మరో 30 రోజులు...

ABN , First Publish Date - 2020-05-31T10:28:32+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇప్పటికే నాలుగు దశలుగా లాక్‌డౌన్‌ అమలుచేయగా,

మరో 30 రోజులు...

  • జూన్‌ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌  పొడిగింపు
  • దశలవారీగా కొన్నింటికి మినహాయింపులు
  • రాత్రి 9 నుంచి ఉదయం 5వరకు కర్ఫ్యూ
  • జూన్‌ 8 నుంచి ఆలయాలకు ఓకే

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఇప్పటికే నాలుగు దశలుగా లాక్‌డౌన్‌ అమలుచేయగా, తాజాగా మరో 30 రోజుల పాటు  పొడిగించింది. దీంతో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈమేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. వాస్తవంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ నుంచి పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలైంది. నాలుగో విడత లాక్‌డౌన్‌లో భాగంగా కొన్నింటికి ఆంక్షలు సడలించారు. దీంతో నిత్యావసరాల దుకాణాలు, వ్యవసాయ పనిముట్లు, ఇటీవల వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు తెరచుకోలేదు. తాజాగా ఆదివారం నుంచి ఐదో విడత లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఈ దఫా ఓవైపు లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తూనే.. మరోవైపు మరికొన్నింటికి వెసులుబాటు ఇవ్వనున్నారు.


ప్రధానంగా జూన్‌ 8 నుంచి దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌ తెరచుకోనున్నాయి. అలాగే.. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. జిల్లాలో ఇటీవల కంటైన్‌మెంట్‌ జోన్‌ను కూడా తొలగించేశారు. ఇంకెక్కడైనా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతేనే.. ఆ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తారు. నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఆంక్షలు సడలించినా..భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజ్‌.. ఇతర నిబంధనలన్నీ తప్పనిసరిగా పాటించాల్సిందే. 


బార్‌లు, సినిమాహాళ్లపై నిషేధమే.. 

బార్‌లు, సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. వీటిపై యథావిధిగా నిషేధం కొనసాగనుంది. రాజకీయ, సామాజిక క్రీడా కార్యక్రమాలపైనా నిషేధం అమల్లో ఉంటుంది. దీని ప్రకారం ఇప్పట్లో రాజకీయ నాయకులు గుంపులుగా జనాలతో సమావేశాలు పెట్టేందుకు వీలులేదు. ఇక వివాహాలకు 50 మందివరకు మాత్రమే అనుమతి ఉంది. కర్మకాండలకు 20 మందికి మించకూడదు. ఎప్పటిలానే అత్యవసరమైతేనే  పదేళ్ల  లోపు వారు, 65 ఏళ్లు పైబడినవారు బయటకు రావాలి. 

Updated Date - 2020-05-31T10:28:32+05:30 IST