మళ్లీ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2022-01-01T14:42:14+05:30 IST

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలులోకి తెచ్చింది. ఈ నెల 10వ తేదీ వరకు 17 కొత్త నిబంధనల్ని విధించింది. ఈ మేరకు

మళ్లీ లాక్‌డౌన్‌

- నిబంధనలు కఠినతరం 

- 10 వరకు అమలు

- థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులు

- శుభకార్యాలకు 100 మందికే అనుమతి

- 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు రద్దు

- సీఎం స్టాలిన్‌  


చెన్నై: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు స్టాలిన్‌ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమలులోకి తెచ్చింది. ఈ నెల 10వ తేదీ వరకు 17 కొత్త నిబంధనల్ని విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న పూర్తి సడలింపులను 50 శాతం వరకు తగ్గించారు. ఆ మేరకు సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాయామ శాలల్లో 50 శాతం మందిని మాత్రమే అనుమతించనున్నారు. లాక్‌డౌన్‌ పొడిగించే విషయమై సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికారులతో సమీక్ష జరిపారు. గత 15వ తేదీన ప్రకటించిన లాక్‌డౌన్‌ శుక్రవారం ముగియనుండటంతో శనివారం నుంచి మరో 15 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించటానికి వివిధ శాఖల అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసు కున్నారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు,  ‘ఒమైక్రాన్‌’ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగరంలో గత వారం వరకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉండేది. ఒక్కసారిగా పెరిగి ఆ సంఖ్య 1100 దాటింది. అదే సమయంలో రాష్ట్రంలో 120 మంది ‘ఒమైక్రాన్‌’ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కొత్త ఆంక్షలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, తమిళ నాడు సహా ఎనిమిది రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శుక్రవారం రాత్రితో ముగియనున్న లాక్‌డౌన్‌ను పొడిగించే విషయంగా స్టాలిన్‌ అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు దురైమురుగన్‌, ఎం. సుబ్రమణ్యం, కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి జే. రాధాకృష్ణన్‌,  గ్రేటర్‌ చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌జివాల్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిరోధానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను రాధాకృష్ణన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒమైక్రాన్‌ వైరస్‌ నేపధ్యంలో అవసరమైన కట్టుబాట్లను తక్షణమే అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు జనవరి ఒకటి నుంచి పదో తేదీ వరకు కొత్త కొవిడ్‌ నిబంధనలు అమలు చేయనున్నారు.


- 9 నుంచి 12 వరకు పాఠశాలలు, కళాశాలలు, వృత్తివిద్యా శిక్షణా కేంద్రాల్లో కరోనా నిబంధనల మేరకు తరగతులు నిర్వహిస్తారు.

- ఆలయాలు, చర్చిలు, మసీదులు తదితర ప్రార్థనాలయాలలో ప్రస్తుతమున్నట్లే ప్రజలకు అనుమతి 

- హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వసతిగృహాల్లో 50 శాతం మందికి మాత్రమే అనుమతి

- పార్కులు, వినోద క్లబ్లులో, జిమ్‌లలో 50 శాతం మందికి అనుమతి

- వివాహాది శుభకార్యాలకు 100 మందికి మాత్రమే అనుమతి

- అంత్యక్రియలు తదితర అశుభ కార్యాల్లో 50 మందికి అనుమతి

- వస్త్ర , నగల దుకాణాల్లో ఒకే సమయంలో 50 శాతం కస్టమర్లకు మాత్రమే అనుమతి

- మెట్రో రైళ్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఇండోర్‌స్టేడియంలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో 50 శాతం మందికి అనుమతి

- ఎగ్జిబిషన్లు, పుస్తక ప్రదర్శనలు 10 రోజులపాటు వాయిదా

Updated Date - 2022-01-01T14:42:14+05:30 IST