May 11 2021 @ 19:32PM

'ఆదిపురుష్‌'కు లాక్‌డౌన్ ఎఫెక్ట్..?

బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవలే ముంబై నుంచి హైదరాబాద్ షెడ్యూల్ కోసం వచ్చింది చిత్ర బృదం. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ కూడా ప్రారంభం అయినట్టు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ( ఈనెల 12 ) నుంచి పదిరోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తు ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. ఈ ప్రభావం ఇప్పుడు 'ఆదిపురుష్' మీద పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. కానీ చిత్రీకరణ జరిగేది రామోజీ ఫిల్మ్ సిటీలో కాబట్టి ఈ లాక్‌డౌన్ ప్రభావం సినిమా మీద పడదనే మాట కూడా వినిపిస్తోంది. కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా కనిపించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.