Abn logo
Apr 3 2020 @ 05:35AM

లాక్‌డౌన్‌కు తూట్లు!

తెరుచుకుంటున్న పెద్ద షాపులు

చిరు వ్యాపారులపైనే ఆంక్షలు

ఇదీ రాజాంలో పరిస్థితి


రాజాం/రూరల్‌, ఏప్రిల్‌ 2: రాజాంలో లాక్‌డౌన్‌కు తూట్లు పడుతున్నాయి. లక్షల్లో వ్యాపారం చేస్తు న్న షాపులు నిత్యం తెరుచుకుంటున్నాయి. వీటిలో కొందరు పొలీసుల కన్నుకప్పి తెరిచి అమ్మకాలు చేస్తుండగా మరికొన్ని షాపులను పొలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులపైనే ఆంక్షలుండగా పబ్లిక్‌గా బేకరీలతోపాటు ఫర్నీచర్‌, ఎలక్ట్రికల్‌, హార్డ్‌వేర్‌ షాపులు, ఏజెన్సీలు నిత్యం యథావిధిగా తెరుస్తున్నా కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. లాక్‌డౌన్‌ సందర్భంగా బేకరీలను తెరిచేందుకు ఏమాత్రం అనుమతి లేకపోయినా పాలకొండ రోడ్‌లోని ఓ బేకరీ గురువారం తెరిచి 11 గంటల తరువాత కూడా అమ్మకాలు చేయడం కనిపించింది.


ఈ షాపు తెరిచి ఉంచడాన్ని చాలామంది వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదేరోడ్‌లో ఏజెన్సీలు, హార్ట్‌వేర్‌ షాపులతోపాటు మెయిన్‌రోడ్డులో పలు ఫర్నిచర్‌ షాపులు, మాధవబజారులో బుక్‌షాపు, పలు బేంగిల్‌ షాపులు, ఎలక్ట్రికల్‌ షాపులు గురువారం ఉదయాన్నే తెరుచుకున్నాయి. మెయిన్‌రోడ్‌లో పాన్‌, జ్యూస్‌ షాపులను తెరవనివ్వని అధికారులు మాధవబజార్‌, శ్రీనివాసారోడ్‌లో పాన్‌షాపులు తెరిచి ఉంచుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదన్న వాదన వినిపిస్తోంది. పబ్లిక్‌గా ట్రాలీపై సిమెంట్‌ బస్తాలు, ఐరన్‌, ప్లేవుడ్‌ ఇతరత్రా సామగ్రిని తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసే విషయంలో వివక్ష లేకుండా ఇటు నగర పంచాయతీ, అటు పొలీస్‌ అధికారులు పనిచేయాల్సి ఉంది. 


అనుమతులు లేవు

రాజాంలో బేకరీతో పాటు పలు ప్రధాన షాపులు తెరవడాన్ని సి.ఐ. సోమశేఖర్‌ వద్ద ప్రస్తావించగా ఎవరికీ అనుమతుల్లేవని, బేకరీలో కేవలం రొట్టెలు మాత్రమే అమ్మకం చేస్తున్నారన్నారు. ఇదే విషయాన్ని నగర పంచాయతీ కమిషనర్‌ నెల్లి రమేష్‌ వద్ద ప్రస్తావించగా ఎవరికీ అనుమతుల్లేవని, బేకరీని ఉదయాన్నే తాను మూయించానని, ఇకపై తెరిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిత్యావసర దుకాణాల తప్ప మిగిలిన ఏ షాపులకూ అనుమతుల్లేవని, దొంగతనంగా తీస్తున్నారని వారు చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement