సిమెంట్‌ గిరాకీకి గండి

ABN , First Publish Date - 2020-04-10T07:06:34+05:30 IST

దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ గిరాకీ బాగా పడిపోయే ప్రమాదం ఉంది. ...

సిమెంట్‌ గిరాకీకి గండి

  • తెలుగు రాష్ట్రాల్లో 65 శాతం సామర్థ్య వినియోగం
  • కరోనా నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ గిరాకీ బాగా పడిపోయే ప్రమాదం ఉంది. వర్షాకాలం తర్వాత కానీ కొనుగోళ్లు తిరిగి పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ నుంచి కనీసం మే చివరినాటికైనా బయట పడలేదంటే.. సిమెంట్‌ గిరాకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 నుంచి 40 శాతం వరకూ తగ్గే వీలుందని ఇండ్‌రా, క్రిసిల్‌ సహా పలు రేటింగ్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా కనీసం నెల రోజుల పాటు కార్మికుల లభ్యత, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కొనసాగవచ్చని ఇండ్‌రా పేర్కొంది. ద్వితీయార్ధంలోనే మళ్లీ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆ సంస్థలు అంచనా వేస్తున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో నిలిచిన ఉత్పత్తి

లాక్‌డౌన్‌తో తెలుగు రాష్ట్రాల్లోని సిమెంట్‌ కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశాయి. నిర్మాణ కార్యక్రమాలు పుంజుకుని సిమెంట్‌కు గిరాకీ పెరుగుతున్న తరుణంలో కోవిడ్‌- 19 ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, కార్మికులు ఉపాధి కోల్పోయేలా చేసిందని స్థానిక సిమెంట్‌ కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమ గాడిలో పడేందుకు కనీసం ఒక నెల రోజులైనా పడుతుందన్నారు. కంపెనీల ఆదాయం, లాభాలపై కోవిడ్‌ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 9.8 కోట్ల టన్నుల వార్షిక ఉత్ప త్తి సామర్థ్యం ఉంది. 2.8 కోట్ల టన్నుల సిమెంట్‌ను ఇక్కడే వినియోగిస్తున్నారు.  2.8 కోట్ల టన్నుల సిమెంట్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో గిరాకీకన్నా సరఫరా ఎక్కువగా ఉన్నందున 60-65 శాతం సామర్థ్యాన్నే తెలుగు రాష్ట్రాల్లోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు వినియోగించుకుంటున్నాయి.


ఇప్పటికే కష్టాల్లో

2019-20లో జనవరి వరకూ సిమెంట్‌ ఉత్పత్తి అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1.1 శాతం పెరిగి 27.88 కోట్ల టన్నులకు చేరింది.  గృహ రంగం నుంచి  గిరాకీ తగ్గడం, మౌలిక సదుపాయాల రంగంలో ప్రాజెక్టులు మందగించడం ఇందుకు కారణాలు. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 13 శాతం పెరిగిందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు చెప్పారు. మొత్తం సిమెంట్‌ గిరాకీలో 35-40 

శాతం గిరాకీ ఈ రెండు రంగాలదే. 

సాధారణంగా వానాకాలం తర్వాత నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభంకావడంతో గిరాకీ, ధరలు కూడా పెరుగుతాయి. నవంబరు నుంచి జనవరి మధ్య కాలంలో గిరాకీ, ధరలు కొద్దిగా పుంజుకున్నాయి. మార్చి మొదటి వరకూ పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి.


- ఎస్‌.శ్రీకాంత్‌ రెడ్డి, జేఎండీ,  సాగర్‌ సిమెంట్‌ 

Updated Date - 2020-04-10T07:06:34+05:30 IST