నేటి నుంచి లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-08-03T09:37:10+05:30 IST

మచిలీపట్నం నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి వారం రోజులపాటు మచిలీపట్నం నగరంలో ..

నేటి నుంచి లాక్‌డౌన్‌

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 2 : మచిలీపట్నం నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సోమవారం నుంచి వారం రోజులపాటు మచిలీపట్నం నగరంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. తన చాంబర్‌లో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా  సోమవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు మచిలీ పట్నం కార్పొరేషన్‌తోపాటు రూరల్‌ మండలంలో నిబంధనలు కఠినతరం చేస్తున్నామన్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వ్యవసాయ సంబంధిత షాపులు తెరవవచ్చన్నారు. 9 గంటల తరువాత మెడికల్‌ షాపులు మినహా మిగిలిన షాపులన్నీ మూసివేయాలన్నారు.


బందరు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తిరగవన్నారు. బ్యాంకులు  ఉదయం 7 నుంచి 11 గంటల వరకు పనిచేస్తాయని, ఖాతాదారులు 9గంటల వరకే బ్యాంకుకు వెళ్లాలన్నారు. చల్లపల్లి, నాగాయలంక మండలాల్లో కూడా  సోమవారం నుంచి 9వ తేదీ వరకు కంటైన్‌మెంట్‌ నిబంధనలు కఠినతరం చేయాలన్నారు. అవసరమైతే మిగిలిన మండలాల్లో  నిబంధనలు అమలు చేయాలన్నారు.  డీఎస్పీ మెహబూబ్‌ బాషా మాట్లాడుతూ నగరంలో ఐపీసీ 188 సెక్షన్‌ అమలులో ఉందని, ప్రజలు మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. టూ వీలర్‌పై ఒక్కరే ప్రయాణించాలన్నారు. ఉద్యోగులు ఐడీ కార్డులు కలిగి ఉండాలన్నారు. కొవిడ్‌- 19 నోడల్‌ అధికారి డాక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో, ముఖ్య మంత్రి ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

Updated Date - 2020-08-03T09:37:10+05:30 IST