వాలి
  • వైద్య సిబ్బందికి ఏదైనా అయితే
  • రూ.50 లక్షల పరిహార మివ్వాలి
  • వర్సిటీల పాలక మండళ్ల
  • నియామకాలు రద్దు చేయాలి
  • టీడీపీ పొలిట్‌బ్యూరో డిమాండ్‌


అమరావతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా మరికొన్ని రోజులు పొడిగిస్తే మంచిదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ మంచి ఫలితాలే ఇస్తోందని.. ఇప్పుడు సడలిస్తే వచ్చిన ప్రయోజనం కూడా చేజారే ప్రమాదం  ఉందని అభిప్రాయపడింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ‘లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు పొడిగిస్తే పేదలు, కూలీలకు ఇప్పటివరకూ ప్రభుత్వపరంగా ఇచ్చిన సాయం ఏ మూలకూ చాలదు. ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున వంతున రాష్ట్రప్రభుత్వం అందించాలి. రైతులను ఆదుకోవడానికి తక్షణం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.


పండ్ల తోటలు, ఆక్వా, కూరగాయలు, ధాన్యం రైతులు.. చేతికొచ్చిన పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. బడ్జెట్‌లో ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్‌ జోక్యానికి పెట్టిన నిధికి చేసిన కేటాయింపులను తక్షణం వినియోగించాలి. కరోనా నిరోధానికి ్జకృషి చేస్తున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి ఏదైనా అయితే రూ.50 లక్షల చొప్పున పరిహారమివ్వాలి. అలాగే కరోనా వైర్‌సతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి. లాక్‌డౌన్‌ వల్ల ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తెలుగువారు చిక్కుకుపోయి ఇబ్బందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలి’ అని సమావేశం కోరింది. మన దేశానికి అవసరమైన వైద్య పరికరాలు మనమే సొంతంగా ఇక్కడ తయారు చేసుకోవాలన్న ముందు చూపుతో విశాఖలో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేసినందుకు మాజీ సీఎం చంద్రబాబును పొలిట్‌బ్యూరో ఈ సందర్భంగా అభినందించింది. అనవసరపు ద్వేషంతో జగన్‌ ప్రభుత్వం ఈ పది నెలల్లో దానిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిందని, టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని కొన సాగించి ఉంటే కరోనా విజృంభణ సమయంలో ఈ పార్క్‌ మొత్తం దేశ వైద్య అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర వహించేదని  అభిప్రాయపడింది. 


రాజకీయాలకు ఇదేనా సమయం?

కరోనా వ్యాప్తి.. రోజువారీ జీవన సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే జగన్‌ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదని, ఈ సమయాన్ని కూడా తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని పొలిట్‌బ్యూరో దుయ్యబట్టింది. ‘యూనివర్సిటీల్లో పాలకమండళ్ల నియామకానికి ఇదేనా సమయం? వాటిని ఇష్టారాజ్యంగా.. రాజకీయ సిఫారసులతో నింపేశారు. తక్షణం వాటిని రద్దు చేయాలి. ఉద్యోగులు, పింఛనుదార్ల జీతాలు, పింఛన్లలో 50 శాతం కోతను రద్దు చేయాలి. తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తూ ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం సరైన పద్ధతి కాదు.


భౌతిక దూరం పాటించాలని లాక్‌డౌన్‌ నిబంధనలు చెబుతుంటే వాటిని తోసిరాజని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా సాగించి జేబులు నింపుకొంటున్నారు. హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా రాజధాని గ్రామాల్లో సీఆర్‌డీఏ అధికారులు బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ చర్యలను ఖండిస్తున్నాం’ అని వివిధ తీర్మానాల్లో పొలిట్‌బ్యూరో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా కొనసాగించి ఉంటే ఈ సమయంలో పేదలకు ఎంతో ఊరటగా ఉండేదని పేర్కొంది. పేదలు, వలస కూలీలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలని, వైద్య సిబ్బందికి అన్నిచోట్లా తప్పనిసరిగా రక్షణ తొడుగులు, పరికరాలు సమకూర్చాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సమావేశం నిర్ణయించింది. తెలంగాణ పార్టీ కార్యదర్శి కందిమళ్ల రఘునాథరావు ఆకస్మిక మృతికి సంతాపం తెలిపింది. 


Updated Date - 2020-04-10T08:06:02+05:30 IST